సెలవుల వెనుక మతలబు! | Behind The Leaves | Sakshi
Sakshi News home page

సెలవుల వెనుక మతలబు!

Published Wed, Jun 20 2018 8:14 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Behind The Leaves - Sakshi

42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించినా మే నెలలోనే జ్ఞానధార కార్యక్రమం నిర్వహించింది విద్యాశాఖ.  ఇప్పుడు అదే విద్యాశాఖ 38 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోన్న సమయంలో ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లకు  సెలవులు వర్తిస్తాయని పొందుపరచకపోవడం వెనుక వాటికి పరోక్షంగా మేలు చేసే ఉద్దేశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కర్నూలు సిటీ : వేసవి సెలవులు ముగిసి వారం  క్రితమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల మొదటి వారంలో మూడు రోజులు మినహా పెద్దగా వాతావరణంలో మార్పులు కూడా కనిపించలేదు. అయినా, విద్యాశాఖ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని  మూడు రోజులు  (19, 20, 21 తేదీలు) సెలవులు ప్రకటించడంపై అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పుతో రాష్ట్రంలోని సముద్ర తీరానికి సమీప ప్రాంతాల్లో పగలు వేడి తీవ్రత ఉంది. అయితే, ఈ వేడి ప్రమాదకరమని వాతావరణ శాఖ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయినా, స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. గత 20 రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో ఒక్క రోజు కూడా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని, మరి ఎందుకు సెలవులు ఇచ్చారో అర్థం కావడం లేదని  ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.   


ప్రైవేట్‌కు మేలు చేసేందుకేనా? 
ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో అడ్మిషన్లు అనుకున్నంత స్థాయిలో కావడం లేదు.  పరోక్షంగా వారికి మేలు చేయడం కోసమే సర్కారు స్కూళ్లకు ఆకస్మిక సెలవులు ఇచ్చారని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి .సెలవులు ప్రకటిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పొందుపరచక పోవడం అందులో భాగమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరిగేలా ప్రోత్సహించాల్సిన విద్యాశాఖే అసంబద్ధ నిర్ణయాలతో అందుకు విరుద్ధంగా వ్యవహస్తోందని ఉపాధ్యాయులు, విద్యార్థులు మండిపడుతున్నారు. 

సెలవుల అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి 
వాతావరణంలో వచ్చిన మార్పులతో  రాష్ట్ర విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు అన్ని చోట్ల అలాగే ఉండవు.  స్థానికంగా ఉండే పరిస్థితులకు తగ్గట్లు సెలవులు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి. స్కూళ్ల పునఃప్రారంభమైన వారం రోజులకు  సెలవులు ఇవ్వడం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆటంకంగా మారుతోంది. 
– వి.కరుణానిధిమూర్తి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement