నిరవధిక సమ్మె బాటలో బ్యాంకు ఉద్యోగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో మంగళవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతం కావడంతో కొత్త ఏడాది ప్రారంభంలో నిరవధిక సమ్మెకు ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. వేతన సవరణపై ప్రభుత్వం ఒక మెట్టు కూడా దిగిరాకపోవడంతో నిరవధిక సమ్మె లేక వరుసగా ఆరు రోజులు సమ్మె జరిపే యోచనలో బ్యాంకు ఉద్యోగ సంఘాలున్నాయి. తదుపరి కార్యాచరణపై డిసెంబర్ రెండో వారంలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు.
ఇంత వరకూ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక రోజు సమ్మెల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియచేస్తూ వచ్చామని, అయినా ప్రభుత్వం తన మొండి పట్టుదల వీడకపోవడంతో ఖాతాదారులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. గత నెలరోజుల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడం ఇది రెండవసారి. నవంబర్ 12న ఒక రోజు సమ్మె జరిగింది. దీర్ఘకాలిక సమ్మెపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ నేషనల్ కన్వీనర్ మురళి తెలిపారు.
బ్యాంకు ఉద్యోగులు కనీసం 23 శాతం పెంచాలని డిమాండ్ చేస్తుంటే..ప్రభుత్వం 11 శాతం మించి పెంచడానికి ముందుకు రావడం లేదు. కనీసం రెండు శాతం పెంపుతో ముందుకు వస్తే సమ్మె ఆపి చర్చలకు వస్తామని తాము ముందుకొచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని రాంబాబు ఆరోపించారు. గతేడాది ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ లాభం రూ. 1.10 లక్షల కోట్లుగా ఉందని, ఈ లాభాలకు కారణమైన తమకు ఇందులో రూ. 7,000 కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రాకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి బాగా పెరుగుతోంది.
సమ్మె దిగ్విజయం: యూనియన్లు
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రోజు సమ్మె విజయవంతం అయినట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. చెన్నైలోని చెక్ క్లియరెన్స్ గ్రిడ్ పనిచేయకపోవడంతో సమ్మె ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా కనిపించిందని యూనియన్ వర్గాలు తెలిపాయి. రూ. 1.75,000 కోట్ల విలువైన 2.50 కోట్ల చెక్కులు క్లియరెన్స్ నిలిచిపోయిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో 80,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొనగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండు లక్షలమందికిపైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు అంచనా. బుధవారం నుంచి మిగిలిన మూడు జోన్లలో జరిగే సమ్మె ప్రభావం దక్షిణాది రాష్ట్రాల చెక్ క్లియరెన్స్‌లపై ఉంటుందంటున్నారు. మంగళవారంనాటి ప్రభుత్వ బ్యాంకు సిబ్బంది సమ్మె సందర్భంగా దక్షిణాదిన ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేశాయి.
వేతన సవరణపై సోమవారం ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్‌తో (ఐబీఏ) చర్చలు విఫలం కావడంతో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె కు పిలుపునిచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు జోన్లవారీగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే సమ్మె చేయాలని నిర్ణయించారు. మంగళవారం దక్షిణాదిన సమ్మె జరగ్గా, ఉత్తరాది జోన్‌లో 3న, తూర్పు జోన్‌లో 4న, పశ్చిమ జోన్‌లో 5న స్ట్రయిక్ చేస్తున్నారు.