ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బులెటిన్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ విశ్లేషించింది. కరోనా ప్రేరిత అంశాలతో అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లోనే వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంచనావేసింది. కాగా ఆర్‌బీఐ అధికారులు రాసిన ఈ ఆర్టికల్‌లో వ్యక్తమైన అభిప్రాయాలను రచయితల అభిప్రాయాలుగానే పరిగణించాలితప్ప, ఆర్‌బీఐకి ఆపాదించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొనడం గమనార్హం.
తొలి త్రైమాసికంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 23.9 శాతంగా నమోదుకావడం... దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 8% నుంచి 14% వరకూ ఉంటుందని పలు రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనాలు... అటు తర్వాత కనబడిన ఆర్థిక క్రియాశీలత... సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణరేటు 7.5 శాతానికి కట్టడి... ఈ సానుకూల వాతావరణంలో ఆర్‌బీఐసహా పలు సంస్థల తమ క్షీణ అంచనాలను సవరించడం (2020–21 ఆర్థిక సంవత్సరానికి) వంటి అంశాల నేపథ్యంలో వెలువడిన ఆర్టికల్‌లో ముఖ్యాంశాలు చూస్తే...
► కోవిడ్–19 కఠిన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలోనే భారత్ 0.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం.
► భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంకేతంగా రెండు అంశాలను ప్రస్తావించుకోవచ్చు. అందులో ఒకటి సెప్టెంబర్ మధ్యస్థం నుంచే పెట్టుబడులు, వినియోగ డిమాండ్ విషయంలో సానుకూలత కనిపించింది. ఇక రెండవ విషయానికి వస్తే, ద్రవ్యపరమైన చర్యలు వినియోగంవైపే కాకుండా, పెట్టుబడుల వైపునకూ మళ్లాయి.
► దేశంలో సెకండ్‌వేవ్ ప్రభావం పెద్దగా కనిపించని పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సంబంధించిన ద్రవ్యపరమైన చర్యలు మరింత ఊపందుకున్నాయి.
► ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పలు సానుకూల అంశాల నేపథ్యంలోనే క్షీణతకు సంబంధించి తొలి అంచనాల సవరణ జరుగుతోంది. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్, గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది.
త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సానుకూలత పరిస్థితుల్లో ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్‌బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి), ఎస్‌అండ్‌పీ ఆ సంస్థ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి), ఇక్రా (–11 శాతం నుంచి 7.8 శాతానికి) ఎస్‌బీఐ రీసెర్చ్ (– 10.9 శాతం నుంచి 7.4 శాతానికి) క్షీణ అంచనాలను తగ్గించాయి.
క్షీణ అంచనాలను తగ్గించిన ఇండియా రేటింగ్స్
కాగా, 2020–21 భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన తొలి క్షీణ అంచనాలను ఇండియా రేటింగ్స్ గురువారం 11.8 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గించింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా – 0.8 శాతం, – 0.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.6 శాతంగా విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment