సాగర సౌందర్యం | city beautifull places | Sakshi
Sakshi News home page

సాగర సౌందర్యం

Published Tue, Apr 14 2015 10:45 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

సాగర సౌందర్యం - Sakshi

సాగర సౌందర్యం

మెదొస్ టేలర్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ రెసిడెంట్‌గా పనిచేశాడని, పన్నెండేళ్లు జైలు జీవితం గడిపిన అమీర్ అలీ అనే థగ్గు చెప్పిన నేరాంగీకార వాజ్ఞ్మూలాన్ని నమోదు చేశాడనీ, గత వారం చెప్పుకున్నాం.ఆ వైనం ‘కన్ఫెషన్స్’ అనే పేరుతో 1839లో ఇంగ్లండ్‌లో తొలిసారి  ప్రచురితమైంది. ఆ ‘రచన’లో కొంత నాటకీయత ఉందని విమర్శకులంటారు. నగర చరిత్రకు సంబంధించిన ఆసక్తికర అంశాలు లేవని ఎవరైనా అంటారా...
 
అమీర్ అలీ కలవారి కుటుంబంలో పుట్టాడు. థగ్గులు అతని తల్లితండ్రులను హత్యచేశారు. థగ్గు నాయకుడు ఇస్మాయిల్. అతనికి పిల్లలు లేరు. ఐదేళ్ల అమీర్ అలీని చంపేందుకు చేతులు రాలేదు. తానే అనాథను చేసిన అమీర్ అలీని దత్తత తీసుకున్నాడు. బాలుడు నూనూగు మీసాలు వచ్చేసరికే  థగ్గు ముఠాలకు నాయకత్వం వహించేలా ‘ఎదిగాడు’. మూడో నిజాం హైదరాబాద్‌ను పరిపాలిస్తున్న కాలం (1803-29). తన తొలి దాడికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాడు అమీర్ అలీ. హైదరాబాద్ వచ్చే క్రమంలో ఆదిలాబాద్ నవాబు ఆధీనంలో ఉన్న ఒక నర్తకిని రక్షించాడు. ఆ అమ్మాయి పేరు జోరా. వేశ్యమాత దగ్గర పెరిగింది! జోరాను బతికుండగా చూడబోనని ‘మాత’ ఆశలు వదులుకుంది. థగ్గు జోరాను ఆమె గూటికి మరలా చేర్చాడు. జోరాతో ఒక రాత్రి ఆనందాన్ని ప్రతిఫలంగా పొందాడు. వేశ్యమాత జోరాను వృత్తికి పునరంకితం చేసింది.
 
మేనును తాకిన వజ్రాలు
అల్వాల్ మీదుగా హైదరాబాద్ వచ్చిన అమీర్ అలీ అల్వాల్ గుడినీ (ఆళ్వారుల పేరుతో నిర్మితమైన శ్రీవేంకటేశ్వరస్వామి గుడి), ఆ ఊరి చెరువుని వివరిస్తాడు. దూరం నుంచి హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని, బ్రిటిష్ సైన్యపు మిలమిలా మెరిసే విడిది నివాసాలను చూస్తాడు. అప్పటి హుస్సేన్‌సాగర్ గురించి అమీర్ అలీ వర్ణన చూడండి...
 
‘వేల అలలు పడిలేస్తున్నాయి. సవ్వడి చేస్తున్నాయి. అలల అంచుల తెల్లని నురుగు తీరంలో మలచిన తీరైన రాతి కట్టడిని తాకుతూ విరిగిపోతున్నాయి. వజ్రాల్లా మారి మెత్తగా చల్లగా, హాయిగా మేనును తాకేవి. ఆ జలరాశిని చూస్తూ ఎంతసేపు గడిపామో తెలియదు. ఇంతటి జలసంపదను, సౌందర్యాన్ని మా థగ్గీలు ఎప్పుడూ చూడలేదు. మధ్యభారతంలో కథలుకథలుగా విన్న సముద్రమంటే ఇదేనేమో అనుకున్నాం, ముంగిట నుంచి నింగిని తాకే నీటిని చూసి!’
 
ఆ తర్వాత అమీర్ అలీ నౌబత్‌పహాడ్‌ను చూశాడు. తన గుర్రాన్ని ఛెళాయించి కొండను ఎక్కాడు. నగరం చూపుల దాపుల్లో ఎలా ఉందో చూద్దామని! కొండ కింద కనిపించే హైదరాబాద్ అమీర్ అలీని ఉవ్విళ్లూరించింది. ఎన్నెన్ని వైభవాలున్నాయో ఈ నగరంలో. ఉత్తరాది నుంచి వచ్చిన తర్వాత దక్కన్ పీఠభూమిలో ఇంతగా మిరుమిట్లుగొలిపిన జనావాసం తాను చూడలేదు!
- ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి/ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్/ ఫోన్:7680950863

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement