Interboard
-
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్‌లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్‌లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్‌లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్‌ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్‌లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే
సాక్షి, విజయవాడ: ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ►జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు ►ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు ►సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు ►అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు ►అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ►నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు ►డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ►2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి వేసవి సెలవులు ►2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ►2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ►2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే ►2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ -
రెండు లక్షల మంది భవితకు పరీక్ష, స్పందించిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు కొత్త వివాదాలు రేపుతున్నాయి. 2 లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్ ఏంటనే ప్రశ్న తెరపైకొచ్చింది. పట్టణాల్లో ఫలితాలు మెరుగ్గా, గ్రామాల్లో తక్కువగా రావడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫెయిలైన విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ఎలా రాస్తారని, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సమయమెక్కడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఫెయిలైన ప్రభావం రెండో ఏడాదిపైనా ఉంటుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఇంటర్ బోర్డు తీరును దుయ్యబడుతూ శుక్రవారం బోర్డు కార్యాలయం వద్ద సంఘాల నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల నుంచీ బోర్డు తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంటర్ ఫస్టియర్‌లో 2,35,230 మంది ఫెయిలయ్యారు. వీరిలో రెండుకుపైగా సబ్జెక్టులు ఫెయిలైన వాళ్లు 63 శాతం మంది ఉన్నారు. ఆన్లైన్ బోధనకు అవకాశం లేక వీళ్లకు ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. ‘పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించిన చాప్టర్లే వాళ్లు వినే అవకాశం చిక్కలేదు. నెట్ సిగ్నల్స్ అందడం లేదని విద్యార్థుల నుంచీ ఫిర్యాదులొచ్చాయి’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన అధ్యాపకుడు నవీన్ తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబ్‌బాద్, భూపాలపల్లి, మెదక్, యాదాద్రి, సూర్యాపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల నుంచి ఈ ఫిర్యాదులు వచ్చాయి. గ్రేస్ మార్కులేస్తే?: ఆన్లైన్ సౌకర్యం లేక గ్రామీణ విద్యార్థులు చాలా చాప్టర్లు వినలేదని వరంగల్‌కు చెందిన అధ్యాపకుడు సతీశ్‌వర్మ తెలిపారు. ఇప్పుడీ చాప్టర్స్ మొదటి నుంచీ చదివితేనే మార్చిలోనైనా పరీక్షలు రాయగలరన్నారు. కానీ విద్యార్థులు ఇప్పటికే సెకండియర్ ప్రిపరేషన్లో ఉన్నారని మరి సమయం ఎలా ఉంటుందని అన్నారు. ‘గ్రేస్ మార్కులిస్తే కనీసం 30 శాతం మంది బయటపడే వీలుంది’ అని హైదరాబాద్‌కు చెందిన లెక్చరర్ నీలేశ్ చెప్పారు. అంతా సక్రమంగానే చేశాం, విద్యార్థులు ఆందోళనకు గురవ్వొద్దు: ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫస్టియర్ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్ మెటీరియల్‌ను కూడా బోర్డ్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ ఫీజును తగ్గిస్తున్నాం..: ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. -
కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: అనుమతులకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల అక్రమాలకు ఇక అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు తగిన సదుపాయాలు ఉంటేనే అనుమతులు ఇచ్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించడం, ఫీజుల నియంత్రణ వంటి అనేక సంస్కరణలకు చర్యలు చేపట్టింది. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లూ నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను కూడా ఆన్లైన్లో ఇంటర్‌బోర్డు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. దీంతో కాలేజీల అడ్డగోలు అడ్మిషన్లకు అడ్డుకట్ట పడుతుంది. ఒక్కో సెక్షన్లో 40 మందికి మాత్రమే జూనియర్ కాలేజీల్లో ప్రతి సెక్షన్లో 40 మందినే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 13న జీఓ 23ను విడుదల చేసింది. గతంలోని జీఓలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. దీని ప్రకారం కాలేజీలో సెక్షన్‌కు 40 మంది చొప్పున కనిష్టంగా 4, సదుపాయాలను అనుసరించి గరిష్టంగా 9 సెక్షన్లకు అనుమతిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2002 మే 13న జీఓ 12ని విడుదల చేసి ప్రతి సెక్షన్లో 88 మందిని చేర్చుకోవచ్చని అనుమతులిచ్చారు. దీంతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తూ పాత జీఓను సవరించి ప్రభుత్వం తాజాగా జీఓను విడుదల చేసింది. మాధ్యమిక శిక్షా అభియాన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం కూడా తరగతికి 40 మంది మాత్రమే ఉండాలన్న నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేపట్టింది. – ప్రతి ప్రైవేట్ జూనియర్ కాలేజీకి సెక్షన్‌కు 40 మంది చొప్పున 4 సెక్షన్లను మంజూరు చేస్తారు. కనిష్టంగా 160 మంది విద్యార్థుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. – భవనాలు, ఫ్యాకల్టీ, తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వసతి సదుపాయాలన్నీ కల్పిస్తే గరిష్టంగా సెక్షన్‌కు 40 మంది చొప్పున 9 సెక్షన్లకు అనుమతిస్తారు. – ఎంపీసీ, బైపీసీ మాత్రమే కాకుండా ఇక నుంచి తప్పనిసరిగా కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ కోర్సులు కూడా నిర్వహించాలి. – నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే ఆన్లైన్ అనుమతి – ఇప్పటికే దీనిపై బోర్డు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో అందించాలని స్పష్టం చేసింది. – ఇప్పటివరకు పలు కార్పొరేట్ జూనియర్ కాలేజీలు తమ ఇష్టానుసారం విద్యార్థులనుచేర్చుకోవడం, విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకుండానే కొనసాగుతూ వచ్చాయి. ఇకనుంచి వీటికి కళ్లెం పడనుంది. –నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే అన్లైన్ అనుమతి – రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహించే కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలన్నిటినీ పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుడే వాటికి ఇంటర్మీడియెట్‌బోర్డు 2020–21 అనుమతులు మంజూరు చేయనుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సవివరమైన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని కాలేజీలకు సూచించింది. కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లను నెలకొల్పడానికి ఉండాల్సిన సదుపాయాల గురించి స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ సదుపాయాలుండాల్సిందే: – ఆన్లైన్ దరఖాస్తు ఫారం ‘హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓఈ.ఐఎన్’లో పొందుపరిచిన ఇంటర్మీడియెట్‌బోర్డు దరఖాస్తుతో పాటు సదుపాయాలపై సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని స్పష్టంచేసింది. – కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటో ఇమేజ్‌లను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. – బోర్డు వాటన్నిటినీ పరిశీలించనుంది. వీటిని ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది. సదుపాయాలు లేనట్లుగా గుర్తిస్తే చర్యలు తీసుకుంటుంది. – అదనపు సెక్షన్లకు వీలుగా ఆర్సీసీ భవన వసతి, అదనపు తరగతులకు గదులు ఉండాల్సిందే. – భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆటస్థలం కూడా ఉండాలి. – అనుమతి ఉన్న భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్లతో పాటు సంబంధిత అధికారవర్గాల నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది. – పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, వారి అర్హతలకు సంబంధించిన వివరాలనూ సమర్పించాలి – బోర్డునుంచి ఎలాంటి అనుమతి లేకుండా యాజమాన్యాలు కొత్తగా ఎలాంటి సెక్షన్లను తెరిచేందుకు వీలులేకుండా చర్యలు చేపట్టారు. అడ్డగోలు ఫీజులకూ అడ్డుకట్ట: ప్రైవేట్ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందాలకు కూడా ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఆర్.కాంతారావు నేతృత్వంలోని ఈ కమిషన్ పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపుతోపాటు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో నిబంధనల మేరకు సదుపాయాలుండేలా చర్యలు చేపట్టింది. స్కూళ్లు నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను నిర్ధారించనుంది. ఇందుకోసం యాజమాన్యాలు తప్పనిసరిగా తమ వివరాలను కమిషన్‌కు సమర్పించాలి. లేకపోతే ఆ సంస్థలకు ఫీజు వసూలుకు అనుమతి ఉండదు. – అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఫీజుల ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఈఆర్ఎంసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ కు ఆన్లైన్ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో షెడ్యూళ్లలో సమర్పించాలి. ఇందుకు జూన్ 9 వరకు గడువిచ్చారు. యాజమాన్యాల ప్రతిపాదనలు, ఇతర వివరాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తారు. –మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. – అధిక ఫీజులు వసూలు చేసినా, కాలేజీలు, స్కూళ్లు తెరవకుండానే ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవు. – ప్రతి ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూలు, కాలేజీ తమ సంస్థల భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర సదుపాయాలను జియో ట్యాగింగ్ యాప్ ద్వారా కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. – కాలేజీ, పాఠశాల గుర్తింపు వివరాలు, సెక్షన్లు , బిల్డింగ్ వివరాలు , గత ఏడాది ఫీజుల వివరాలు , ఉద్యోగుల వివరాలు , కిచెన్ హాస్టల్ వివరాలు, వచ్చిన ఫీజులు. ఖర్చుల వివరాలు , ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేలా నిబంధనలు విధించారు. -
ఆ 21 మందికి పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్ : 2008 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో నష్టపోయిన తెలంగాణకు చెందిన 21మంది అభ్యర్థులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. తాజాగా వీరందరికి ఇంటర్ విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్‌లు ఇచ్చింది. 2008లో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ 2011లో ఈ పరీక్షను నిర్వహించింది. ఇందులో ఎకనామిక్స్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల జవాబులను మరొక సబ్జెక్టు కీతో మూల్యాంకనం చేయటంతో 77 ప్రశ్నలకు జవాబులు తప్పుగా వచ్చాయి. దీంతో అభ్యర్థులు అనేక ఆందోళనలు చేపట్టిన తర్వాత ఏపీపీఎస్సీ సరైన కీతో మూల్యాంకనం చేసింది. అనంతరం మెరిట్ లిస్టు ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చింది. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో 66.09, సెకండ్ ఇయర్లో 76.64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జూన్ 16వ తేదీ రీ కౌంటింగ్‌కు చివరి తేదీ. రాష్ట్రవ్యాప్తంగా మే 15 నుంచి 22 వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి bietelangana.cgg.gov.in వెబ్సైట్ నుంచి కాలేజీల వారీ ఫలితాలను పొందవచ్చు. గత నెల 15 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి సంవత్సరం 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరం 1,51,648 మంది విద్యార్థులు ఉన్నారు.