దీనితో అందరికీ ఆర్థిక సేవల అందుబాటు
ఇప్పటికే యూపీఐతో అందుతున్న సౌలభ్యతలను చూస్తున్నాం...
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
ముంబై: ఫైనాన్స్‌లో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. తక్కువ వ్యయాలతో అందరికీ ఫైనాన్షియల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఫైనాన్స్ డిజిటలైజేషన్ దోహదపడుతుందని వివరించారు. 2023–24 కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ (ఆర్‌సీఎఫ్)లో ఆయన ముందుమాట రాస్తూ, ఫ్లాగ్‌షిప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగదారుల రిటైల్ చెల్లింపుల విధానాన్ని విప్లవాత్మకంగా మార్చిందని పేర్కొన్నారు.
ఈ కామర్స్ విభాగ పురోగతినీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లావాదేవీలను వేగవంతంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తేలిగ్గా నిర్వహించేలా చేసిందని గవర్నర్ చెప్పారు. డిజిటల్ కరెన్సీ రంగంలో ఈ– రూపాయి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల(సీబీడీసీ) ప్రయోగాత్మక అమల్లో రిజర్వ్ బ్యాంక్ ముందంజలో ఉందని అన్నారు. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్‌మెంట్ నెట్‌వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్, ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ రుణ వ్యవస్థ శక్తివంతంగా మారుతోందన్నారు.
బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్‌బీఎఫ్‌సీ) లెండింగ్ సరీ్వస్ ప్రొవైడర్లుగా ఫిన్‌టెక్‌లు సహకరిస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు డిజటలైజేషన్ ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, డేటా బయాస్, వెండర్, థర్డ్–పార్టీ రిస్‌్కలు వంటి సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. మరోవైపు డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉందని నివేదిక పేర్కొంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతు వాటా కలిగి ఉందని 2026 నాటికి ఇది ఐదవ వంతుగా పురోగమిస్తుందని నివేదిక అంచనావేసింది.
ఆర్‌బీఐ ప్రస్థానంపై వెబ్ సిరీస్
రిజర్వ్ బ్యాంక్ తన తొంభై ఏళ్ల ప్రస్థానంపై అయిదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌ను రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25–30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ సుమారు మూడు గంటలు ఉంటుంది. దీన్ని జాతీయ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారం చేసే యోచన ఉన్నట్లు సిరీస్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన పత్రంలో ఆర్‌బీఐ తెలిపింది. ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత, దాని కార్యకలాపాలు మొదలైన వాటి గురించి అవగాహన కలిగించే విధంగా ఈ సిరీస్ ఉంటుంది. 1935లో ఏర్పాటైన ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment