‘నేనయ్యా నాజర్‌ను, లోపలకు పోనివ్వండి’ మేఘం ఉరిమినట్లుగా విన్పించింది గుంటూరు శ్రీ వేంక టేశ్వర విజ్ఞాన మందిరంలో 1990 ఏప్రిల్‌లో ఒక సాయంత్రం. సినీ సంగీత దర్శకుడు చక్రవర్తికి సన్మానం. హాలంతా కిక్కిరిసింది. బయటా గాంధీ పార్కులోనూ నిలుచున్న జనం ప్రసంగాలను వింటున్నారు. హాలులో ప్రెస్‌కు కేటాయించిన మొదటి వరుసలో కూర్చున్నాను. ఆ సందర్భంలో ‘నేనయ్యా నాజర్‌ను’... నాజర్ ఇంకా జీవించే ఉన్నారా? విస్మయం! మాచర్ల చెన్న కేశుని గుడిలో 1968 ప్రాంతంలో పల్నాటి కథను చెబుతూ వేదికను, ప్రేక్షకుల హృదయాలను ఊపేసిన నాజర్ మనసులో మెదిలారు. ఆ నాజరే. సన్మానం అందుకుంటోన్న ^è క్రవర్తి, పరుగు పరుగున వేదిక దిగారు. బయట ప్రవేశ ద్వారం వరకూ వెళ్లి, కాపలాదారులు అడ్డగించిన నాజర్‌ను గౌరవంగా వేదికపైకి తీసుకు వచ్చారు. తన తండ్రి బసవయ్య కోరిక మేరకు, తనకూ, తన తల్లికి పొన్నెకల్లులో హార్మోనియం నేర్పిన గురువు నాజర్ అని ప్రేక్షకులకు చెప్పారు. గురువుకి శాలువా కప్పారు.
ఆ మరుసటి ఉదయం నాజర్ ఇంటికి వెళ్లాను. తన బతుకు కథను చెప్పమని కోరాను. ‘ఒక పూట తెమిలేదా అబ్బాయి’ అన్నారు. రోజూ వస్తానన్నాను. దాదాపు రెండు వారాలు. రోజూ ఉదయం ఏడు, ఎనిమిది గంటలకు వెళ్లే వాడిని. శ్రీమతి నాజర్ తొలుత సేమ్యా పాయసం, వచ్చేపుడు పెద్ద ‘ఇత్తడి గళాసు’ నిండా మజ్జిగ ఇచ్చేవారు. నాజర్‌కు కళా కారులకు సహజమైన అలవాట్లు లేవు. ఆంధ్రభూమిలో ఆయ నపై ప్రచురితమైన సవివర వ్యాసాలు చదివిన ఎందరో ప్రము ఖులు ఫోన్ చేయడం వలన తెలి సింది, నాజర్ ఇంకా జీవించే ఉన్నారా అనే సందేహం నాకు మాత్రమే కలిగినది కాదని! చదువరులను శ్రీశ్రీ వలె, పామరులను అంతకు మించి ప్రభా వితం చేసిన బుర్రకథా పితామహుడు నాజర్‌ను వామపక్షాలు ఎందుకు విస్మరించాయి? వివిధ సందర్భాలలో ఎందుకు ఆహ్వానించలేదు? అవలోకన చేయవలసిన అంశం.
నాజర్‌కు నాటకాలంటే ఆసక్తి. ఎనిమిదో ఏటనుండే వేషాలు కట్టారు. ‘పగలు రేత్తిరి’ నాట కాల వారి వెంటే. పెద రావూరుకు చెందిన రామక్రిష్ణ శాస్త్రి నెలకు మూడు రూపా యలిచ్చి నాజర్‌కు తెనాలిలో డ్యాన్స్ నేర్పించారు. నరసరావు పేటలోని క్షురకుడు మురుగుల సీతారామయ్య ఖర్చులు ఇప్పించి నాజర్‌కు సంగీతం నేర్పించారు. పేటలో, తాడికొండ బోగం అమ్మాయి పాటలు పాడించుకుని అన్నం పెట్టేది. విద్య నేర్చుకుని నాజర్ పొన్నెకల్లు చేరాడు. ఈ నేపథ్యంలో, 1943లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ తాళ్ళూరులో నిర్వహించిన పాటల పోటీలో నాజర్ ప్రథమ బహుమతి పొందారు. ఆ సందర్భంలో రెంటపాడుకు చెందిన రామకోటి పరిచయమయ్యారు. కథకుడిగా బుర్రకథను చెప్పే రామకోటి, తనకంటే గొప్పగాత్రం ఉందని భావించి, తగిన మెళకువలను నేర్పి నాజర్‌ను కథకుడిగా చేశాడు. నాజర్ కథకుడు. హాస్యగాడు రామకోటి. వంత కర్నాటి.‘నాజర్ దళం’ లక్షలాది సామాన్య జనం కమ్యూనిస్ట్ పార్టీని ఆలింగనం చేసు కునేలా చేసింది. ప్రజానాట్యమండలిలో తొలి తరం కళాకారుడైన నాజర్ స్వయంగా బుర్రకథలను రాసుకునేవారు. పాటలు రాసేవారు. కట్టేవారు. పాడేవారు. ఆ వాగ్గేయుని ప్రభావం గద్దర్, వంగపండు, నేటి గోరటి వెంకన్న వరకూ ప్రసరిస్తోంది.
కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రం నాజర్ ఆత్మఘోష సోక లేదు. ప్రజానాట్య మండలి 1949లో రద్దయింది. పార్టీ కథలు చెప్పుకుని బతకమ న్నది. కొన్నాళ్లకు ఉమ్మడి పార్టీ నాయ కులు పార్టీ వేదిక లపై కథ చెప్పాలన్నారు. బయటవారు నాజర్ కథకు 300 రూపా యలు ఇచ్చే రోజులు. ‘దళం’ రాకపోకల ఖర్చు కోసం పార్టీ నుంచి రూ. 100 తీసుకునేవారు. కథలో భాగంగా çకుల వాస్తవికతలను చెప్పేవారు. అది పెడధోరణిగా భావించి నాజర్ సేవలు అవసరం లేదంది పార్టీ. సీపీఎం సైతం చాలు చాలన్నది. ‘అవును నిజం, నీవన్నది’ అంటూ ఆ తరువాత తరిమెల, దేవులపల్లిలు నాజర్‌ను ఆహ్వానించారు. ధర్మరాజు వంటి వ్యసనపరులు, భీముని వంటి తిండిపోతులు, నకుల సహదేవుల వంటి అర్భకులను, అర్జునుని వంటి వీరులను ఒక్కతాటిపై నడిపి, రాజ్యా ధికారంలోకి తెచ్చేందుకు పార్టీలోని మేధోన్నతులు కృష్ణు్ణనిలా దోహదపడాలన్న నాజర్ వైఖరి ఎం.ఎల్‌లకు నచ్చలేదు. విరసానిక్కూడా. మావో సాక్షిగా చివరి శ్వాస వరకూ నాజర్ మార్క్సిజాన్నే నమ్మారు! నాజర్ ఉదహరించే ఇతిహాసాలను అభ్యుదయవాదులు విస్మరించారు. ఆ ఖాళీలో దేశంలో మతవాదులు చొరబడ్డారు. వామపక్షవాదులు కులభావనను గుర్తించలేదు. ఆ శూన్యంలో అణగారిన కులాల అభ్యున్నతికి పాటుపడతామనే విశ్వాసాన్ని కలిగించిన పార్టీలు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయి. ఆ దిశగా అడుగులు వేయడమూ చూస్తున్నాం. ఏదిఏమైనా, ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా!
పున్నా కృష్ణమూర్తి
(ప్రముఖ బుర్రకథా పితామహుడు షేక్ నాజర్
శత జయంతి సందర్భంగా)
వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ‘ 76809 50863
వినరా... నాజర్ గాథను నేడూ!
Published Fri, Feb 7 2020 4:24 AM | Last Updated on Fri, Feb 7 2020 4:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment