Indian Banking Association
-
భౌతిక–డిజిటల్ విధానాల కలయిక తప్పనిసరి
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సేవలకు సంబంధించి భారత్లో భౌతిక (ఫిజికల్), డిజిటల్ విధానాల మేలు కలయిక తప్పనిసరని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా స్పష్టం చేశారు. విస్తృత భౌగోళిక అంశాలు దీనికి కారణంగా ఉంటాయని ఆయన అన్నారు. ‘ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా భారత్ ఆర్థిక వ్యవస్థ పయనం దిశలో సవాళ్లు– పరిష్కారాలు’ అన్న అంశంపై ఫిక్కీ, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన ఎఫ్ఐబీఏసీ 2021 వర్చువల్ సమావేశాల్లో చైర్మన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► భారతదేశంలో బ్యాంకింగ్ పలు రకాల వినియోగదారులకు సేవలను అందిస్తోంది. మేము డిజిటల్ అవగాహన ఉన్నవారికి అలాగే ఫోన్ క్లిక్ల ద్వారా భౌతికంగా ఏమీ పొందాలనుకోని వారికి కూడా సేవ చేస్తాము. ఆర్థిక–డిజిటల్ అక్షరాస్యత లేని వినియోగదారులు భారత్లో ఉన్న విషయాన్ని గమనించాలి. ► కనుక భారతదేశం వంటి దేశంలో వినియోగదారులకు భౌతిక, డిజిటల్ ఆర్థిక సేవలు రెండూ అవసరమని, ఈ విషయంలో సహజీవనం చేయక తప్పదని నేను భావిస్తున్నాను. ► భారత్లో కో–లెండింగ్ నమూనా ఆవిర్భావం విషయానికి వస్తే, దేశంలో మారుమూల ఉన్న వారికిసైతం ఆర్థిక సేవలు అందాలన్న ప్రధాన ధ్యేయంతో ఏర్పడిన యంత్రాంగం ఇది. ప్రస్తుతం సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్బీఐకి 65% శాఖలు ఉన్నాయని, ఇలాంటప్పుడు కూడా కో–లెండింగ్ భాగస్వామి అవసరమా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు ఇంకా చొచ్చుకువెళ్లాల్సి ఉందని అనుకుంటున్నాను. రుణగ్రహీతల అవసరాల గురించిన తగిన సమాచారాన్ని çకో–లెండింగ్ భాగస్వామి వ్యవస్థ తగిన విధంగా అందించగలుగుతుందని భావిస్తున్నాను. ► ఎస్బీఐ అటువంటి రెండు భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. మరికొందరితో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తోంది. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన నిర్ణయాలు తీసుకోడానికి వారి వద్దనున్న సమాచారం దోహదపడుతుంది. టెక్నాలజీతో ఆర్థిక సేవల్లో పెను మార్పులు: కేవీ కామత్ కొంగొత్త టెక్నాలజీల రాకతో ఆర్థిక సేవల రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని ప్రముఖ బ్యాంకరు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ (నాబ్ఫిడ్) చైర్మన్ కేవీ కామత్ తెలిపారు. టెక్ ఆధారిత కొత్త తరం సంస్థలను కూడా నియంత్రణ నిబంధనల పరిధిలోకి తెచ్చేలా నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. తద్వారా సదరు రంగంలోని సంస్థలన్నింటికీ సమాన హోదా, నిబంధనలు వర్తించేలా కృషి చేయాలని ఫిక్కీ–ఎఫ్ఐబీఏసీ 2021 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా కామత్ తెలిపారు. డిజిటల్తో తగ్గిన బ్యాంకింగ్ భారం: గోయెల్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్, యుకో బ్యాంక్ సీఈఓ ఏకే గోయెల్ సమావేశంలో ప్రసంగిస్తూ, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ వల్ల బ్రాంచీలపై భారం తగ్గిందని అన్నారు. అయితే ఇప్పటికీ 30 శాతం మంది ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్న విషయం ఒక సమస్యగా ఉందని అన్నారు. సహ రుణ (కో–లెండింగ్) విధానం ద్వారా లేదా ఫిన్టెక్లతో భాగస్వామ్యంతో డిజిటల్ రుణాలను మెరుగుపరచవచ్చని, ఇది బ్యాంకు శాఖల భారాన్ని మరింత తగ్గించడానికి దోహదపడుతుందని అన్నారు. -
నిరవధిక సమ్మె బాటలో బ్యాంకు ఉద్యోగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో మంగళవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతం కావడంతో కొత్త ఏడాది ప్రారంభంలో నిరవధిక సమ్మెకు ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. వేతన సవరణపై ప్రభుత్వం ఒక మెట్టు కూడా దిగిరాకపోవడంతో నిరవధిక సమ్మె లేక వరుసగా ఆరు రోజులు సమ్మె జరిపే యోచనలో బ్యాంకు ఉద్యోగ సంఘాలున్నాయి. తదుపరి కార్యాచరణపై డిసెంబర్ రెండో వారంలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. ఇంత వరకూ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక రోజు సమ్మెల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియచేస్తూ వచ్చామని, అయినా ప్రభుత్వం తన మొండి పట్టుదల వీడకపోవడంతో ఖాతాదారులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. గత నెలరోజుల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడం ఇది రెండవసారి. నవంబర్ 12న ఒక రోజు సమ్మె జరిగింది. దీర్ఘకాలిక సమ్మెపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ నేషనల్ కన్వీనర్ మురళి తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు కనీసం 23 శాతం పెంచాలని డిమాండ్ చేస్తుంటే..ప్రభుత్వం 11 శాతం మించి పెంచడానికి ముందుకు రావడం లేదు. కనీసం రెండు శాతం పెంపుతో ముందుకు వస్తే సమ్మె ఆపి చర్చలకు వస్తామని తాము ముందుకొచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని రాంబాబు ఆరోపించారు. గతేడాది ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ లాభం రూ. 1.10 లక్షల కోట్లుగా ఉందని, ఈ లాభాలకు కారణమైన తమకు ఇందులో రూ. 7,000 కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రాకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి బాగా పెరుగుతోంది. సమ్మె దిగ్విజయం: యూనియన్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రోజు సమ్మె విజయవంతం అయినట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. చెన్నైలోని చెక్ క్లియరెన్స్ గ్రిడ్ పనిచేయకపోవడంతో సమ్మె ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా కనిపించిందని యూనియన్ వర్గాలు తెలిపాయి. రూ. 1.75,000 కోట్ల విలువైన 2.50 కోట్ల చెక్కులు క్లియరెన్స్ నిలిచిపోయిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 80,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొనగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండు లక్షలమందికిపైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు అంచనా. బుధవారం నుంచి మిగిలిన మూడు జోన్లలో జరిగే సమ్మె ప్రభావం దక్షిణాది రాష్ట్రాల చెక్ క్లియరెన్స్లపై ఉంటుందంటున్నారు. మంగళవారంనాటి ప్రభుత్వ బ్యాంకు సిబ్బంది సమ్మె సందర్భంగా దక్షిణాదిన ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేశాయి. వేతన సవరణపై సోమవారం ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్తో (ఐబీఏ) చర్చలు విఫలం కావడంతో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఈ సమ్మె కు పిలుపునిచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు జోన్లవారీగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే సమ్మె చేయాలని నిర్ణయించారు. మంగళవారం దక్షిణాదిన సమ్మె జరగ్గా, ఉత్తరాది జోన్లో 3న, తూర్పు జోన్లో 4న, పశ్చిమ జోన్లో 5న స్ట్రయిక్ చేస్తున్నారు.