banking reforms
-
ఫైనాన్స్ డిజిటలైజేషన్‌తో కొత్తతరం బ్యాంకింగ్
ముంబై: ఫైనాన్స్‌లో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. తక్కువ వ్యయాలతో అందరికీ ఫైనాన్షియల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఫైనాన్స్ డిజిటలైజేషన్ దోహదపడుతుందని వివరించారు. 2023–24 కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ (ఆర్సీఎఫ్)లో ఆయన ముందుమాట రాస్తూ, ఫ్లాగ్షిప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారుల రిటైల్ చెల్లింపుల విధానాన్ని విప్లవాత్మకంగా మార్చిందని పేర్కొన్నారు. ఈ కామర్స్ విభాగ పురోగతినీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లావాదేవీలను వేగవంతంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తేలిగ్గా నిర్వహించేలా చేసిందని గవర్నర్ చెప్పారు. డిజిటల్ కరెన్సీ రంగంలో ఈ– రూపాయి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల(సీబీడీసీ) ప్రయోగాత్మక అమల్లో రిజర్వ్ బ్యాంక్ ముందంజలో ఉందని అన్నారు. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్, ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ రుణ వ్యవస్థ శక్తివంతంగా మారుతోందన్నారు. బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) లెండింగ్ సరీ్వస్ ప్రొవైడర్లుగా ఫిన్‌టెక్‌లు సహకరిస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు డిజటలైజేషన్ ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, డేటా బయాస్, వెండర్, థర్డ్–పార్టీ రిస్‌్కలు వంటి సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మరోవైపు డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉందని నివేదిక పేర్కొంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతు వాటా కలిగి ఉందని 2026 నాటికి ఇది ఐదవ వంతుగా పురోగమిస్తుందని నివేదిక అంచనావేసింది. ఆర్బీఐ ప్రస్థానంపై వెబ్ సిరీస్ రిజర్వ్ బ్యాంక్ తన తొంభై ఏళ్ల ప్రస్థానంపై అయిదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌ను రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25–30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ సుమారు మూడు గంటలు ఉంటుంది. దీన్ని జాతీయ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారం చేసే యోచన ఉన్నట్లు సిరీస్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన పత్రంలో ఆర్బీఐ తెలిపింది. ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత, దాని కార్యకలాపాలు మొదలైన వాటి గురించి అవగాహన కలిగించే విధంగా ఈ సిరీస్ ఉంటుంది. 1935లో ఏర్పాటైన ఆర్బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. -
బ్యాంకుల విలీనం; ఖాతాదారుల పరిస్థితేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాలను నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకుల విలీనంతో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియక ఖాతాదారులు అయోమయంలో ఉన్నారు. బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు పెద్దగా నష్టపోయేదేమి ఉండదు. కాకపొతే కొన్ని మార్పులు తప్పవు. అవేంటో గమనించండి. మారేవి... 1. కొత్త చెక్‌బుక్, డెబిట్/క్రెడిట్ కార్డులు ఇస్తారు 2. అకౌంట్ నంబరు, కస్టమర్ ఐడీతో పాటు ఐఎఫ్ఎస్ఈ కోడ్ కూడా మారుతుంది 3. మారిన ఐఎఫ్ఎస్ఈ కోడ్ ఆదాయపన్ను శాఖ, బీమా కంపెనీ వద్ద అప్డేట్ చేసుకోవాలి 4. ఈఎంఐలు, సిప్‌లు చేసేవారు తాజాగా బ్యాంకుల నుంచి ఆమోదపత్రం ఇవాల్సి ఉంటుంది 5. బిల్ పేమెంట్లకు తాజాగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు 6. మీ బ్యాంకు బ్రాంచ్ మీకు దగ్గరగా లేదా దూరంగా మారొచ్చు 7. బ్యాంకు స్టేషనరీ కూడా మారిపోతుంది 8. సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లు కూడా మారే అవకాశముంది. మారనివి.. 1. ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు యథాతథంగా ఉంటాయి 2. ఫిక్సిడ్ డిపాజిట్లను చివరి వరకు ఉంచితే ప్రస్తుతం వస్తున్న వడ్డీతో తీసుకోవచ్చు 3. రుణాల రేట్లు కూడా మారవు 4. ఎంసీఎల్ఆర్ రుణాలపై గడువు ఆధారంగా వడ్డీ రేట్లు మారతాయి. సంబంధిత వార్తలు బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు భారీగా ప్రభుత్వ బ్యాంకుల విలీనం షాకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ -
బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కీలక బ్యాంకింగ్ రంగ సంస్కరణలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకుల ఏకీకరణను వెల్లడించారు. బ్యాంకుల రీకాపిటలైజేషన్ (నిధులతో ఉద్దీపన) ద్వారా పలు బ్యాంకులు ఇప్పటికే రెపోరేట్ల ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు పలు ప్రభుత్వ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. మొత్తం 10 బ్యాంకులను కలిపి 4 కొత్త అతిపెద్ద బ్యాంకులుగా రూపొందనున్నాయన్నారు. దీంతో మొత్తం పీఎస్‌యూల సంఖ్య 27 నుంచి 12కి తగ్గనుంది. అయితే ఈ విలీనం ప్రభావంతో ఎలాంటి తొలగింపులు వుండవని స్పష్టం చేశారు. నియామకాలు: నియమాక ప్రమాణాలను, పద్ధతులల్లో కూడా సంస్కరణ తీసుకొస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు బ్యాంకుల బోర్డులను బలోపేతం చేస్తామని, అలాగే బోర్డు సైజ్‌ను నిర్ణయించే అధికారం బ్యాంకులకే ఉంటుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రతీ బ్యాంకులో స్పెషల్ రిస్క్ ఆఫసర్లను నియమిస్తామనీ, అయితే వీరికి జీతాలు ప్రభుత్వం చెల్లించదని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. బ్యాంకుల విలీనం: పంజాబ్ నేషనల్ బ్యాంకు, (పీఎన్బీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా 11437 బ్రాంచిలతో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా విలీన బ్యాంకు అవతరించనుంది. ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ విలీనం ద్వారా నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరించనుంది. కాగా మీడియా సమావేశానికి ముందే నిర్మలా సీతారామన్ పది ప్రభుత్వ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో మంత్రి భేటీ అయ్యారు ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ బ్యాంకుల్లో వాటా విక్రయానికి బ్యాక్ డోర్ పాలసీ
హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు ద్వారా వాటా తగ్గించుకునేలా సర్కారు వ్యూహం * నాయక్ కమిటీ సిఫార్సులపై బ్యాంకింగ్ యూనియన్ల వ్యతిరేకతే కారణం * హోల్డింగ్ కంపెనీని లిస్ట్ చేసే యోచన * విస్తరణకు కావల్సిన నిధులు సమకూర్చలేకపోవడమే ప్రధాన కారణం * ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.11,200 కోట్లు కేటాయింపు * అదనపు నిధులు సమకూర్చలేని స్థితిలో కేంద్రం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వానికి ఉన్న వాటలన్నింటినీ ఒకే కంపెనీ పరిధిలోకి తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసి పీఎస్‌యూ బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ వాటాలను ఈ కంపెనీకి బదలాయించనున్నారన్నది సమాచారం. దీనికి సంబంధించి 2012లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు దుమ్ముదులిపే యోచనలో కేంద్రం ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవాలంటూ నాయక్ కమిటీ చేసిన సిఫార్సులపై బ్యాంకు యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దొడ్డిదారిన ప్రభుత్వం తన వాటాలను వదలించుకునే పనిలో పడిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. నాయక్ కమిటీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం దిగువకు తగ్గించుకోమని సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ద్వారా పీఎస్‌యూ బ్యాంకులకు అవసరమైన మూలధనం సమకూర్చే బాధ్యత నుంచి ప్రభుత్వం ప్రత్యక్షంగా తప్పించుకోనుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని స్టాక్ మార్కెట్లో నమోదు చేయడం ద్వారా బ్యాంకులకు అవసరమైన నిధులను సమకూర్చనుంది. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వానికి వున్న వాటాలను విక్రయించడం ద్వారా కాకుండా ఆ వాటాల్ని హోల్డింగ్ కంపెనీకి బదిలీ చేయడం వల్ల యూనియన్ల వ్యతిరేకత తగ్గుతుందన్నది కేంద్రం యోచనగా చెపుతున్నారు. ఆ హోల్డింగ్ కంపెనీలో ప్రభుత్వం ప్రధాన వాటాను అట్టిపెట్టుకొని, కొంత శాతం పబ్లిక్ ఇష్యూగా జారీచేస్తారని బ్యాంకింగ్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాంకుల పనితీరు ఆధారంగా హోల్డింగ్ కంపెనీ నిధులను సమకూరుస్తుందని సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం. ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. దీంతో బ్యాంకుల మధ్య పనితీరులో పోటీ పెరుగుతుందని, కాని ఇది వెంటనే అమల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పుడు బ్యాంకులు తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా సమకూర్చలేదు కాబట్టి పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని విజయా బ్యాంక్ ఈడీ బి.ఎస్.రామారావు పేర్కొన్నారు. బ్యాంకులకు మూల ధనం అవసరమైనప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు బాండ్లను జారీ చేయడం ద్వారా నిధులను అందిస్తుందని, దీంతో ప్రభుత్వానికి నిధులు సమకూర్చే తలనొప్పి తప్పుతుందని ఎస్బీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్ మాడభూషి తెలిపారు. చేతులెత్తేస్తున్న ప్రభుత్వం: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల వ్యాపార విస్తరణకు కనీసం రూ. 40,000 నుంచి రూ.50,000 కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్బీఐ అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం కనీసం రూ.6-7 లక్షల కోట్లు మూలధనాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. కాని ఈ ఏడాది ఇందులో పావు శాతం కూడా సమకూర్చే స్థాయిలో ప్రభుత్వం లేదు. గతేడాది రూ.14,000 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఓటాన్ అకౌంట్లో రూ.11,200 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని పూర్తి బడ్జెట్లో పెంచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర బ్యాంకింగ్ కార్యదర్శి జి.ఎస్.సంధు తెలిపారు. దీంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యూనియన్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పేరుతో ప్రభుత్వం పరోక్షంగా తన బాధ్యతల నుంచి తప్పించుకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడమని బ్యాంక్ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రూపంలో కాని మరే విధంగానైనా ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవాలని చూస్తే నిరవధిక సమ్మెను చేపడతామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) సంయుక్త కార్యదర్శి బి.ఎస్. రాంబాబు తెలిపారు. నాయక్ కమిటీ పేరుతో బ్యాంకింగ్ రంగాన్ని సెంట్రల్ విజిలెన్స్, ఆర్టీఐ చట్టాల నుంచి మినహాయించే విధంగా కుట్రలు జరుగుతున్నాయని దీన్ని అన్ని యూనియన్లు సంఘటితంగా అడ్డుకుంటామని హర్షవర్థన్ తెలిపారు.