ప్రభుత్వ బ్యాంకుల్లో వాటా విక్రయానికి బ్యాక్ డోర్ పాలసీ
హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు ద్వారా వాటా తగ్గించుకునేలా సర్కారు వ్యూహం
* నాయక్ కమిటీ సిఫార్సులపై బ్యాంకింగ్ యూనియన్ల వ్యతిరేకతే కారణం
* హోల్డింగ్ కంపెనీని లిస్ట్ చేసే యోచన
* విస్తరణకు కావల్సిన నిధులు సమకూర్చలేకపోవడమే ప్రధాన కారణం
* ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.11,200 కోట్లు కేటాయింపు
* అదనపు నిధులు సమకూర్చలేని స్థితిలో కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వానికి ఉన్న వాటలన్నింటినీ ఒకే కంపెనీ పరిధిలోకి తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేసి పీఎస్‌యూ బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ వాటాలను ఈ కంపెనీకి బదలాయించనున్నారన్నది సమాచారం. దీనికి సంబంధించి 2012లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు దుమ్ముదులిపే యోచనలో కేంద్రం ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవాలంటూ నాయక్ కమిటీ చేసిన సిఫార్సులపై బ్యాంకు యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దొడ్డిదారిన ప్రభుత్వం తన వాటాలను వదలించుకునే పనిలో పడిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
నాయక్ కమిటీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం దిగువకు తగ్గించుకోమని సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ద్వారా పీఎస్‌యూ బ్యాంకులకు అవసరమైన మూలధనం సమకూర్చే బాధ్యత నుంచి ప్రభుత్వం ప్రత్యక్షంగా తప్పించుకోనుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని స్టాక్ మార్కెట్లో నమోదు చేయడం ద్వారా బ్యాంకులకు అవసరమైన నిధులను సమకూర్చనుంది. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వానికి వున్న వాటాలను విక్రయించడం ద్వారా కాకుండా ఆ వాటాల్ని హోల్డింగ్ కంపెనీకి బదిలీ చేయడం వల్ల యూనియన్ల వ్యతిరేకత తగ్గుతుందన్నది కేంద్రం యోచనగా చెపుతున్నారు. ఆ హోల్డింగ్ కంపెనీలో ప్రభుత్వం ప్రధాన వాటాను అట్టిపెట్టుకొని, కొంత శాతం పబ్లిక్ ఇష్యూగా జారీచేస్తారని బ్యాంకింగ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాంకుల పనితీరు ఆధారంగా హోల్డింగ్ కంపెనీ నిధులను సమకూరుస్తుందని సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం. ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. దీంతో బ్యాంకుల మధ్య పనితీరులో పోటీ పెరుగుతుందని, కాని ఇది వెంటనే అమల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పుడు బ్యాంకులు తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా సమకూర్చలేదు కాబట్టి పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని విజయా బ్యాంక్ ఈడీ బి.ఎస్.రామారావు పేర్కొన్నారు. బ్యాంకులకు మూల ధనం అవసరమైనప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు బాండ్లను జారీ చేయడం ద్వారా నిధులను అందిస్తుందని, దీంతో ప్రభుత్వానికి నిధులు సమకూర్చే తలనొప్పి తప్పుతుందని ఎస్‌బీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్ మాడభూషి తెలిపారు.
చేతులెత్తేస్తున్న ప్రభుత్వం: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల వ్యాపార విస్తరణకు కనీసం రూ. 40,000 నుంచి రూ.50,000 కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్‌బీఐ అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం కనీసం రూ.6-7 లక్షల కోట్లు మూలధనాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. కాని ఈ ఏడాది ఇందులో పావు శాతం కూడా సమకూర్చే స్థాయిలో ప్రభుత్వం లేదు. గతేడాది రూ.14,000 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఓటాన్ అకౌంట్‌లో రూ.11,200 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని పూర్తి బడ్జెట్‌లో పెంచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర బ్యాంకింగ్ కార్యదర్శి జి.ఎస్.సంధు తెలిపారు. దీంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యూనియన్లు
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ పేరుతో ప్రభుత్వం పరోక్షంగా తన బాధ్యతల నుంచి తప్పించుకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడమని బ్యాంక్ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ రూపంలో కాని మరే విధంగానైనా ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవాలని చూస్తే నిరవధిక సమ్మెను చేపడతామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) సంయుక్త కార్యదర్శి బి.ఎస్. రాంబాబు తెలిపారు. నాయక్ కమిటీ పేరుతో బ్యాంకింగ్ రంగాన్ని సెంట్రల్ విజిలెన్స్, ఆర్‌టీఐ చట్టాల నుంచి మినహాయించే విధంగా కుట్రలు జరుగుతున్నాయని దీన్ని అన్ని యూనియన్లు సంఘటితంగా అడ్డుకుంటామని హర్షవర్థన్ తెలిపారు.