Punna krishnamurthy
-
వినరా... నాజర్ గాథను నేడూ!
‘నేనయ్యా నాజర్‌ను, లోపలకు పోనివ్వండి’ మేఘం ఉరిమినట్లుగా విన్పించింది గుంటూరు శ్రీ వేంక టేశ్వర విజ్ఞాన మందిరంలో 1990 ఏప్రిల్‌లో ఒక సాయంత్రం. సినీ సంగీత దర్శకుడు చక్రవర్తికి సన్మానం. హాలంతా కిక్కిరిసింది. బయటా గాంధీ పార్కులోనూ నిలుచున్న జనం ప్రసంగాలను వింటున్నారు. హాలులో ప్రెస్‌కు కేటాయించిన మొదటి వరుసలో కూర్చున్నాను. ఆ సందర్భంలో ‘నేనయ్యా నాజర్‌ను’... నాజర్ ఇంకా జీవించే ఉన్నారా? విస్మయం! మాచర్ల చెన్న కేశుని గుడిలో 1968 ప్రాంతంలో పల్నాటి కథను చెబుతూ వేదికను, ప్రేక్షకుల హృదయాలను ఊపేసిన నాజర్ మనసులో మెదిలారు. ఆ నాజరే. సన్మానం అందుకుంటోన్న ^è క్రవర్తి, పరుగు పరుగున వేదిక దిగారు. బయట ప్రవేశ ద్వారం వరకూ వెళ్లి, కాపలాదారులు అడ్డగించిన నాజర్‌ను గౌరవంగా వేదికపైకి తీసుకు వచ్చారు. తన తండ్రి బసవయ్య కోరిక మేరకు, తనకూ, తన తల్లికి పొన్నెకల్లులో హార్మోనియం నేర్పిన గురువు నాజర్ అని ప్రేక్షకులకు చెప్పారు. గురువుకి శాలువా కప్పారు. ఆ మరుసటి ఉదయం నాజర్ ఇంటికి వెళ్లాను. తన బతుకు కథను చెప్పమని కోరాను. ‘ఒక పూట తెమిలేదా అబ్బాయి’ అన్నారు. రోజూ వస్తానన్నాను. దాదాపు రెండు వారాలు. రోజూ ఉదయం ఏడు, ఎనిమిది గంటలకు వెళ్లే వాడిని. శ్రీమతి నాజర్ తొలుత సేమ్యా పాయసం, వచ్చేపుడు పెద్ద ‘ఇత్తడి గళాసు’ నిండా మజ్జిగ ఇచ్చేవారు. నాజర్‌కు కళా కారులకు సహజమైన అలవాట్లు లేవు. ఆంధ్రభూమిలో ఆయ నపై ప్రచురితమైన సవివర వ్యాసాలు చదివిన ఎందరో ప్రము ఖులు ఫోన్ చేయడం వలన తెలి సింది, నాజర్ ఇంకా జీవించే ఉన్నారా అనే సందేహం నాకు మాత్రమే కలిగినది కాదని! చదువరులను శ్రీశ్రీ వలె, పామరులను అంతకు మించి ప్రభా వితం చేసిన బుర్రకథా పితామహుడు నాజర్‌ను వామపక్షాలు ఎందుకు విస్మరించాయి? వివిధ సందర్భాలలో ఎందుకు ఆహ్వానించలేదు? అవలోకన చేయవలసిన అంశం. నాజర్‌కు నాటకాలంటే ఆసక్తి. ఎనిమిదో ఏటనుండే వేషాలు కట్టారు. ‘పగలు రేత్తిరి’ నాట కాల వారి వెంటే. పెద రావూరుకు చెందిన రామక్రిష్ణ శాస్త్రి నెలకు మూడు రూపా యలిచ్చి నాజర్‌కు తెనాలిలో డ్యాన్స్ నేర్పించారు. నరసరావు పేటలోని క్షురకుడు మురుగుల సీతారామయ్య ఖర్చులు ఇప్పించి నాజర్‌కు సంగీతం నేర్పించారు. పేటలో, తాడికొండ బోగం అమ్మాయి పాటలు పాడించుకుని అన్నం పెట్టేది. విద్య నేర్చుకుని నాజర్ పొన్నెకల్లు చేరాడు. ఈ నేపథ్యంలో, 1943లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ తాళ్ళూరులో నిర్వహించిన పాటల పోటీలో నాజర్ ప్రథమ బహుమతి పొందారు. ఆ సందర్భంలో రెంటపాడుకు చెందిన రామకోటి పరిచయమయ్యారు. కథకుడిగా బుర్రకథను చెప్పే రామకోటి, తనకంటే గొప్పగాత్రం ఉందని భావించి, తగిన మెళకువలను నేర్పి నాజర్‌ను కథకుడిగా చేశాడు. నాజర్ కథకుడు. హాస్యగాడు రామకోటి. వంత కర్నాటి.‘నాజర్ దళం’ లక్షలాది సామాన్య జనం కమ్యూనిస్ట్ పార్టీని ఆలింగనం చేసు కునేలా చేసింది. ప్రజానాట్యమండలిలో తొలి తరం కళాకారుడైన నాజర్ స్వయంగా బుర్రకథలను రాసుకునేవారు. పాటలు రాసేవారు. కట్టేవారు. పాడేవారు. ఆ వాగ్గేయుని ప్రభావం గద్దర్, వంగపండు, నేటి గోరటి వెంకన్న వరకూ ప్రసరిస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రం నాజర్ ఆత్మఘోష సోక లేదు. ప్రజానాట్య మండలి 1949లో రద్దయింది. పార్టీ కథలు చెప్పుకుని బతకమ న్నది. కొన్నాళ్లకు ఉమ్మడి పార్టీ నాయ కులు పార్టీ వేదిక లపై కథ చెప్పాలన్నారు. బయటవారు నాజర్ కథకు 300 రూపా యలు ఇచ్చే రోజులు. ‘దళం’ రాకపోకల ఖర్చు కోసం పార్టీ నుంచి రూ. 100 తీసుకునేవారు. కథలో భాగంగా çకుల వాస్తవికతలను చెప్పేవారు. అది పెడధోరణిగా భావించి నాజర్ సేవలు అవసరం లేదంది పార్టీ. సీపీఎం సైతం చాలు చాలన్నది. ‘అవును నిజం, నీవన్నది’ అంటూ ఆ తరువాత తరిమెల, దేవులపల్లిలు నాజర్‌ను ఆహ్వానించారు. ధర్మరాజు వంటి వ్యసనపరులు, భీముని వంటి తిండిపోతులు, నకుల సహదేవుల వంటి అర్భకులను, అర్జునుని వంటి వీరులను ఒక్కతాటిపై నడిపి, రాజ్యా ధికారంలోకి తెచ్చేందుకు పార్టీలోని మేధోన్నతులు కృష్ణు్ణనిలా దోహదపడాలన్న నాజర్ వైఖరి ఎం.ఎల్లకు నచ్చలేదు. విరసానిక్కూడా. మావో సాక్షిగా చివరి శ్వాస వరకూ నాజర్ మార్క్సిజాన్నే నమ్మారు! నాజర్ ఉదహరించే ఇతిహాసాలను అభ్యుదయవాదులు విస్మరించారు. ఆ ఖాళీలో దేశంలో మతవాదులు చొరబడ్డారు. వామపక్షవాదులు కులభావనను గుర్తించలేదు. ఆ శూన్యంలో అణగారిన కులాల అభ్యున్నతికి పాటుపడతామనే విశ్వాసాన్ని కలిగించిన పార్టీలు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయి. ఆ దిశగా అడుగులు వేయడమూ చూస్తున్నాం. ఏదిఏమైనా, ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా! పున్నా కృష్ణమూర్తి (ప్రముఖ బుర్రకథా పితామహుడు షేక్ నాజర్ శత జయంతి సందర్భంగా) వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ‘ 76809 50863 -
తిరుమల కొండకి పద చిత్రాల పూజ
సీనియర్ జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి ‘తిరుమల కొండ పద చిత్రాలు’గా అందించిన అపురూపమైన పుస్తకం తిరుమలసాయికి ‘తొలి వందనము’ సమర్పిస్తూ మొదలవుతుంది. నిండుగా పూచిన మల్లెపొద లాంటి ఈ పుస్తకంలో ఎన్నెన్నో పరిమళభరిత విషయాలు! తిరుమలకొండ తొలి పేరు ‘వేంగడం’. 8వ శతాబ్దం దాకా వచ్చిన తమిళ సాహిత్యంలో కొండ మీద దేవుడు గురించి ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేదు. వేట ప్రధానంగా జీవించిన గిరిజనులు ‘వేంగళాంబ’ అనే స్త్రీ దేవతను కొలిచి జాతరలు చేసుకునే వారని ప్రస్తావనలు ఉన్నాయి. దేవీ భాగవతం ‘వేంకటేశ్వరి’ అంది. స్కంధ, మార్కండేయ పురాణాలు చూపించి శైవులు ‘కుమారస్వామి’ అన్నారు. చివరికి రామానుజుడు విష్ణు అవతారమైన ‘వేంకటేశ్వరు’డని అందర్నీ ఒప్పించాడు. అందుకే అన్నమయ్య ‘ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచిన అంత మాత్రమే నీవు’ అని తీర్పు చెప్పాడు. వేంగడం, వేంకటం, వెంకటగిరి అయింది. వేంకటేశ్వరుని తమ స్వామిగా చేసుకుని, వైష్ణవ గురువులు 12 మంది ఆళ్వారులు ‘పాశురా’లతో స్వామిని కీర్తించారు. ఆళ్వారులలో బ్రాహ్మలే కాకుండా క్షత్రియులు, శూద్రులు, పంచములు, ఓ స్త్రీ కూడా ఉన్నారు. భారతదేశంలో పరాయి పాలకుల దండయాత్ర జరగని ప్రముఖ ఆలయం తిరుమల ఒక్కటే. కొండలయ్య కోసం జుట్టు పెంచుకొని, బీబీ నాంచారమ్మ కోసం తలనీలాలు యిస్తారన్న కథ హైదర్ అలీని కొండపై దండెత్తకుండా చేసింది. ఆర్కాట్ నవాబుల దగ్గరి నుంచి ప్రతి ఒక్కరూ కొండపై శాంతినే కోరుకున్నారు. అక్కడ పవిత్రత దెబ్బతింటే భక్తులు రారు. హుండీ నిండదు. ఫలితంగా తిరుమలలో పన్నులు ప్రవేశించాయి. పెళ్లి కోసం వేంకటేశ్వరుడు అప్పులు చేశాడనే కథలు పుట్టాయి. నిలువు దోపిడీ మొక్కులు ప్రవేశించాయి. కంచి రాజధానిగా పాలించిన పల్లవ రాజవంశీకురాలు సామవాయి సమకూర్చిన నిధులతో 966 ఆగస్టు 30న మొదటి బ్రహ్మోత్సవం జరిగింది. 14వ శతాబ్దం వరకు బ్రహ్మోత్సవాలు తప్ప, యితర ఉత్సవాలు లేని తిరుమలలో 17వ శతాబ్దానికి 429 పండగలొచ్చి చేరి ‘నిత్య కల్యాణం పచ్చ తోరణం’ అయింది. పద్మశాలీల ఆడపడుచు పద్మావతీ దేవి 12వ శతాబ్దంలోనే అస్తిత్వంలోకి వచ్చింది. 29 శ్లోకాలతో కూడిన సుప్రభాతాన్ని ప్రతివాది భయంకర అన్నన్ 1430లో రాశారు. ఇలా తిరుమలతో అనుబంధం ఉన్న వ్యక్తులు, నమ్మకాలు, తీర్థాలు, చారిత్రకాంశాలను 2002లో వచ్చిన ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది. స్వయంగా ఫొటోగ్రాఫర్ కూడా అయిన పున్నా కృష్ణమూర్తి(ఫోన్: 7680950863) ప్రతీ పేజీని ఒక చక్కటి ఫొటోతో ప్రెజెంట్ చేయడం వల్ల పుస్తకం అందం పెరిగింది. కృష్ణమోహన్ బాబు 9848023384 -
డబ్బు దారుల్లో చోద్యాలు
ధనం అన్ని అనర్థాలకు మూలం అంటారు కొందరు. డబ్బంటే సుఖం. డబ్బంటే అధికారం. డబ్బంటే మనమాటను అందరూ వినడం అనుకుంటారు అధికులు. కాబట్టే కదా చరిత్ర నిండా ఇన్ని రక్తపాతాలు- కన్నీళ్లు! దీన్నెవడు కనిపెట్టాడో కాని, లోకంలో డబ్బనేది లేకపోతే చీకూచింతా ఉండదు కదా అని వాపోతారు మరి కొందరు. ఊహల్లోంచి బయటకు వస్తే డబ్బు ఆక్సిజన్ ! డబ్బు కావాలి! ఎంత? ‘చాలు చాలు’ అనేంత! కలవారు డబ్బు వ్యర్థం అనుకుంటారు. లేనివారు వెంపర్లాడతారు. డబ్బొద్దు అనుకున్నా డబ్బుండాలి కదా!. డబ్బు చేసుకోవడానికి మంచి సలహాలు ఎవరిస్తారు? సంపాదన చేతకాని వాళ్లు మాత్రమే! సంప్రదాయక విజ్ఞానం మనిషి ముందు మూడు దారులు పరచింది. బెగ్-బారో-స్టీల్! అడుక్కో-అప్పుచేయి-లాక్కో! కొందరు అడుక్కునే వారిని మనం గుర్తించలేం. వారు మనోవిజ్ఞానంలో మాస్టర్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడలిలో ఎర్రలైటు పడగానే ప్రత్యక్షమవుతారు. వారి వల విడిపించుకోలేనిది. డబ్బివ్వకపోతే అపరాధ భావన కు గురవుతాం! ప్రార ్థన స్థలాల్లో భగవంతుడేమో కాని అడుక్కునేవారు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతారు. ‘దైవాన్ని రహస్యంగా అడుక్కున్నదాంట్లో కొంచెమేగా మేము ఆశిస్తున్నది, మాకు చిల్లర విదిలించకపోతే మీకు టోకు లభిస్తుందా?’ అన్నట్లుగా కళ్లల్లోకి సూటిగా సంభాషిస్తారు. రెస్టారెంట్లో బిల్లు చెల్లించిన తర్వాత మీ స్థాయిని అంచనా వేస్తారు కొందరు బేరర్స్. మీరు అతిథి కావచ్చు, ఆతిథ్యం ఇచ్చిన వారు కావచ్చు, ఆత్మశోధనకు గురిచేస్తారు. తగిన మొత్తం ఘరానాగా చదివించి ఒక తలపంకింపును స్వీకరిస్తేగాని మీ మనస్సు తేలికపడదు. చోర్ మచాకే.. దొంగిలించడం అనే కళలోనూ రిస్క్ ఉంది. మీరు ఉద్యోగులా? అయితే పెట్టిన ఖర్చుకంటే అదనంగా చట్ట ప్రకారం దొంగిలించవచ్చు. టీఏ డీఏలను అదనంగా చూపవచ్చు. రాని వ్యక్తులను అతిథులుగా, తినని పదార్థాలను, ద్రవాలను సేవించినట్లు రికార్డులను చూపవచ్చు! అప్పు చేయడం ద్వారానూ కొందరు డబ్బు సంపాదిస్తారు. కుటుంబసభ్యుల్లో ఎవరి అంత్యక్రియలకో వెళ్లాలనడం, అయిన వారిని తక్షణం దవాఖానాలో చేర్పించాలనే నెపం అభినయించి అప్పిచ్చే వారిలో మానవత్వాన్ని తట్టిలేపాలి. తిరిగి చెల్లించకపోయినా ఫర్వాలేదనుకునే అమౌంట్‌కు ఎర్త్ పెట్టాలి. జ్ఞాపకశక్తి లోపించిన వారి దగ్గర, అడిగేందుకు మొహమాటపడే వారి దగ్గర అప్పు చేయడం శ్రేయస్కరం. దురదృష్టం ఏంటంటే అంతంత మాత్రం జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లు కూడా అప్పిచ్చిన వైనాల్లో చురుగ్గా ఉంటారు! ఆమ్యామ్యా.. డబ్బు సంపాదనలో లంచం కూడా ఒక మార్గమే! ఇందుకు ఒక కొలువు తప్పనిసరి. కొలువు ఏదైనా లంచానికి కాదేదీ అన ర్హం! లంచం తీసుకున్నందుకు చట్టం శిక్షించదు, తీసుకున్నట్లు పట్టుబడితేనే సుమా! లంచం ఆశించేవారు తెలివిగా ఉండాలి. మరీ దురాశకు పోరాదు. ఈ ఆశ లేనివాళ్లు ఏదైనా రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా వెళ్లవచ్చు. - ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత. సెల్ నెం : 7680950863 -
ఖల్నాయక్..
చార్మినార్ కేంద్రంగా నూతన నగరం ఏర్పడిన తర్వాత నగరం గురించి చెప్పిన వారిలో అమీర్అలీ మూడో తరానికి చెందినవాడు. ఈ థగ్గు ప్రత్యేకత ఏమిటి? ముందు తరాలు చెప్పిన ‘ఉద్యానవన నగరి’ వైనాలు నిజమేనని ధ్రువీకరించుకున్నాం.‘రోమాంచిత సాహసాలు’ ఇతడికే ప్రత్యేకం! అమీర్ అలీ అనే థగ్గు మాత్రమే బంజారాహిల్స్‌ను తొలిసారి వర్ణించాడు. ‘కుడివైపున కఠిన శిలల గుట్టలు. ఎడమవైపు మైదానప్రాంతం. ఆకాశంలో కలుస్తోందా అన్నట్టు ఆ మైదానం చాలా విశాలంగా ఉంది. మధ్యలో చిన్నిలోయ. అక్కడో నది (మూసి). తీరం వెంబడి అడవిని తలపించే వృక్షాలు. మధ్యలో సూర్యకాంతిలో తెల్లటి నివాసాలు. ధగధగా మెరుస్తున్నాయి. వీటన్నిటి మధ్య వీటన్నికంటే ఎత్తులో చార్మినార్.. పక్కనే మక్కామసీదు.. తలెత్తుకుని నిల్చున్నాయి. నూరు చిన్నచిన్న మసీదులు శ్వేతవర్ణంలో కాంతులీనుతున్నాయి. దూరం నుంచి ఈ నగరం చొరబడలేని అడవి. దగ్గరకు చేరేకొద్దీ తోటలు. తీర్చిదిద్దినట్టు.. వీధులు,నివాసాలు. దూరం నుంచి చూస్తే.. ఇక్కడ నరమానవులు ఉన్నారా..? అని అనిపించేది. నగరంలోకి ప్రవేశిస్తే తెలిసింది.. ఇది చిక్కని జనసముద్రం! చార్-మినార్ల మొనలు మేఘాలను చీల్చుకుని ఆకాశాన్ని అందుకున్నాయి. ఈ ఒక్క దర్శనం చాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫలితం దక్కింది’ అని హైదరాబాద్ గురించి రాసుకున్నాడు అమీర్ అలీ. బందీని విడిపించాడు! కుతుబ్‌షాహీ సమాధులను తొలిసారి వర్ణించిన క్రెడిట్ కూడా అమీర్అలీదే! ఇక్కడకు రావడంలో ‘అందం’ ఉంది.‘ప్రతాపం’ ఉంది. అమీర్ అలీ గుర్రంపై అటుగా వెళ్తున్నాడు. అజీమా అనే అందమైన యువతి బాల్కనీలో విశ్రాంతిగా కన్పించింది. ఓ ముసలి, వ్యసనపరుడు ఆమెను ఇంటి బందీని చేశాడు! అమీర్‌అలీని అజీమా చూపులు కలిశాయి. సహాయకురాలిని అమీర్అలీ దగ్గరకు పంపింది, విముక్తం చేయాలని కోరుతూ! కథను క్లుప్తం చేస్తే, వాళ్లు లేచిపోదామనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కుతుబ్‌షాహీ సమాధుల దగ్గరలోని షావలీ దర్గా దగ్గర కలుసుకోవాలని అనుకుంటారు. అనుకున్న వేళకు అమీర్ అలీ వచ్చేస్తాడు. అజీమాకు ఆలస్యం అవుతుంది. దిక్కులు చూస్తోన్న అమీర్అలీకి దర్గా కుడివైపు కుతుబ్‌షాహీ సమాధులు కనిపిస్తాయి. కొంచెం దూరం నుంచి చూసి చెప్పినా ‘కుతుబ్‌షాహీలు శాశ్వతనిద్రపోతున్న అచ్చోట అడవి పావురాళ్లూ, గబ్బిలాలు చేసే సవ్వడిని పెద్దపెద్ద గుమ్మటాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడి శబ్దమూ, నిశ్శబ్దమూ, వెలుతురూ, చీకటి చిత్రమైన భావాలను కలిగించాయి’ అని అన్నాడు. బంధం తెంచుకుంది! కొంచెం ఆలస్యంగానైనా అజీమా అనుకున్న చోటికి వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పిల్లవాడిని కన్నారు. చాలా సుఖంగా జీవించారు. పదేళ్లు రివ్వున గడిచాయి. అమీర్ అలీ పట్టుబడ్డాడు! జైలు పాలయ్యాడు! అజీమా ఎటువంటి మానసికస్థితికి లోనైఉంటుంది..? రోజుకు పలుమార్లు ‘దిగ్భ్రాంతి’ చెందినట్లుగా ప్రకటనలు ఇచ్చే ‘పెద్దవాళ్ల’లా కాదు, ఆమె నిజంగానే దిగ్భ్రాంతి చెందింది! తనను రక్షించిన కథానాయకుడు థగ్గు అని.. చుక్కనెత్తురు చిందకుండా వందల మందిని హత్యచేశాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆత్మహత్య చేసుకుంది! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఫోన్ నంబర్: 7680950863 -
సాగర సౌందర్యం
మెదొస్ టేలర్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ రెసిడెంట్‌గా పనిచేశాడని, పన్నెండేళ్లు జైలు జీవితం గడిపిన అమీర్ అలీ అనే థగ్గు చెప్పిన నేరాంగీకార వాజ్ఞ్మూలాన్ని నమోదు చేశాడనీ, గత వారం చెప్పుకున్నాం.ఆ వైనం ‘కన్ఫెషన్స్’ అనే పేరుతో 1839లో ఇంగ్లండ్‌లో తొలిసారి ప్రచురితమైంది. ఆ ‘రచన’లో కొంత నాటకీయత ఉందని విమర్శకులంటారు. నగర చరిత్రకు సంబంధించిన ఆసక్తికర అంశాలు లేవని ఎవరైనా అంటారా... అమీర్ అలీ కలవారి కుటుంబంలో పుట్టాడు. థగ్గులు అతని తల్లితండ్రులను హత్యచేశారు. థగ్గు నాయకుడు ఇస్మాయిల్. అతనికి పిల్లలు లేరు. ఐదేళ్ల అమీర్ అలీని చంపేందుకు చేతులు రాలేదు. తానే అనాథను చేసిన అమీర్ అలీని దత్తత తీసుకున్నాడు. బాలుడు నూనూగు మీసాలు వచ్చేసరికే థగ్గు ముఠాలకు నాయకత్వం వహించేలా ‘ఎదిగాడు’. మూడో నిజాం హైదరాబాద్‌ను పరిపాలిస్తున్న కాలం (1803-29). తన తొలి దాడికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాడు అమీర్ అలీ. హైదరాబాద్ వచ్చే క్రమంలో ఆదిలాబాద్ నవాబు ఆధీనంలో ఉన్న ఒక నర్తకిని రక్షించాడు. ఆ అమ్మాయి పేరు జోరా. వేశ్యమాత దగ్గర పెరిగింది! జోరాను బతికుండగా చూడబోనని ‘మాత’ ఆశలు వదులుకుంది. థగ్గు జోరాను ఆమె గూటికి మరలా చేర్చాడు. జోరాతో ఒక రాత్రి ఆనందాన్ని ప్రతిఫలంగా పొందాడు. వేశ్యమాత జోరాను వృత్తికి పునరంకితం చేసింది. మేనును తాకిన వజ్రాలు అల్వాల్ మీదుగా హైదరాబాద్ వచ్చిన అమీర్ అలీ అల్వాల్ గుడినీ (ఆళ్వారుల పేరుతో నిర్మితమైన శ్రీవేంకటేశ్వరస్వామి గుడి), ఆ ఊరి చెరువుని వివరిస్తాడు. దూరం నుంచి హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని, బ్రిటిష్ సైన్యపు మిలమిలా మెరిసే విడిది నివాసాలను చూస్తాడు. అప్పటి హుస్సేన్‌సాగర్ గురించి అమీర్ అలీ వర్ణన చూడండి... ‘వేల అలలు పడిలేస్తున్నాయి. సవ్వడి చేస్తున్నాయి. అలల అంచుల తెల్లని నురుగు తీరంలో మలచిన తీరైన రాతి కట్టడిని తాకుతూ విరిగిపోతున్నాయి. వజ్రాల్లా మారి మెత్తగా చల్లగా, హాయిగా మేనును తాకేవి. ఆ జలరాశిని చూస్తూ ఎంతసేపు గడిపామో తెలియదు. ఇంతటి జలసంపదను, సౌందర్యాన్ని మా థగ్గీలు ఎప్పుడూ చూడలేదు. మధ్యభారతంలో కథలుకథలుగా విన్న సముద్రమంటే ఇదేనేమో అనుకున్నాం, ముంగిట నుంచి నింగిని తాకే నీటిని చూసి!’ ఆ తర్వాత అమీర్ అలీ నౌబత్పహాడ్ను చూశాడు. తన గుర్రాన్ని ఛెళాయించి కొండను ఎక్కాడు. నగరం చూపుల దాపుల్లో ఎలా ఉందో చూద్దామని! కొండ కింద కనిపించే హైదరాబాద్ అమీర్ అలీని ఉవ్విళ్లూరించింది. ఎన్నెన్ని వైభవాలున్నాయో ఈ నగరంలో. ఉత్తరాది నుంచి వచ్చిన తర్వాత దక్కన్ పీఠభూమిలో ఇంతగా మిరుమిట్లుగొలిపిన జనావాసం తాను చూడలేదు! - ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి/ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్/ ఫోన్:7680950863 -
కెసెండ్రా మాట ఎవరు వింటారు?
నీరు జీవితం! చెట్టు చేమకు సమస్త ప్రాణికోటికి నదులు, ఇతర నీటి వనరులే జీవనాధారం! కాబట్టే నగరాలు నదీతీరాల వెంట వెలిశాయి. టైగ్రిస్, నైలు, సింధు నదీతీరాల్లో నాగరికతలు నవనవలాడాయి. నదుల నడక మారిన కారణంగా, నదుల్లో జలరాశులు హరించుకుపోయిన కారణంగా చారిత్రక నగరాలు అంతరించిపోయిన దాఖలాలున్నాయి. మొన్న ఆదివారం వరల్డ్ వాటర్ డే చేసుకున్నాం! నీరు చరిత్రలోకి ప్రవహించక ముందే ఓసారి నీటిని స్మరించుకుందాం! భూగోళం బాస్కెట్‌బాల్ సైజులో ఉంటే మంచినీటి గోళం పింగ్‌పాంగ్ బంతి సైజులో ఉంటుంది. భూగోళాన్ని ఆక్రమించిన 70 శాతం నీటిలో మంచి నీరు ‘గరిటెడే’! భూమి ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకూ మనిషికి అవసరమైన మంచి నీటి పరిణామంలో మార్పు లేదు! నీటి నిలువల్లోనే మార్పులు. సాంప్రదాయక పద్ధతుల్లోని నీటి నిలువలను మనుషులమైన మనం మార్పునకు గురిచేస్తున్నాం! నదుల సహజ ప్రవాహాన్ని అరికట్టి కృత్రిమ జలాశయాలను ఏర్పరుస్తున్నాం. సహజనీటి వనరుల చుట్టూ పరిశ్రమలు, నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. ఒక కారు తయారీకి పెద్ద స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో మంచినీరు వాడతాం. మంచినీటి విలువలు లేని ఒక కూల్‌డ్రింక్ కోసం రెండువందల రెట్లు అధికంగా మంచినీరు వాడతాం. మన చేష్టల ఫలితంగా మంచినీటికి నిలువ జాగా లేకపోతోంది! నీటిని నిలువ చేయడంలో ప్రకృతికి తనదైన పద్ధతులున్నాయి. మన పూర్వీకులు వాటిని గౌరవించారు. అధికారిక జలాశయాలు ఏర్పడ్డాక వాటి సరఫరా, నియంత్రణ కేంద్రీకృతం అయ్యింది. నీటి సరఫరా బ్యూరోక్రసీ విధుల్లో భాగం అయ్యింది. జలాశయాలు, కాలువల్లో మేటలు (సిల్ట్) ఏర్పడతాయి. వీటిని క్రమానుగతంగా తొలగించాలి. పాలకులు, అధికార గణం వాటిని పట్టించుకోరు. ఫలితంగా నీటి నిలువ సామర్ధ్యం కుంచించుకుపోతోంది! కొత్త కాలనీలు నిర్మించేపుడు, ఇళ్లు నిర్మించే సందర్భాల్లో అప్పటికే ఉన్న మురుగుకాల్వలకు నష్టం కలుగకుండా చేయడం, కొత్తవాటిని ఏర్పరచుకోవడం అనే అంశంలో దారుణమైన అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితం? చినుకు చిటుక్కుమంటే నగరం ముంపునకు గురికావడం అనుభవంలోకి వస్తూనే ఉంది కదా! సేద్యానికి జూదానికి తేడా ఏమిటి? వీటికి తోడు భూతాపపు పెరుగుదల వాతావరణంపై విపరీత ప్రతికూలతను చూపుతోంది. వానలు వెర్రెత్తుతున్నాయి. రుతువులకూ వానలకూ సంబంధం లేకుండా పోతోంది. ఈ నెలలో ఈ కార్తెలో వానలు వస్తాయి అనే శతాబ్దాల లెక్కలు తల్లకిందులు కావడంతో నీటి నిలువలపైనా ఆ ప్రభావం పడుతోంది. ‘వానాకాలం పంట’ అనే నానుడికీ కాలం చెల్లుతోంది. భారతీయ వ్యవసాయం జూదప్రాయంగా మారుతోంది. జూదశాల (క్యాసినో)కు వ్యవసాయానికీ తేడా ఏమిటి? క్యాసినో ఎప్పుడు తెరుస్తారో తెలుస్తుంది. మనమెంత నష్టపోతామో తెలుస్తుంది. వ్యవసాయ జూదం ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ముగింపు ఎప్పడూ సుఖాంతం కాదు కదా! ప్రాణాంతకంగా కూడా మారుతోంది. నీటి కంటె చమురు చౌక గతంలో ఎప్పుడూ వినని ‘నీటి కరువు’ అనే పరిస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. కెసెండ్రా గుర్తుంది కదా? ట్రాయ్ రాజు ప్రియం కూతురు కెసెండ్రా. ఆమె అందానికి అబ్బురపడ్డ అపోలో దేవుడు ఆమెకు జరగబోయే సంఘటనలను సవివరంగా చెప్పగల వరాన్ని ఇస్తాడు. కానుకకు కొనసాగింపుగా ఆమెతో సంగమాన్ని కోరతాడు. కెసెండ్రా అంగీకరించదు. అపోలో కోపితుడవుతాడు. ఆమె చెప్పే భవిష్యవాణిని ఎవ్వరూ నమ్మకుందురు గాక అని శపిస్తాడు. ఆధునిక కెసెండ్రాలు నీటి విషయంలో భవిష్యవాణిని చెబుతూనే ఉంటారు. ఎవరు నమ్ముతారు? వచ్చే ఐదేళ్లలో మంచినీటికి విపరీత కరువు వస్తుందని 2050 నాటికి శాశ్వత కరువు ఏర్పడుతుందని కెసెండ్రాలు సెలవిస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలు చమురు కోసం కాదు నీటికోసమే జరుగుతాయి అనే జోస్యాన్ని నమ్మాల్సి వస్తోంది. కడవ నీటికోసం పల్లెతల్లులు పదిమైళ్లు నడవడం కంటిముందు కనిపిస్తున్న వాస్తవమే కదా! నదీప్రవాహాలను పంచుకుంటున్న కర్ణాటక-తమిళనాడు మధ్య అంతర్యుద్ధం ఏర్పడ్డ పరిస్థితులను చూశాం కదా! తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు-పొగలు కన్పిస్తున్నాయి. పోలీసులు పోలీసులపై లాఠీచార్జ్ చేసిన వైనానికి కారణం ఇరురాష్ట్రాల నీటి అవసరాలే కదా! ఆ దండ కట్టలేం! ‘చెంగ’ అనే పంజాబీ పదానికి అర్థం మంచి, చక్కని, అందమైన.. ఇలాంటి పేర్లున్నాయి. భారతదేశానికి నదులతో ఒక చెంగల్వ దండ వేద్దామనుకున్నారు దివంగత ఇంజనీర్ కె.ఎల్.రావు. ఆయన నెహ్రూ కేబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేశారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు నీటి చుక్కకు తపిస్తోంటే కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడం గురించి రావుగారి ఇంజనీరింగ్ హృదయం కలత చెందింది! ఈ దుస్థితి తొలగాలంటే ఏంచెయ్యాలి..? నదులను కాల్వల ద్వారా అనుసంధానం చేస్తూ ‘గార్లెండ్ ప్రాజెక్ట్’ను సూచించారు. దశాబ్దాల క్రితపు ఖరీదైన ఆ కల ఇప్పటికీ ఆచరణలోకి అడుగువేయలేదు. ఒక వేళ అమలు చేయాలనుకుంటే గార్లెండ్ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చవుతుంది? పదేళ్ల క్రితం అంచనా ప్రకారం 5,60,000 కోట్ల రూపాయలు! ఆర్థిక కారణాలొక్కటే ఈ ప్రాజెక్ట్ అమలుకు అడ్డంకి కాదు. రాష్ట్రాల భిన్న ధోరణులు కూడా! ‘ నా జీవిత కాలంలో ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టదు’ అని ప్లానింగ్ కమిషన్ సభ్యులొకరు ఇటీవల నిర్వేదం చెందారు. అతడిని నిరాశావాదని అందామా..!! ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
సోమరసమూ! పాదరసమూ!!
పార్టీలు రెండు రకాలని, ఒకటి పొలిటికల్ (ఘన సదృశం), రెండోది నాన్-పొలిటికల్ (ద్రవ సదృశం) అని చెప్పుకున్నాం. రెండో తరహా కాక్టైల్స్గా విశ్వవిదితం. సాధారణంగా ఇవి సాయంత్రాల్లో మొదలు పెడతారు. ఎప్పుడు పూర్తవుతాయో ఎవరూ చెప్పలేరు! రకరకాల కారణాలతో, అకారణాలతో వీటిని నిర్వహిస్తారు. ఒకరిని స్వాగతించేందుకు. మరొకరికి వీడ్కోలు పలికేందుకు. పుట్టుక, పెళ్లి,చావు అన్నీ సందర్భాలే. కాక్‌టైల్స్‌కు అసందర్భమంటూ ఉండదు! వీటిల్లో భోజనాలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు. పార్టీల్లో ఫ్లేవర్ డిన్నర్లో గుబాళిస్తుందా? కాక్‌టైల్స్‌లో చిరుతిండ్లు వస్తుంటాయి. పార్టీలో ఒంపే స్కాచ్ బావున్నంతవరకూ ఆతిథ్యం ఇచ్చేవారు ఎలా ఉన్నా, ఎటువంటి ఇంగ్లిష్ మాట్లాడినా మేధావులకు పట్టింపు ఉండదు. అతిథులందరిలో సౌహార్ధ్రభావన వెల్లి విరుస్తుంది. అందరూ అందరిపట్లా చిరునవ్వులు చిందిస్తారు. ఒకరి మాటను మరొకరు మెచ్చుకుంటారు. అంతా శోభాయమానమే! కానీ చిత్రం, కొంతమంది ‘నికార్సయిన వ్యక్తుల’తో పార్టీలు విచిత్రంగా మారిపోతాయి. వీరు ఎవ్వరి అభిప్రాయాలతోనూ ఏకీభవించరు. ఈ కేటగిరీ ప్రాణుల పాత్రికలోకి మరో డ్రింక్ ఒంపారా? తమాషా షురూ... హవ్, ఏ సునే క్యా?! తమ అభిమతమే మీ అభిమతమూ కావాలని పట్టుబట్టే వాదనాప్రియులతో ఈ నికార్సయిన వ్యక్తులు మాట మాట కలుపుతారు. ఇందుకోసం వీలైనంత వరకు అపోజిట్ సెక్స్‌ను ఎంచుకుంటారు! వాదించి వాదించి ఒకానొక సమయంలో వాకౌట్ చేస్తారు. లేదా మాట్లాడలేనంతగా తాగేస్తారు. మాట్లాడేవారు వినేవారు అలసిసొలసిపోయిన దశలో, అలా ఏకాభిప్రాయాన్ని సాధిస్తారు! కాక్టైల్ పార్టీ ఎందుకు? దాని అమరికలో ఒక వైచిత్రం ఉంది. ఒక అంశం గురించి లేదా వ్యక్తి గురించి ‘అవునా?’ అన్పించే భావనను (ఫీలర్) ప్రవేశపెడుతుంది. ‘హవ్, ఏ సునే క్యా?! (అవునూ... ఇది విన్నారా)’ లాంటి ఇంట్రడక్షన్‌తో! ఈ ‘కొత్త’ను సర్కిల్స్‌లో చలామణి చేయడం కాక్టైల్స్తోనే సాధ్యం. ఎవరి నుంచి ఈ ‘తాజా విశేషం’ మొదలైందో వారితోనే ‘అవునూ ఇది విన్నారా..’ అని చెవికొరుకుతారు కొందరు. ఈ ప్రచార వృత్తాంతం బహుముఖంగా వ్యాపించాలని పార్టీ ఇచ్చే వ్యక్తి ఆశిస్తారు! పాదరస సంచరరే..! వ్యాపారరంగానికి చెందిన వారికి లేదా ఏదైన ప్రయోజనం ఆశించిన వారికి తాను పార్టీ ఇస్తున్న సందర్భాల్లో ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి చాలా హుందాగా ఉంటారు. తొణకరు. ఇతరులంతా తూలి సోలిపోయే వరకూ! వేరే సందర్భాల్లో ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి సరదాను ఆశిస్తారు. రాజకీయాలు, కరెంట్ ఈవెంట్స్ చర్చించకుండా ఆపడం ఈ పార్టీల్లో సాధ్యం కాదు. లోపలకు సోమరసం జారేకొద్దీ మానసంలో పాదరస సంచారం పెరుగుతుంది. జటిలమైన సమస్యలను చిటికెలో పరిష్కరించే జ్ఞానం సిద్ధిస్తుంది. ఈ మాట అనుభవపూర్వకంగా చెబుతున్నాను. కశ్మీర్ సమస్యను చాలామంది చాలాసార్లు పరిష్కరించారు, కాక్‌టైల్స్‌లో! మతతత్వానికి, టైజానికి, పాలస్తీనా సమస్యలకు ప్రత్యామ్నాయాలు అలవోకగా చెప్పగా విన్నాను. నేషనల్ క్రికెట్ టీంలో ఎవరెవరుంటే కప్పు మనదే అవుతుందో చిటికెలతో తేల్చిపారేయగా చూశాను. ఇరాక్ సమస్య కూడా చాలా సుహ్రుద్భావ వాతావరణంలో బహుపర్యాయాలు పరిష్కారం కాగా వీక్షించాను. పార్టీలో లేని తమ స్నేహితులగురించి ‘నిజాయితీ’గా మాట్లాడే వారినీ చూశాను. ఫలితంగా ఏర్పడే కాక్టైల్స్ తుపానులను శాంతపరచేందుకు మరికొన్ని కాక్టైల్ పార్టీలు కంపల్సరీ కావడమూ చూశాను. అతడంటే అసూయ! ధుమధుమలాడే భర్తలు కాక్‌టైల్స్‌లో తమ భార్యలపట్ల మహాప్రేమాస్పదంగా, వినయవిధేయతలతో ఉంటారు. మగవాడి కడుపులోకి మూడు డ్రింక్‌లు చేరాక మహిళ శరీరంలోకి ప్రవేశించే అందం.. అనితర సాధ్యం! కాక్‌టైల్స్‌లో పాల్గొనే మహిళలకు నాదొక సలహా! పార్టీల్లో ప్రశంసలను మీ ముఖవిలువలకు సంబంధించినవిగా ఎప్పుడూ భావించవద్దు! మెచ్చుకున్నా లేదా విమర్శించినా! ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. అన్ని తరాల అత్యుత్తమ మహిళానటీమణిగా ప్రపంచసినిమా మేరీ మేడ్లిన్ డిట్రెచ్ (1901-92)ను కీర్తించింది. ఆ జర్మన్-అమెరికన్ నటి గాయని కూడా. ‘ద బ్లూ ఏంజెల్, షాంఘై ఎక్స్‌ప్రెస్, ద డెవిల్ ఈజ్ ఎ ఉమన్’ తదితర చిత్రాల్లో డిట్రెచ్ నటించారు. ఆమె ఒక కాక్టైల్ పార్టీలో తనను తాను పెంచుకుంటోంది. ఆ సందర్భంలో నేరుగా ఆమె దగ్గరకు వెళ్లి ‘ మేడమ్ మీరు ఎంత అందంగా హుందాగా కన్పిస్తున్నారంటే, తాగినప్పుడు ఏ సాధారణ మహిళ అయినా కన్పించేంత అందంగా, హుందాగా’ అన్నాడు ఒక జర్నలిస్ట్ ! నా తరం వారికి అతడంటే అసూయ! ఇంకో డ్రింక్ తీసుకుంటే.. కొంతమంది అతిగా తాగి టేబుల్ కిందకు పడిపోతారు. సుప్రసిద్ధ అమెరికన్ హాస్యనటి ‘అయామ్ నొ ఏంజెల్’ ఫేం మాయివెస్ట్కు తన పరిమితులు తెలుసు. కాబట్టే ‘వద్దు, ఇంకో డ్రింక్ వద్దు. తీసుకుంటే ఆతిథ్యం ఇచ్చిన వారి కిందకు చేరాల్సి ఉంటుంది’ అనగలిగారు! కొంతమంది మగవాళ్ల ‘సత్యకాముకత’ గొప్పది. కాక్టైల్స్ వారి స్వభావాన్ని తగ్గించలేవు. ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అందుకు ఉదాహరణ. ఇంగ్లండ్ చట్ట సభలో తొలి మహిళా ప్రతినిధి లేడీ నాన్సీ ఆస్టర్. ఇద్దరూ ఉప్పూ నిప్పూ! చర్చిల్ ఒక సందర్భంలో ‘నాన్సీ నువ్వు అగ్లీ (వికారి)’ అన్నాడు. ‘విన్స్టన్, తాగుబోతు మొహమా’ అన్నారు నాన్సీ. ఆమె మాటను తిప్పికొడుతూ ‘రేపు పొద్దుటికి నేను హుందాగా ఉంటా. నీవు మాత్రం అగ్లీగానే ఉంటావ్’ అన్నాడు! సరే, ‘ధీమతు’ల పార్టీ, ‘సార’మతుల పార్టీల గురించి చెప్పుకున్నాం కదా! నేను ధీమతిని కాదు. ఒకోసారి నా దారికి అటూ ఇటూ వెళ్తుంటా. మరీ దూరం పోకముందే అసలు దారికి వస్తుంటా. ‘నేను పట్టిన కుందేటికి’ అనుకోలేని సంశయజీవిని! అందువల్లే ఏ రాజకీయపార్టీలోనూ చేరలేదు. అలా అని ‘సార’మతినీ కాదు! ఫలానా సమస్యకు పరిష్కారం ఏమిటి? అని సందేహం వస్తే! సమాధానాన్ని కాక్టైల్ పార్టీల్లో శోధిస్తా! ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
ఆజ్ జానే కి జిద్ న కరో!
narendrayan-14 ఇక్కడే పుట్టి పెరిగాను. అయినా ఈ నేల తనది కాదు! ఇక్కడ వేర్వేరు భాషలు మాట్లాడతారు. తన మతస్తులందరూ అక్కడ ఒకే భాష మాట్లాడతారు! అదిగో ‘స్వర్గ రాజ్యం’! ఈ తరహా భావనలు ఎటువంటి వాస్తవాలను అనుభవంలోకి తెచ్చి ఉంటాయి? హైదరాబాద్ సంస్థానపు హోదా కోల్పోయింది. భారత యూనియన్‌లో విలీనం అవుతోంది! ఆ దశలో పాకిస్థాన్‌కు వె ళ్లాడు నిజాం రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన నవాబ్ హఫీజ్ యార్జంగ్! ఆయన తొలినాళ్ల అనుభవాలు ఆసక్తికరం! (Beyond the Full Circle అనే నవలలో సోదాహరణంగా వివరించాను) ఇండియా నుంచి పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చిన వారి కోసం కరాచీకి సమీపంలోని నజీమాబాద్ అనే పట్టణంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్టేట్‌లో తన కేడర్ కంటే తక్కువ స్థాయి ఉద్యోగాన్ని నవాబ్ హఫీజ్ యార్‌జంగ్‌కు ఇచ్చారు. అక్కడి స్థానికులు సింధీ మాట్లాడతారు. ఇండియా నుంచి వచ్చిన శరణార్థులు మాత్రమే ఉర్దూ మాట్లాడతారు. ఈ కొత్తవాళ్లను ‘ముహాజిర్స్’ అనే పేరుతో ఈసడింపుగా చూస్తున్నారు. మహ్మద్ ప్రవక్త కూడా ముహాజిరే! తన పూర్వీకుల పట్టణం మక్కా నుంచి మదీనాకు వలస వెళ్లారు. ఒక పవిత్ర దేశాన్ని స్థాపించేందుకు ఉన్న ఊరును ఆస్తిపాస్తులను ప్రవక్త, ఆయన అనుయాయులు వదలి వేశారు! ఆ ధార్మికస్ఫూర్తితో పాకిస్థాన్ (పవిత్ర దేశం) ఏర్పడుతోందని విశ్వసించిన వారు ఆశోపహతులు కాక తప్పలేదు! పాకిస్థాన్ సచివాలయంలో నవాబ్ హఫీజ్ ఖాన్‌ను ‘ఆ ముహాజిర్, అదే హైదరాబాద్ దక్కనీ..’ అనేవారు. సింధ్‌లో హైదరాబాదే అసలైనదని వారి ఉద్దేశం. ‘ముహాజిర్స్’లోనూ అంతరాలున్నాయి. ఉత్తరప్రదేశ్, తూర్పు పంజాబ్ నుంచి వచ్చిన వారు వీరులు! శూరులు! ఇతరుల కంటె ఒక మెట్టు పైన! ప్రథమ శ్రేణి! వీరితో పోలిస్తే హైదరాబాద్ (దక్కనీయులు) నుంచి వచ్చిన వారు తక్కువ మంది! వీరిని తక్కువగా చూసేవారు! మాట తీరును బనాయించేవారు! మంజూర్ ఖదీర్ అనే తన పై అధికారితో నవాబ్ హఫీజ్ యార్జంగ్ తొలి సంభాషణ ఇందుకు ఉదాహరణ: మంజూర్ ఖదీర్: నీవు దేనికి నవాబువు? (హఫీజ్‌కు ఏమీ అర్థం కాలేదు. షేర్వానీ గుండీలను తడుముకున్నాడు) నీకు ఎక్కడో జాగీర్ ఉండి ఉంటుంది? ఆ జాగీర్ ఎక్కడుందో తెలుసుకుందామని! హఫీజ్: కాస్తో కూస్తో జాగా ఉండేది, హైదరాబాద్‌లో. నవాబ్ అనే పేరు నిజాం ఇచ్చిన బిరుదు మాత్రమే! మంజూర్: ‘ఓహో నువ్వు జమీన్ లేని జమీందారువా? ఇంగ్లండ్‌లో లార్డ్ ‘లాక్ ల్యాండ్’ అంటారే భూమిలేని ప్రభువ్వన్నమాట! (తెరలు తెరలుగా నవ్వుతూ) హఫీజ్: ‘అవున్సార్, అలా అనుకోవచ్చు! ఢిల్లీ నుంచి లక్నోకు వలస వచ్చిన కవి మీర్ తాఖీ మీర్ ‘వైభవోజ్వల నగరి నుంచి ఇచ్చోటికి వలస వచ్చాను’ అన్నాడు కదా, నా పరిస్థితీ అదే.. మంజూర్: అవునూ, నేను మీ హైదరాబాద్ ఎప్పుడూ చూడలేదులే! నిజాం గురించి చాలా చాలా విన్నాను. అందమైన ఆడవాళ్లుంటారట! నీలోఫర్ మరీ అందగత్తెట ? నిజాం కోడల ని విన్నాను. నిజమా? హఫీజ్: అలా కాదు.. (నీళ్లు నములుతూ మౌనంగా ఉండిపోయాడు) అల్ హజ్రత్ (మహాప్రభువు)గా తాము భావించే నిజాంను ఇలా అంటారా? ఆయనిప్పుడు ప్రభువు కాదుకదా! లాఫింగ్ స్టాక్! తాను మాత్రం? నవాబ్ హఫీజ్ అహ్మద్ యార్జంగ్! నవాబ్ కాదు కదా కనీసం సాహెబ్ అని పిలిచేవారేరి? ఇది తన దేశం కాదు. ఇక్కడ తన భాష మాట్లాడరు. సింధీలు-బలూచియన్స్-ఫస్తూస్-పంజాబీలకు ఉర్దూ పరాయి భాష! ఇంతకీ తాను ఇక్కడకు ఎందుకు వచ్చినట్లు?! కరాచీలో గజల్ కార్యక్రమాలుంటే తనకు ఆహ్వానాలు వచ్చేవి. ఫరీదా ఖనూమ్ (గజల్ రాణి) వంటి ఆ తరపు గాయనీమణులు ఎనభయ్యోపడిలో ఇప్పటికీ కరాచీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఓ రోజు సాయంత్రం మున్ని బేగం అనే వర ్ధమాన గాయని ఫయాజ్ హష్మీ గజల్‌ను పాడుతోంది ! హఫీజ్ అనే హైదరాబాదీ రాక్ కరిగి నీరవుతోంది... హైదరాబాద్ నుంచి వస్తోండగా తన ప్రాణసఖి సకీనా అన్నమాటలు గుర్తొస్తున్నాయి. ‘స్వర్గం ఇక్కడే ఉంది. మనం కలసి ఉన్నన్నాళ్లూ ఉంటుంది. విడిపోయామా అదృశ్యమవుతుంది. మరెక్కడకో వెళ్లి వెతక్కు’ అని హితవు పలకడం, ఆమె హైదరాబాద్‌లోనే ఆగిపోవడం, చివరి క్షణం వరకూ తననూ ఆపేందుకే ప్రయత్నించడం గుర్తొచ్చింది. ఆమె మాటల సారాంశం గజల్ రూపంలో ప్రవహిస్తోంది... ఆజ్.. జానేకి.. జిద్.. న.. కరో (నేడు వెళ్తానని మారాం చేయకు..) ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
దావత్ల దరహాసాలు!
ఆరో కుతుబ్‌షాహీ భార్య హయత్ బక్షీబేగంను ‘మా సాహెబా (అమ్మగారు)’ అని నగర ప్రజలు పిలుచుకునేవారు. ఆమె పేరుతో తవ్వించిన చెరువును మా సాహెబా తలాబ్ అనేవారు. చెరువు కనుమరుగై ‘మాసాబ్ ట్యాంక్’ మిగిలింది! మాసాబ్‌ట్యాంక్‌లో మా సమీప బంధువు నివసించేవారు. హైద్రాబాద్ వచ్చిన కొత్తలో కజిన్ ఇంట్లో కొన్నాళ్లున్నాం. మా పొరుగు ఇల్లు ఓ నవాబుగారిది. నిజాం పాలనలో ఉన్నతాధికారులను, వారి బంధువులను, సామాజికంగా ఉన్నత కుటుంబీకులను నవాబులుగా వ్యవహరించేవారు. నిజాం హయాం గతించినా, ఓడలు బండ్లు అయినా.. నవాబులు తమ సోషల్ స్టేటస్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చేవారు. narendrayan - 4 డేట్ దేఖో.. వఖ్త్ నహీ! నగరం డిన్నర్ పార్టీలకు పెట్టింది పేరు. నిజాం హయాంలో అధికారిక విందు కార్యక్రమాలను గుర్తు చేస్తూ ‘దావత్ -ఎ-నిజాం’ పార్టీలు నిర్వహించేవారు. తిరస్కరించకూడని గౌరవనీయుల నుంచి ఆహ్వానాలొచ్చేవి. దావత్‌కు కారణాలు ఏమిటి? అని లోతుల్లోకి పోకూడదు. ‘బహానా(సాకు)’లు ఒకోసారి చిత్రంగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా దావత్‌కు పిలిచారనుకోండి. ఏ రోజు అని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఏ సమయం అని గుర్తుంచుకోకూడదు. ఫలానా సమయం అన్నారు కదా అని ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్లారా? ‘తప్పు’లో కాలేసినట్లే! నగరానికి వచ్చిన తొలిరోజుల్లో అమాయకంగా ఓ పార్టీకి వెళ్లా, చెప్పిన టైంకు! దావత్ తాలూకూ అలికిడి కన్పించలేదు. ఆహ్వానించిన పెద్దమనిషి కన్పించలేదు. ఆదుర్దాతో పనిమనిషిని వెన్యూ గురించి అడిగాను. ‘రావాల్సిన చోటికే వచ్చారు. డిన్నర్‌కు రావాల్సిన వారు, సాయంత్రం టీ వేళకు వ చ్చారు’ అని జాలిపడ్డాడు. ఓ గంట తర్వాత మధువులొలకడం మొదలైంది. రాత్రి 11 గంటలైంది. నా కడుపులో సెకనుకో ఆకలి గంట మోగుతోంది.చివరికి తెగించి అడిగేశాను. అయ్యా భోజనం పెట్టించండి అని! హోస్ట్ ఆశ్చర్యపోయారు. ‘అదేంటి..అప్పుడే భోజనమా? ఆహ్వానించిన వారిలో చాలామంది రానే లేదు’ అన్నారు. ఆయన దయాశీలి! నా కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేను తెలివి తెచ్చుకున్నాను. ఏ పార్టీకి వెళ్లినా చెప్పిన టైంకు కనీసం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ‘బేగం’ దావత్! త్వరగా వెళ్లి త్వరగా ఇంటికి రావాలనుకున్నా, లేదా పార్టీ ముగిసేంతవరకూ ఉండి రావాలనుకున్నా.. హైద్రాబాద్ పార్టీలకు భోంచేసి వెళ్లడం మంచిది. నిజాంకు అత్యంత సన్నిహిత కుటుంబీకులు పైగాలు. ఆ వంశానికి చెందిన వలీ ఉద్ దౌలా నిజాంకు ప్రధానిగా పనిచేశారు. ఆయన శ్రీమతి(బేగం) ఓసారి తమ స్వగృహం విలాయత్ మంజిల్ (బేగంపేటలోని ఇప్పటి కంట్రీ క్లబ్)లో డిన్నర్‌కు పలిచారు. టైంకు వెళితే బావుండదు కదా! కొంచె ఆలస్యంగానే వెళ్లాను! ఇదిస్వీకరించండి, అది స్వీకరించండి అనే మర్యాదల నేపథ్యంలో తేలిన విషయం ఏమిటయ్యా అంటే, అందరిలో నేనొక్కడినే శాకాహారిని! మళ్లీ కడుపు కాలింది. బేగంగారు ఇతర ముఖ్యులు శ్రద్ధతో వాకబు చేశారు. యురేకా! ‘పుడ్డింగ్’! ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి -
సిమ్లా టు సిటీ!
నరేంద్రలూథర్ ‘శ్యామలా’ అనే దేవత కొలువున్న ‘శామ్లా’ ప్రాంతం సిమ్లాగా మారిందట! బ్రిటిష్ ప్రభుత్వానికి వేసవి రాజధాని అయిన సిమ్లాలో నాన్న ఉద్యోగం. కొండపై ప్రభుత్వ బంగళాలో నివాసం. కొండ కింద మేఘసంచారం. నూరు వంతెనల రైలు మార్గంలో ప్రయాణాలు. నీట్ సిటీ. ‘ఆవుపేడ’ చూడలేదుంటే అతిశయోక్తి కాదు. సిమ్లాలో ఏడేళ్ల బాల్యం కలగా గడచి పోయింది. నాన్న బదిలీలతో 1946లో లాహోర్కి, ఆ తర్వాత రావల్పిండికి మా నివాసాలు మారాయి. అమ్మ రామచరితమానస్ శ్రావ్యంగా చదివేది. చెల్లెళ్లు సితారా వాయించేవారు. నాకు తబలా వచ్చు. మెట్రిక్యులేషన్ పరీక్ష రాశాను. రిజల్ట్స్ రాలేదు. దేశ విభజన వార్తలు వస్తున్నాయి. తుపాకుల మోతల మధ్య ఆగస్ట్ 14-15 అర్ధరాత్రి నెహ్రూ ఉపన్యాసం బిక్కుబిక్కుమంటూ విన్నాం. నాన్న స్నేహితుడు ఒక ముస్లిం ఉద్యోగి, మా కుటుంబానికీ మరో రెండు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చారు. బయటకు వెళ్తే ముస్లిం పేర్లు చెప్పాలి. మా తమ్ముడి పేరు అక్రమ్. నా పేరు అస్లమ్. ఇక్కడ జీవించలేరు, ఇండియా వెళ్లిపోండి అని హితైషులు చెప్పినా, పుట్టిన గడ్డను విడిచేందుకు నాన్న ఇష్టపడలేదు. తర్వాత పరిణామాలరీత్యా ఇండియా వెళ్దామని అన్నారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వేసిన రైలులో 14మంది కూర్చునే కంపార్ట్మెంట్లో 40 మంది ‘సర్దుకున్నాం’! మూడురోజుల ప్రయాణం తర్వాత మృతుల-జీవన్మృతుల కంపార్ట్మెంట్లతో రైలు అమృత్సర్ చేరింది. రైల్వే స్టేషన్‌కు ఆనుకునే తాత్కాలిక శ్మశానాలు. బాధితులకు సేవలు చేసేందుకు స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చేది. ‘సంఘసేవ’ చేసినందుకు గత విద్యార్హతలతో సంబంధం లేకుండా వయసును బట్టి పట్టభద్రత ఇచ్చేవారు. నేను ‘మెట్రిక్యులేట్’ని! ఆగస్ట్ 15 అంటే కొందరికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. మా బోటోళ్లకు దేహం ఖండితమైన రోజు! నాన్నకు హోషియార్పూర్ జిల్లాలోని గడ్శంకర్లో పోస్టింగ్ ఇచ్చారు. కట్టుబట్టలతో ‘రేఖ’కు అటు నుంచి ఇటు వచ్చినట్లు, ఇటు నుంచి అటు కూడా వెళ్లిన వారు ఉంటారు కదా! అలా ఖాళీ అయిన నివాసంలో కొన్ని గదులను మా కుటుంబానికి ఇచ్చారు. కొందరు వదిలేసిన వస్తువుల్లో కావాల్సినవి తీసుకోవలసినదిగా గ్రామ పెద్దలు చెప్పడంతో కుటుంబ ప్రతినిధిగా నేను గ్రామపంచాయతీ దగ్గర వరుసలో నిల్చున్నా. చేతిలో సంచి లేదు. ఒక మగ్గు కన్పించింది. ఆ పాత్రపై ఉర్దూలో కవిత ‘మధువు తాగితాగి హృదయం భగ్గుమంటోంది॥ ఓ పాత్రధారీ, కొన్ని మంచు ముక్కలు వేసి ఉపశమనం కలిగించవా॥ అని. అక్కడి వస్తువుల్లో ఒక ఖురాన్ ప్రతి కన్పించింది. నాన్నను రావల్పిండిలో ‘మహాత్మా’ అనీ ‘మౌలానా’ అనీ పిలిచేవారు. ఆయన గీతను, ఖురాన్‌ను అంత తన్మయంగా గానం చేసేవారు. నాన్న ఖురాన్ తెచ్చుకునేందుకు వీలు కాలేదు. సో... ఒక చేత్తో మగ్గూ మరో చేత్తో ఖురాన్‌తో ఇంటికి వచ్చాను. కవిత్వం నచ్చి మగ్గు తెచ్చానని హాస్యమాడారు. ఖురాన్ ఎందుకు తెచ్చావు, ఇన్ని గొడవలకు కారణం ఈ పుస్తకమేగా అని అక్క అంది. ‘ఖురాన్‌ను చదివి అర్థం చేసుకున్నవారే మనకు ఆశ్రయం ఇచ్చారు. మంచి పని చేశావు’ అని నాన్న మెచ్చుకున్నారు. ఆ ప్రతి ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది! 1953లో ఎం.ఎ, 1954లో ఐఏఎస్ పూర్తి చేశాను. ఢిల్లీలో, వైజాగ్‌లో ఒక సంవత్సరం ట్రైనింగ్. నా తొలి పోస్టింగ్ మద్రాసు నుంచి విడిపోయిన ‘ఆంధ్ర రాష్ట్రం’ గూడూరులో. మూడు రోజుల భారీ వర్షాల వల్ల సువర్ణముఖి నదికి వచ్చిన వరదల సహాయక చర్యలతో నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ‘మద్రాసీ’ అనే భాష లేదని, ‘తెలుగు’ భాష ఉందనీ ఇక్కడకు వచ్చాకే తెలిసింది. 1959లో రాష్ట్ర సమాచార - ప్రజా సంబంధాల శాఖ డెరైక్టర్‌గా హైదరాబాద్ వచ్చాను. నగరం నన్ను నన్నుగా తీర్చిదిద్దింది! ప్రజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి -
రంగస్థలం కొత్త ఆశను చివురిస్తుందా?
రంగస్థలం ఎందుకు ఆకర్షిస్తుంది? ఏడ్చేందుకు. జ్ఞాపకాలను కలబోసుకునేందుకు. నవ్వేందుకు. శోధించుకునేందుకు. బతుకు బాటపై నిబ్బరంగా నడిచేందుకు. అది మనుషులు చేతనత్వాన్ని పొందే వేదిక. శక్తిని సంతరించుకునే ఆవరణ. వివిధ దేశాల, సమూహాల సాంస్కృతిక సంపదను గుణగానం చేసే వేదిక. మనుషులను విభజించే సరిహద్దులన్నిటినీ లుప్తం చేసే అద్భుతస్థలి! బ్రెట్ బైలీ, దక్షిణ ఆఫ్రికా నాటక రచయిత, డిజైనర్. ‘థర్డ్వరల్డ్ బన్ఫైట్’ వ్యవస్థాపక ఆర్టిస్టిక్ డెరైక్టర్. ‘వలస పాలన తర్వాత ప్రపంచం పోకడలు’ అనే అంశం ఆయన అభిమాన విషయం. ‘మనం ఏడాది పొడవునా చేసుకున్న స్వాతంత్య్ర దినోత్సవాల ఆర్భాటాన్ని ఒక ప్రదర్శనతో బ్రెట్ తుస్సుమనిపించారు’ అని యూరోపియన్ దేశాల విమర్శ కులు కొనియాడిన ప్రభావశీలి. ‘మహాభారత్’ ఫేం పీటర్ బ్రూక్ ఆయన అభిమాని. ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ‘యునెస్కో’ ద్వారా ప్రపంచ కళాకారులకు బ్రెట్ బైలీ అందిస్తోన్న సందేశ సారాంశం: మానవ సమాజం ఉన్నన్నాళ్లూ అభినయించడం ఆపుకోలేని ఉద్వేగంగా ఆవిష్కృతమవుతూనే ఉంటుంది. పల్లెల్లో చెట్ల క్రింద, హైటెక్ స్టేజ్‌పై మహానగరాలలో, బళ్లల్లో, పొలాల్లో, ప్రార్థనాస్థలాల్లో, మురికివాడల్లో, కమ్యూ నిటీ సెంటర్లలో, సెల్లార్లలో ప్రజలు గుమిగూడుతూనే ఉంటారు. మానవ జీవితంలోని సంక్లిష్టతలు, వైవిధ్యాలు, కలవరపరచే, సాంత్వన పరచే అనేక అంశాలు కళారూపా లుగా వ్యక్తమవుతూనే ఉంటాయి. రక్తమాంసాలతో తొణికిస లాడే, శ్వాసించే, సంభాషించే మనిషి ఉన్నన్నాళ్లూ మనిషితో మనిషి సంభాషించే ‘అభినయం’ సజీవంగా ఉంటుంది. మనుషులు స్టేజ్‌కి ఎందుకు ఆకర్షితులవుతారు? ఏడ్చేం దుకు. జ్ఞాపకాలను కలబోసుకునేందుకు. నవ్వేందుకు. శోధించుకునేందుకు. నేర్చుకునేందుకు. బతుకుబాటపై నిబ్బరంగా నడిచేందుకు. కొత్త ఊహలు అల్లుకునేందుకు. అబ్బురపడే ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో అనాదికాలపు దైవాన్ని అవతరింపజేసేందుకు. మన శ్వాసలన్నీ ఏకం చేసి ఒకే నిశ్వాసంతో భయద-సౌందర్యాలను, కారుణ్యాలను, కర్కశాలను అనుభవంలోకి తెచ్చుకుని నిట్టూర్చేందుకు. అంతేనా? రంగస్థలం ఇంకా ఎందుకు మనుషులను ఆకర్షిస్తుంది? అది, మనుషులు చేతనత్వాన్ని పొందే వేదిక. శక్తిని సంతరించుకునే ఆవరణ. వివిధ దేశాల, సమూహాల సాంస్కృతిక సంపదను గుణగానం చేసే వేదిక. మనుషులను విభజించే సరిహద్దులన్నిటినీ లుప్తం చేసే అద్భుతస్థలి! కేవలం ఒక వ్యక్తి ద్వారా లేదా కొందరి ద్వారా ప్రదర్శన సాధ్యపడదు. ప్రతి ప్రదర్శన సామూహిక జీవితంలోంచే జన్మిస్తుంది. మన వేర్వేరు సంప్రదాయాల వేష - భాషల్లోంచి వస్తుంది. మన శరీర నిర్మాణాలు, కదలికలు, మన హావభావాలు, భాషలు, పాటలు, రాగాల నుంచి ప్రదర్శన ‘ధ్వనిస్తుంది’! మనలోని శూన్యాన్ని ఆ సౌందర్యం పూరిస్తుంది. ఈ నేపథ్యంలో, ఆధునికులంగా, కళాకారులుగా మన పాత్ర ఏమిటి? మానవ సమాజపు సంవేదనలను భవిష్యత్ సమాజాలకు మిరుమిట్లుగొలిపే ఆసక్తులతో మనం ప్రదర్శించాలి! ఈ క్రమంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? మన చుట్టూ కోట్లాది ప్రజ మనుగడ కోసం సతమత మవుతోంది. నియంత్రణ పదఘట్టనలో ప్రజలు నలిగిపోతు న్నారు. పెట్టుబడిదారీతనానికి రాపాడుతున్నారు. జీవితా ల్లోకి రహస్య సంస్థలు ప్రవేశిస్తున్నాయి. మన మాటలను నిషేధిస్తున్నాయి. అడవులు దగ్ధమవుతున్నాయి. జీవ జాతులు అంతరిస్తున్నాయి. సముద్రాలు విషతుల్యమవుతు న్నాయి. మనం ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి! అంతులేని అధికారాలను కలిగి ఉన్న ప్రభుత్వాలు, సంస్థలు మనలను ఒకే తరహా అభిప్రాయాన్ని కలిగి ఉండమంటున్నాయి. ఒకే జాతి, ఒకే రంగు, ఒకే మతం, ఒకే లింగాధిక్యత, ఒకే సిద్ధాంతం, ఒకే ఫ్రేమ్‌లో సాంస్కృతిక చిత్తరువు ఉండాలని నిర్దేశిస్తున్నాయి. ఈ వాతావరణంలో కళ స్వేచ్ఛగా వ్యక్తం కాగలదా? మార్కెట్ శక్తుల ‘సంబద్ధ’ ఆకాంక్షలకు లోనై మన శక్తి యుక్తులను క్షీణింపజేసు కుంటూ, వివిధ వేదికల నుంచి వచ్చిన కళాకారులం మనం ఏమి చేయాలి? మన చుట్టూ సమూహాలు చేరుతున్నాయి. ‘ఉందిలే మంచి కాలం ముందుముందునా’ అని వారిలో విశ్వాసం నింపేందుకు ఏమి చేయాలి? ఒక కొత్త ఆశ చివురించేందుకు మనం ఏమి చేయాలి? పున్నా కృష్ణమూర్తి -
వేయిగొంతుల ‘నైమిశ’ గానం!
నన్నయ ఆది కవే కావొచ్చు. తిక్కన ఉభయ కవిమిత్రుడే కావచ్చు. వారిరువురికీ లేని భాగ్యం తాను శిష్యుడవడం వలన తన గురువు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రివారికి దక్కింది అన్నారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారా యణ! శ్రీకాళహస్తీశ్వరమహాత్మ్యం రాసిన దూర్జటికి, పాండురంగ మహాత్మ్యం రాసిన తెనాలి రామకృష్ణకు, సుమతీ శతకకారుడు బద్దెన, వేమనకు దక్కని గౌరవం ఒక శతక కర్తగా తనకు దక్కుతోందని తెలుగు భాషాభి మానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. తాను ఇటీవల రచించిన ‘నైమిశ వేంకటేశ శతకా’ న్ని వేయి మంది ఆబాల గోపాలం, జనవరి 10వ తేదీన విజయనగరంలో కంఠోపాఠంగా గానం చేస్తోన్న సందర్భంగా రామలింగేశ్వర రావుతో ఇంటర్వ్యూ సారాంశం. పురాణాల పుట్టింట పుట్టుక! యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు జెరూ సలెం పుణ్యస్థలం. ఎందరో కవులు ఆ పుణ్య భూమి గురించి కవిత్వం రాశారు. అలాగే సంప్రదాయ భారతీయులకు నైమిశారణ్యం పుణ్యస్థలి. ఉత్తరభారతంలో లక్నో సమీపం లో 84 క్రోసుల విస్తీర్ణంలో వ్యాపించిన ఆ అర ణ్యం ‘జీవులెనుబది నాల్గులక్షల’కు ముక్తి ధామం! నైమిశారణ్యంలోనే వ్యాసుడు వేదా లను సంకలనం చేశాడు. 18 పురాణాలను రచించాడు. వృతాసురుని సంహారం కోసం తన వెన్నెముకనే ఆయుధంగా అర్పించిన దధీచి వంటి 88 వేల రుషులు తపస్సు చేశా రు. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర ఆలయం నుంచి బ్రహ్మోత్సవాలలో పాల్గొనవల సిన దిగా సరిగ్గా రెండేళ్ల క్రితం పిలుపు వచ్చింది. నైమిశ వేంకటేశ్వరుని గర్భగుడిలో ఆశు వుగా ఒక పాట వచ్చింది. ‘పురాణాల పుట్టిం టికి రండి, పురాణ పురుషుని చూడండి...’ అని! నైమిశ చరిత్ర మనసును ఆవాహన చేసు కుంది. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం మొదటి పద్యం ఉబికింది. ఇరవై రోజుల్లో శత కం పూర్తయ్యింది. అపూర్వ ఆదరణ! నైమిశ వేంకటేశ్వర శతకం అపూర్వ ఆదరణకు నోచుకుంది. మేము కంఠతా పట్టాం, మేం కం ఠతా పట్టాం అని వివిధ ప్రాంతాల నుంచి స్పందన వచ్చింది. నిరుడు డిసెంబర్ 21న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరి గిన వేడుకలో 750 మంది శతకంలోని 108 పద్యాలనూ గానం చేశారు. పాలకొల్లు నుంచి అభిజిత్ అనే అంధయువకుడు, తమిళనాడు లోని మదురై నుంచి ఒక తమిళ మహిళ, సాధారణ గృహిణులు, చిన్ని చిన్ని వ్యాపారా లు నిర్వహించుకునేవారు, నిరక్షరాస్యులు, సాఫ్ట్వేర్ యువత నైమిశ వేంకటేశ శతకాన్ని కంఠతా పట్టి పఠించారు. ఈ ఆదరణకు మూడు ప్రధాన కారణాలు. ‘దేని పోగొట్టుకొంటిమో దానిపొంది/ అందరికి దానినందరు అందజేసి/ సఖ్యతన్ శాంతిసౌఖ్యాల సాగున టుల/ వేయుమా, బాట వేంకటేశ నైమిశ’ అనే రీతిలోని పద్యాలు నైమిశారణ్య ఐతిహా సిక ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. ‘తామసమునుండి చేరితి నైమిశమును/ రాజసమునుండి పలికితి రామకథను/ సత్త్వదశనుండి వ్రాసితి శతకకృతిని/ వివిధ తత్త్వేశ నైమిశ వేంకటేశ’ వంటి పద్యాలు శ్రీ వేంకటేశుని కృపాకటాక్షాన్ని తెలియజేస్తాయి. ‘తెలుగుపై కాక ధనముపై దృష్టియున్న /యిట్టి, అమృత వాక్స్రసిద్ధి తట్టి రాదు/కొంత అర్ధమయితివి ఓ అనంత/ అదియు వింతలో వింత, నైమిశ వేంక టేశ’ తరహా పద్యాలు తెలుగు భాషపై ప్రేమాభిమానాలు కలవారందరినీ అల రించాయి! ‘శతక పద్యాలను నియమం గా చదివితే నైమిశారణ్యంలోని చక్ర తీర్థంలో స్నానం చేసిన ఫలసిద్ధి కలుగు తుంది’ అనే ఫలశ్రుతి సైతం ఆదరణకు ప్రేరణనిచ్చింది! గిన్నిస్‌లో ‘శతకగానం’! లిపి కలిగిన భాషలు మూడువేలున్నాయి. అచ్చయిన 11 నెలల్లో 108 పద్యాలను వేయి మంది కంఠస్తం చేయడం అనే సంఘటన ఏ భాషలో సంభవించినా అది సాహితీ సరస్వ తికి సత్కారమే. తెలుగులో ఈ అపూర్వ ఘట న జరగడం, భాషకూ కవికీ దక్కిన అదృష్టం! ఒక కవి జీవితకాలంలో జరిగే ఈ అపూర్వ సందర్భం సాధ్యం కావడానికి సాహిత్యంలో ఆధునిక సాంకేతికత తెచ్చిన సౌలభ్యం కూడా కారణమే! ‘నైమిశ వేంకటేశ శతకం’ వేయి గొంతుల నుంచి ధ్వనించడం, గిన్నిస్ బుక్‌లో నమోదు కావడం సహజమే కదా! పున్నా కృష్ణమూర్తి