రుణాల డిమాండ్‌కు సరిపడా వనరులు ఉన్నాయ్
పెట్టుబడుల్లో కొంత వెనక్కి తీసుకుంటాం: ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా
ముంబై: రుణాలకు ఉన్న డిమాండ్‌ను తాము అందుకోగలమని, అందుకు సరిపడా వనరులు ఉన్నాయని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఖరా దీనిపై స్పష్టత ఇచ్చారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుదల తమకు సవాలు కాబోదన్నారు.
ప్రభుత్వ సెక్యూరిటీల్లో అదనంగా ఉంచిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నామని, రుణాల వృద్ధికి ఈ వనరులను వినియోగిస్తామని ఖరా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు రాని పరిస్థితి రెండేళ్లుగా నెలకొంది. ఇందుకు ఎస్‌బీఐ కూడా అతీతమేమీ కాకపోవడం గమనార్హం. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి.
డిపాజిట్లు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చొరవ చూపించాలంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు సూచించడం ఈ పరిణామాల్లో భాగమే. అధిక రాబడులు వచ్చే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడమే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు.
రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రస్తుత పరిస్థితి ఎంత మేర ఆందోళనకరమన్న ప్రశ్నకు ఖరా స్పందిస్తూ.. ‘‘రుణ వృద్ధికి సరిపడా సేవలు అందించే స్థితిలోనే ఉన్నాం. రుణాల డిమాండ్‌ను తీర్చగలిగినంత వరకు అది మాకు సవాలుగా పరిణమించదు’’అని వివరించారు. ఎంత రేటు ఆఫర్ చేయడం ద్వారా డిపాజిట్లను ఆకర్షించొచ్చన్న ప్రశ్నకు సూటిగా కాకుండా.. తమ నిధుల సమీకరణ వ్యూహాలను ఖరా వెల్లడించారు.
తమకు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటూ.. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్)లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రుణ డిమాండ్‌ను తీర్చగలమన్నారు. పెట్టుబడుల కంటే రుణాలపైనే ప్రస్తుతం రాబడులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితే 2003–04 లోనూ ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment