భౌతిక–డిజిటల్‌ విధానాల కలయిక తప్పనిసరి | Physical and digital modes of financial services to co-exist in India | Sakshi
Sakshi News home page

భౌతిక–డిజిటల్‌ విధానాల కలయిక తప్పనిసరి

Published Thu, Dec 23 2021 4:45 AM | Last Updated on Thu, Dec 23 2021 4:45 AM

Physical and digital modes of financial services to co-exist in India - Sakshi

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ సేవలకు సంబంధించి భారత్‌లో భౌతిక (ఫిజికల్‌), డిజిటల్‌ విధానాల మేలు కలయిక తప్పనిసరని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ దినేష్‌ ఖారా స్పష్టం చేశారు. విస్తృత భౌగోళిక అంశాలు దీనికి కారణంగా ఉంటాయని ఆయన అన్నారు. ‘ఐదు ట్రిలియన్‌ డాలర్ల దిశగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ పయనం దిశలో సవాళ్లు– పరిష్కారాలు’ అన్న అంశంపై ఫిక్కీ, ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన ఎఫ్‌ఐబీఏసీ 2021 వర్చువల్‌ సమావేశాల్లో చైర్మన్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు..

► భారతదేశంలో బ్యాంకింగ్‌ పలు రకాల వినియోగదారులకు సేవలను అందిస్తోంది.  మేము డిజిటల్‌ అవగాహన ఉన్నవారికి అలాగే  ఫోన్‌ క్లిక్‌ల ద్వారా భౌతికంగా ఏమీ పొందాలనుకోని వారికి కూడా సేవ చేస్తాము. ఆర్థిక–డిజిటల్‌ అక్షరాస్యత లేని వినియోగదారులు భారత్‌లో ఉన్న విషయాన్ని గమనించాలి.  

► కనుక భారతదేశం వంటి దేశంలో వినియోగదారులకు  భౌతిక, డిజిటల్‌ ఆర్థిక సేవలు రెండూ అవసరమని, ఈ విషయంలో సహజీవనం చేయక తప్పదని నేను భావిస్తున్నాను.  

► భారత్‌లో కో–లెండింగ్‌ నమూనా ఆవిర్భావం విషయానికి వస్తే, దేశంలో మారుమూల ఉన్న వారికిసైతం ఆర్థిక సేవలు అందాలన్న ప్రధాన ధ్యేయంతో  ఏర్పడిన యంత్రాంగం ఇది. ప్రస్తుతం సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌బీఐకి  65% శాఖలు ఉన్నాయని, ఇలాంటప్పుడు కూడా కో–లెండింగ్‌ భాగస్వామి అవసరమా? అని  అందరూ మాట్లాడుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు ఇంకా చొచ్చుకువెళ్లాల్సి ఉందని అనుకుంటున్నాను.  రుణగ్రహీతల అవసరాల గురించిన తగిన సమాచారాన్ని çకో–లెండింగ్‌ భాగస్వామి వ్యవస్థ తగిన విధంగా అందించగలుగుతుందని భావిస్తున్నాను.

► ఎస్‌బీఐ అటువంటి రెండు భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. మరికొందరితో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తోంది.  

► నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ) మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన నిర్ణయాలు తీసుకోడానికి వారి వద్దనున్న సమాచారం దోహదపడుతుంది.


టెక్నాలజీతో ఆర్థిక సేవల్లో పెను మార్పులు: కేవీ కామత్‌  
కొంగొత్త టెక్నాలజీల రాకతో ఆర్థిక సేవల రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని ప్రముఖ బ్యాంకరు, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రా అండ్‌ డెవలప్‌మెంట్‌ (నాబ్‌ఫిడ్‌) చైర్మన్‌ కేవీ కామత్‌ తెలిపారు. టెక్‌ ఆధారిత కొత్త తరం సంస్థలను కూడా నియంత్రణ నిబంధనల పరిధిలోకి తెచ్చేలా నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. తద్వారా సదరు రంగంలోని సంస్థలన్నింటికీ సమాన హోదా, నిబంధనలు వర్తించేలా కృషి చేయాలని ఫిక్కీ–ఎఫ్‌ఐబీఏసీ 2021 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కామత్‌ తెలిపారు.

డిజిటల్‌తో తగ్గిన బ్యాంకింగ్‌ భారం: గోయెల్‌
ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్, యుకో బ్యాంక్‌ సీఈఓ ఏకే గోయెల్‌ సమావేశంలో ప్రసంగిస్తూ, బ్యాంకింగ్‌ సేవల డిజిటలైజేషన్‌ వల్ల బ్రాంచీలపై భారం తగ్గిందని అన్నారు. అయితే ఇప్పటికీ 30 శాతం మంది ఫీచర్‌ ఫోన్లనే వినియోగిస్తున్న విషయం ఒక సమస్యగా ఉందని అన్నారు. సహ రుణ (కో–లెండింగ్‌) విధానం ద్వారా లేదా ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యంతో డిజిటల్‌ రుణాలను మెరుగుపరచవచ్చని, ఇది బ్యాంకు శాఖల భారాన్ని మరింత తగ్గించడానికి దోహదపడుతుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement