సిమ్లా టు సిటీ! | Shimla to City! | Sakshi
Sakshi News home page

సిమ్లా టు సిటీ!

Published Mon, Aug 4 2014 12:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సిమ్లా టు సిటీ! - Sakshi

సిమ్లా టు సిటీ!

నరేంద్రలూథర్
‘శ్యామలా’ అనే దేవత కొలువున్న ‘శామ్లా’ ప్రాంతం సిమ్లాగా మారిందట! బ్రిటిష్ ప్రభుత్వానికి వేసవి రాజధాని అయిన సిమ్లాలో నాన్న ఉద్యోగం. కొండపై ప్రభుత్వ బంగళాలో నివాసం. కొండ కింద మేఘసంచారం. నూరు వంతెనల రైలు మార్గంలో ప్రయాణాలు. నీట్ సిటీ. ‘ఆవుపేడ’ చూడలేదుంటే అతిశయోక్తి కాదు. సిమ్లాలో ఏడేళ్ల బాల్యం కలగా గడచి పోయింది. నాన్న బదిలీలతో 1946లో లాహోర్‌కి, ఆ తర్వాత రావల్పిండికి మా నివాసాలు మారాయి. అమ్మ రామచరితమానస్ శ్రావ్యంగా చదివేది. చెల్లెళ్లు సితారా వాయించేవారు. నాకు తబలా వచ్చు.

మెట్రిక్యులేషన్ పరీక్ష రాశాను. రిజల్ట్స్ రాలేదు. దేశ విభజన వార్తలు వస్తున్నాయి. తుపాకుల మోతల మధ్య ఆగస్ట్ 14-15 అర్ధరాత్రి నెహ్రూ ఉపన్యాసం బిక్కుబిక్కుమంటూ విన్నాం. నాన్న స్నేహితుడు ఒక ముస్లిం ఉద్యోగి, మా కుటుంబానికీ మరో రెండు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చారు. బయటకు వెళ్తే ముస్లిం పేర్లు చెప్పాలి. మా తమ్ముడి పేరు అక్రమ్. నా పేరు అస్లమ్. ఇక్కడ జీవించలేరు, ఇండియా వెళ్లిపోండి అని హితైషులు చెప్పినా, పుట్టిన గడ్డను విడిచేందుకు నాన్న ఇష్టపడలేదు. తర్వాత పరిణామాలరీత్యా ఇండియా వెళ్దామని అన్నారు.  

ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వేసిన రైలులో 14మంది కూర్చునే కంపార్ట్‌మెంట్లో 40 మంది ‘సర్దుకున్నాం’! మూడురోజుల ప్రయాణం తర్వాత మృతుల-జీవన్‌మృతుల కంపార్ట్‌మెంట్లతో రైలు అమృత్‌సర్ చేరింది.  రైల్వే స్టేషన్‌కు ఆనుకునే తాత్కాలిక శ్మశానాలు. బాధితులకు సేవలు చేసేందుకు స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చేది. ‘సంఘసేవ’ చేసినందుకు గత విద్యార్హతలతో సంబంధం లేకుండా వయసును బట్టి పట్టభద్రత ఇచ్చేవారు. నేను ‘మెట్రిక్యులేట్’ని! ఆగస్ట్ 15 అంటే కొందరికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. మా బోటోళ్లకు దేహం ఖండితమైన రోజు!
 
నాన్నకు హోషియార్‌పూర్ జిల్లాలోని గడ్‌శంకర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. కట్టుబట్టలతో ‘రేఖ’కు అటు నుంచి ఇటు వచ్చినట్లు, ఇటు నుంచి అటు కూడా వెళ్లిన వారు ఉంటారు కదా! అలా ఖాళీ అయిన నివాసంలో కొన్ని గదులను మా కుటుంబానికి ఇచ్చారు. కొందరు వదిలేసిన వస్తువుల్లో కావాల్సినవి తీసుకోవలసినదిగా గ్రామ పెద్దలు చెప్పడంతో కుటుంబ ప్రతినిధిగా నేను గ్రామపంచాయతీ దగ్గర వరుసలో నిల్చున్నా. చేతిలో సంచి లేదు. ఒక మగ్గు కన్పించింది. ఆ పాత్రపై ఉర్దూలో కవిత
 ‘మధువు తాగితాగి హృదయం భగ్గుమంటోంది॥
 
ఓ పాత్రధారీ, కొన్ని మంచు ముక్కలు వేసి ఉపశమనం కలిగించవా॥ అని. అక్కడి వస్తువుల్లో ఒక ఖురాన్ ప్రతి కన్పించింది. నాన్నను రావల్పిండిలో ‘మహాత్మా’ అనీ ‘మౌలానా’ అనీ పిలిచేవారు. ఆయన గీతను, ఖురాన్‌ను అంత తన్మయంగా గానం చేసేవారు. నాన్న ఖురాన్ తెచ్చుకునేందుకు వీలు కాలేదు. సో... ఒక చేత్తో మగ్గూ మరో చేత్తో ఖురాన్‌తో ఇంటికి వచ్చాను. కవిత్వం నచ్చి మగ్గు తెచ్చానని హాస్యమాడారు.  ఖురాన్ ఎందుకు తెచ్చావు, ఇన్ని గొడవలకు కారణం ఈ పుస్తకమేగా అని అక్క అంది. ‘ఖురాన్‌ను చదివి అర్థం చేసుకున్నవారే మనకు ఆశ్రయం ఇచ్చారు. మంచి పని చేశావు’ అని నాన్న మెచ్చుకున్నారు. ఆ ప్రతి ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది!
 
1953లో ఎం.ఎ, 1954లో ఐఏఎస్ పూర్తి చేశాను. ఢిల్లీలో, వైజాగ్‌లో ఒక సంవత్సరం ట్రైనింగ్. నా తొలి పోస్టింగ్ మద్రాసు నుంచి విడిపోయిన ‘ఆంధ్ర రాష్ట్రం’ గూడూరులో. మూడు రోజుల భారీ వర్షాల వల్ల సువర్ణముఖి నదికి వచ్చిన వరదల సహాయక చర్యలతో నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ‘మద్రాసీ’ అనే భాష లేదని, ‘తెలుగు’ భాష ఉందనీ ఇక్కడకు వచ్చాకే తెలిసింది. 1959లో రాష్ట్ర సమాచార - ప్రజా సంబంధాల శాఖ డెరైక్టర్‌గా హైదరాబాద్ వచ్చాను. నగరం నన్ను నన్నుగా తీర్చిదిద్దింది!
 ప్రజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement