న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్ట స్థాయి నుంచి త్వరలోనే పుంజుకుంటుందని మైనింగ్ దిగ్గజం, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నును భారీగా తగ్గించినందున అది పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలాగే, మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున చేసే పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలపై వ్యయాలతోపాటు, దేశంలో దాగి ఉన్న సహజ వనరులను వెలికితీసే విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
అలాగే, అధిక శాతం ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని పరిశీలించాలని కూడా సూచించారు. ప్రభుత్వరంగ కంపెనీలు స్వతంత్రంగా పనిచేయగలిగితే ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలవన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థ తిరిగి అధిక వృద్ధి బాట పడుతుంది. సొరంగం చివర్లో వెలుగును నేను చూశాను. ఇది ఎంతో దూరంలో లేదు’’ అని అనిల్ అగర్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జీఎస్‌టీ ప్రభావం తాత్కాలికమేనని, ఇది గాడిన పడినట్టు చెప్పారు. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. వృద్ధి రేటుకు ప్రోత్సాహకంగా కేంద్రం కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం గమనార్హం.
నిబంధనల అడ్డు తొలగించాలి..
ప్రపంచంలో తక్కువ పన్ను రేట్లు ఉన్న భారత్ పెట్టుబడులకు సహజ గమ్యస్థానమని అనిల్ అగర్వాల్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో వ్యాపారాలు చేయాలనుకునే వారికి భారత్ ఉత్తమ ప్రదేశంగా ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment