న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ ఇంకా పేలవంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో 2022–23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ బుధవారం ఒక ప్రీ–బడ్జెట్ సిఫారసుల నోట్‌ను విడుదలచేశారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం, మహమ్మారిని ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
ద్రవ్యలోటు పరమైన ఇబ్బందుల పరిశీలించడం మాత్రమే తాజా పరిస్థితుల్లో సరికాదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విక్రయం ద్వారా ఎల్‌ఐసీ వాటా విక్రయాన్ని పూర్తిచేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇది అత్యుత్తమ పప్రారంభం అవుతుంది. 2022–23లో ఖజానాకు దాదాపు రూ.3 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోడానికి, ద్రవ్యలోటును 6.3 శాతానికి తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. ద్రవ్యలోటు కట్టడి చేయాలన్నా అది 40 బేసిస్ పాయింట్ల కన్నా అధికంగా ఉండకూడదు.
ప్రస్తుతం ఎకానమీలో కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సంపద పన్ను వంటి కొత్త పన్నుల జోలికి వెళ్లవద్దు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు లాభాలకన్నా ప్రతికూల ఫలితాలకే దారితీస్తుంది. జీడీపీలో దాదాపు 29 శాతం వాటాతో 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉన్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్) కొనసాగించాలి.
Comments
Please login to add a commentAdd a comment