
న్యూఢిల్లీ: దేశీ ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో తిరిగి పుంజుకుని, 9–10 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలో అంచనాలు నెలకొన్నాయి. అయితే, తయారీ, సర్వీసుల రంగాలపై కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావాలపైనా ఆందోళనలు కూడా భయపెడుతున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో సుమారు 100 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. 56 శాతం మంది సీఈవోలు.. 2021–22లో ఎకానమీ 9 శాతం నుంచి 10 శాతం స్థాయిలో వృద్ధి చెందవచ్చని భావించగా.. అంతకు మించి ఉండవచ్చని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, తమ వ్యాపారాల సెంటిమెంటుపై 35 శాతం మంది సీఈవోలు ఆశావహంగా ఉన్నారు. కోవిడ్ పూర్వ (2019–20) స్థాయిలో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం 10–20 దాకా పెరగవచ్చని 35 శాతం మంది, 20 శాతానికి మించి వృద్ధి చెందవచ్చని 33 శాతం ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్థూల లాభాలు 20 శాతం పెరుగుతాయని 35 శాతం మంది సీఈవోలు, 10–20 శాతం వృద్ధి నమోదు కావచ్చని 17 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ‘మౌలిక సదుపాయాల కల్పనపై మరింతగా దృష్టి పెట్టడం, లిక్విడిటీని పెంచేందుకు సకాలంలో చర్యలు తీసుకోవడం, సంస్కరణలు మొదలైనవి పరిశ్రమ వర్గాల్లో ఆశాభావాన్ని పెంచాయి‘ అని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు.
మరిన్ని విశేషాలు..
- ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా సర్వీసుల రంగంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని 55% మంది సీఈవోలు, తయారీ కార్యకలాపాలు దెబ్బతినొచ్చని 34% మంది సీఈవోలు ఆందోళన వ్యక్తం చేశారు.
- తమ తమ రంగాల్లో సరఫరాపరమైన సమస్యలు నెలకొన్నప్పటికీ.. వ్యాపార వృద్ధిపై మూడొంతుల మంది సీఈవోలు ఆశావహంగా ఉన్నారు.
- కంపెనీల సామర్థ్యాల వినియోగం 70–100 % వరకూ ఉండగలదని 59% మంది సీఈవోలు అంచనా వేస్తున్నారు.
- ఎగుమతులపరంగా 2019–20తో పోల్చి చూస్తే 20% వృద్ధి ఉండొచ్చని 35% మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. పది శాతం మంది మాత్రం 50% పైగా ఉండొచ్చని ధీమాగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment