ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ఏ సవాలునైనా తట్టుకోగల స్థితిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలూ రాకుండా ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ఇతర కీలక కమోడిటీ ధరలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ వ్యవస్థకు ఈ భరోసాను కల్పించడం గమనార్హం. భారత పరిశ్రమల సమాఖ్య– సీఐఐ నిర్వహించిన ఒక పారిశ్రామిక సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు...
► మార్చి 2020లో మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినప్పటి నుండి సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలోకి రూ. 17 లక్షల కోట్లను పంప్ చేసింది. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లు తలెత్తకుండా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది.
► అవసరమైన పరిస్థితుల్లో ఆర్‌బీఐ లిక్విడిటీ చర్యల ఉపసంహరణ ప్రక్రియను చాలా సజావుగా నిర్వహిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక రంగాల అవసరాలను తీర్చే విషయంలో తగినంత ద్రవ్య లభ్యత కొనసాగుతుంది.
► బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు గణనీయంగా మెరుగుపడింది. మూలధన నిష్పత్తి 16 శాతంగా ఉంది. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏ) రికార్డు స్థాయిలో 6.5 శాతానికి పడిపోయాయి.
► యుద్ధంతో తీవ్ర సవాళ్లు తలెత్తినప్పటికీ అధిక ఫారెక్స్ నిల్వలు, తక్కువ కరెంట్ అకౌంట్ లోటు ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా స్థితిలో ఉంచుతోంది.
► దేశంలోకి వచ్చీ–పోయే నిధుల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే క్యాడ్ (కరెంట్ అకౌంట్ లోటు)ను నిర్వహించగలిగిన సత్తా దేశానికి ఉంది. ఇందుకు సంబంధించి ఎటుంటి సవాళ్లు ఎదురైనా భారత్ తగిన విధంగా ఎదుర్కొనగలుగుతుంది.
► భారతదేశం ఆంక్షలను ఎదుర్కొంటుందని భయపడాల్సిన పనిలేదు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ఆర్‌బీఐ ఫారెక్స్ నిల్వలు (దాదాపు 630 బిలియన్ డాలర్లపైన) తగిన విధంగా చక్కని వైవిధ్యభరిత స్థాయిలో ఉన్నాయి.
► ఆర్‌బీఐ విదేశీ కరెన్సీ అసెట్స్‌లో అమెరికా డాలర్లు మెజారిటీని కలిగి ఉండగా, ఆరు నెలల క్రితం ఇతర కరెన్సీలలో తన అసెట్స్‌ను విస్తరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
► భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆర్‌బీఐ ట్రాక్ చేసే దాదాపు 60 హై–ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి.
స్టాగ్‌ఫ్లేషన్ భయాలు అక్కర్లేదు..
సరళతర ద్రవ్య విధానానికి తిలోదకాలిచ్చే అంచనాలను ఆర్‌బీఐ వ్యతిరేకిస్తుంది. వృద్ధికి తోడ్పాటు కోసం తగిన అన్ని చర్యలనూ ఆర్‌బీఐ తీసుకుంటుంది. వరుసగా రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నిర్ధేశిత ఆర శాతం స్థాయిని దాటినప్పటికీ ఇది తగ్గుముఖం పడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ధరల స్థిరత్వం, దానిని అదుపులో ఉంచడం సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కర్తవ్యం. దీనిని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది.
ఇక భారతదేశానికి స్టాగ్‌ఫ్లేషన్ అవకాశం లేదు. ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)కు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం) ఆరు స్థాయిలోనే కొనసాగుతుందని భావించవద్దు. ఇది దిగివస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో విశ్లేషకులు, నిపుణులు రేట్ల పెంపు, సరళతర ద్రవ్య విధానం నుంచి సెంట్రల్ బ్యాంక్ వైదొలడం వంటి అంచనాల నేపథ్యంలో దాస్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే, దేశంలో స్టాగ్‌ఫ్లేషన్ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని బహుళజాతి బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ– మోర్టాన్ స్టాన్లీ ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది.
ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని పరపతి విధాన కమిటీ మెజారిటీ అభిప్రాయపడింది. రెపో యథాతథ కొనసాగింపునకు ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment