
కార్పొ‘రేట్’ను కట్టడి చేయాల్సిందే
► విద్యావ్యాపారాన్ని నియంత్రించాల్సిందే
► రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవంలో గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: విద్యను వ్యాపార వస్తువుగా మారుస్తున్న కార్పొరేట్ విద్యాలయాలను కట్టడి చేయాల్సిన అవసరముందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. రూ.4.5 కోట్లతో రాజ్‌భవన్ స్టాఫ్ క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన మూడు అంతస్థుల ప్రభుత్వ స్కూల్ భవనాన్ని బుధవారం ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు గవర్నర్ దంపతులు నరసింహన్, విమలానరసింహన్ అక్షరాభ్యాసం చేయించారు.
అనంతరం తరగతి గదులన్నీ కలియ తిరిగారు. నరసింహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు మెరుగైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాజ్‌భవన్ స్కూల్‌ను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాజ్‌భవన్ స్కూల్ నిర్మాణంపై విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయులు యాంత్రికంగా పాఠాలు చెప్పి వెళ్లి పోవడం కాకుండా వారితో స్నేహభావంతో మెలగాలని సూచించారు. మెరుగైన ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాలని అన్నారు. పిల్లలకు పాఠాలు బోధించడం ఎంత ముఖ్యమో, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమూ అంతే ముఖ్యమని చెప్పారు.
గవర్నర్ చొరవతోనే...
గవర్నర్ చొరవ తీసుకుని శిథిల భవనం స్థానంలో అత్యాధునిక పాఠశాల భవనాన్ని నిర్మింపజేశారని కడియం శ్రీహరి చెప్పారు. రాబోయో రోజుల్లో ఇక్కడ సీటు దొరకని పరిస్థితి నెలకొంటుందని అన్నారు. గత పాలకుల హయంలో విద్యావ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని, ఇప్పుడిప్పుడే దానికి చికిత్స చేసి మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.420 కోట్లతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 1061 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున స్థాపించి ఆదర్శవంతంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
రాజ్‌భవన్ స్కూలు ప్రత్యేకతలు ఇవే..
రాజ్‌భవన్‌లో పని చేసేఉద్యోగుల పిల్లల కోసం 1953లో రాజ్‌భవన్ ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. తొలి ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ 1963లో బయటికి వెళ్లింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్న స్కూలును పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియం స్కూలుగా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 754 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి క్లాస్‌రూంలోనూ ఎల్‌సీడీ ప్రొజెక్టర్లు, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, 24 సీసీ కెమెరాలు, 20 బుక్ సెల్ప్‌లు, సురక్షిత మంచినీటి సరఫరా కోసం ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రయోగాల కోసం అత్యాధునిక ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చారు.