Soumya Kanti Ghosh
-
మహమ్మారిని ఎదుర్కొనడంపైనే బడ్జెట్ దృష్టి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ ఇంకా పేలవంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో 2022–23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ బుధవారం ఒక ప్రీ–బడ్జెట్ సిఫారసుల నోట్‌ను విడుదలచేశారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం, మహమ్మారిని ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ద్రవ్యలోటు పరమైన ఇబ్బందుల పరిశీలించడం మాత్రమే తాజా పరిస్థితుల్లో సరికాదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విక్రయం ద్వారా ఎల్ఐసీ వాటా విక్రయాన్ని పూర్తిచేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇది అత్యుత్తమ పప్రారంభం అవుతుంది. 2022–23లో ఖజానాకు దాదాపు రూ.3 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోడానికి, ద్రవ్యలోటును 6.3 శాతానికి తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. ద్రవ్యలోటు కట్టడి చేయాలన్నా అది 40 బేసిస్ పాయింట్ల కన్నా అధికంగా ఉండకూడదు. ప్రస్తుతం ఎకానమీలో కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సంపద పన్ను వంటి కొత్త పన్నుల జోలికి వెళ్లవద్దు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు లాభాలకన్నా ప్రతికూల ఫలితాలకే దారితీస్తుంది. జీడీపీలో దాదాపు 29 శాతం వాటాతో 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉన్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కొనసాగించాలి. -
సెంచరీ పూర్తి చేసుకున్న సెకండ్‌వేవ్
ముంబై: కోవిడ్‌ను సమర్థంగా అరికట్టడం వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని, లాక్డౌన్లతో సాధ్యం కాదని ఓ నివేదిక తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ 100 రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని అంచనావేసింది. గత నెల నుంచి దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాక్సినేషన్‌ను భారీగా వేగంగా అమలు చేసి వైరస్ వ్యాప్తిని ఆపొచ్చని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ ఒక నివేదికలో స్పష్టం చేశారు. ‘గత ఏడాది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో కేసుల సంఖ్య 500లోపే. అయితే, లాక్డౌన్లను పొడిగించుకుంటూ పోయిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది’అని ఆయన పేర్కొన్నారు. ‘1918–19 సంవత్సరాల్లో సంభవించిన స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా ఆయా దేశాల్లో లాక్డౌన్లు విధించి స్కూళ్లు, చర్చిలు, థియేటర్లను మూసివేశారు. కానీ, లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేశాక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది’ అని విశ్లేషించారు. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లోని ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన జిల్లాల్లో మరణాలు, కేసుల సంఖ్యను తగ్గించడంలో లాక్డౌన్లు విఫలమయ్యాయన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లాక్డౌన్ల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు గూగుల్ మొబిలిటీ డేటా చెబుతోంది. కానీ, ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని టీకా పంపిణీతోనే నిలువరించగలమని ఆయన తెలిపారు. జనవరి నుంచి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా సెకండ్ వేవ్‌లో కేసులు 25 లక్షలకు మించకపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల తీవ్రతను మొదటి వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి పరిస్థితితో పోల్చి చూస్తే ఏప్రిల్ రెండో అర్ధభాగంలో కేసులు అత్యధిక స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని సౌమ్యకాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలైన సెకండ్ వేవ్ దేశంలో 100 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ తీవ్రతను ఎదుర్కొనేందుకు టీకా పంపిణీ వేగవంతం కావాలన్నారు. ఇప్పటి వరకు రాజస్తాన్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 60 ఏళ్లుపైబడిన 20% మంది వ్యాక్సినేషన్ పూర్తయిందనీ, అయితే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా అమలైందని తెలిపారు. రెండో వేవ్ తీవ్రంగా ఉన్నా టీకా అందుబాటులోకి వచ్చినందున కేసులు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. -
కొనుగోలు శక్తి తగ్గొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగింది. అయితే నాట్లు ఆలస్యం కావడం, పంట విస్తీర్ణం తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశం ఉందని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వాహన విక్రయాలు గణనీయంగా పడిపోవడాన్ని బట్టి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు. అయితే వాహన రంగంపై ఇటీవల ఎస్బీఐ ఓ అధ్యయనం చేసింది. దాంట్లో తేలిందేమంటే ప్రాంతం, వయసు, లింగ భేదం లేకుండా ఆర్థిక స్తోమతను బట్టి కార్లను కొంటున్నారు. అత్యధికులు ఖరీదైన మోడళ్లను కైవసం చేసుకుంటున్నారు. వీటి కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్య విషయమేమంటే భారత్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్టే.. కార్లను కొంటున్న మహిళలూ అధికమవుతున్నారు. అమెజాన్ సేల్‌లో ఎస్బీఐ కార్డ్ కస్టమర్లు ఖర్చు చేసినదాన్ని బట్టి... ద్వితీయ శ్రేణి నగరాల నుంచీ డిమాండ్ ఉంది. దీనినిబట్టి చూస్తే సెంటిమెంట్ లేకపోతే ఇంత డిమాండ్ ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది’ అని వివరించారు. బంగారం ధరలు తగ్గే సూచనలు ఇప్పట్లో కనపడడం లేదని వ్యాఖ్యానించారు. -
రికవరీ బాటలో పరిశ్రమలు..
న్యూఢిల్లీ: పరిశ్రమలు మే నెలలో సానుకూల ఫలితాన్ని అందించాయి. ఆర్థికాభివృద్ధికి సంకేతాలను ఇస్తూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.7 శాతం వృద్ధి సాధించింది. ఇది 19 నెలల గరిష్ట స్థాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ యేడాది జనవరి నుంచీ చూస్తే, మొదటి నెలలో స్వల్ప వృద్ధి 1.1 శాతం నమోదుకాగా, అటు తర్వాత రెండు నెలల్లో (ఫిబ్రవరిలో 2 శాతం క్షీణత, మార్చిలో 0.5 శాతం క్షీణత) అసలు వృద్ధి చోటు చేసుకోలేదు. ఏప్రిల్‌లో వృద్ధి రేటు 3.4 శాతం నమోదుకాగా, మేలో ఇది మరింత పెరగడం సానుకూలాంశం. కాగా 2013 మే నెలలో ఐఐపీలో అసలు వృద్ధి లేదు. ఆ నెలలో మైనస్ 2.5 (క్షీణత) నమోదయ్యింది. 2 నెలల్లో వృద్ధి 4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) చూస్తే వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. 2013-14ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో -0.5 శాతంగా నమోదయ్యింది. కీలక రంగాలను చూస్తే... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి వృద్ధి బాటకు మళ్లింది. ఈ రేటు -3.2 శాతం నుంచి 4.8 శాతం వృద్ధికి మళ్లింది. ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలూ ఏప్రిల్-మేలోనూ ఇదే పరిస్థితి నమోదయ్యింది. 0.7 క్షీణత నుంచి ఈ రంగం 3.7 శాతం వృద్ధికి మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో 16 సానుకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. మైనింగ్: ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి బైట పడింది. -5.9 శాతం నుంచి 2.7 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. రెండు నెలల్లో వృద్ధి భారీగా 5.3 శాతం నుంచి 9 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు చిహ్నంగా ఉన్న ఈ రంగం ఉత్పత్తి 2013 మేలో అసలు వృద్ధి లేకపోగా 3.7 శాతం క్షీణించింది. అయితే 2014 మేలో ఈ రంగం 4.5 శాతం వృద్ధికి మళ్లింది. ఏప్రిల్-మే నెలల్లో సైతం ఉత్పత్తి -2.1 శాతం (క్షీణత) నుంచి 9.3 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువులు: ఈ రంగం ఉత్పత్తి 18.3 శాతం క్షీణ బాటలోంచి 3.2 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే ఏప్రిల్-మే నెలల్లో క్షీణత కొనసాగుతోంది. అయితే ఈ క్షీణత - 14 శాతం నుంచి - 2.5 శాతానికి మెరుగుపడింది. విశ్వాసం పెరుగుతోంది...: పారిశ్రామిక ప్రతినిధులు తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత ధోరణి ముగిసినట్లేనని, ఉత్పత్తి రికవరీ బాట పట్టిందని పేర్కొనేలా గణాంకాలు ఉన్నాయన్నారు. ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానిస్తూ, తయారీ రంగం వృద్ధిని నమోదుచేసుకున్నప్పటికీ, బేస్ ఎఫెక్ట్‌నూ (తాజా గణాంకాలకు గత ఏడాది మేలో క్షీణతను ప్రాతిపదికగా తీసుకోవడం) ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే తయారీ రంగంలోని మెజారిటీ విభాగాలు సానుకూలతలో ఉండడం హర్షణీయమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పారిశ్రామికోత్పత్తి గణాంకాల్లో సానుకూల ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.5 శాతాన్ని అధిగమించడానికి ఈ సానుకూల పరిస్థితి దోహదపడుతుందని కూడా కపూర్ అభిప్రాయపడ్డారు.