రంగస్థలం కొత్త ఆశను చివురిస్తుందా?
రంగస్థలం ఎందుకు ఆకర్షిస్తుంది? ఏడ్చేందుకు. జ్ఞాపకాలను కలబోసుకునేందుకు. నవ్వేందుకు. శోధించుకునేందుకు. బతుకు బాటపై నిబ్బరంగా నడిచేందుకు. అది మనుషులు చేతనత్వాన్ని పొందే వేదిక. శక్తిని సంతరించుకునే ఆవరణ. వివిధ దేశాల, సమూహాల సాంస్కృతిక సంపదను గుణగానం చేసే వేదిక. మనుషులను విభజించే సరిహద్దులన్నిటినీ లుప్తం చేసే అద్భుతస్థలి!
బ్రెట్ బైలీ, దక్షిణ ఆఫ్రికా నాటక రచయిత, డిజైనర్. ‘థర్డ్‌వరల్డ్ బన్‌ఫైట్’ వ్యవస్థాపక ఆర్టిస్టిక్ డెరైక్టర్. ‘వలస పాలన తర్వాత ప్రపంచం పోకడలు’ అనే అంశం ఆయన అభిమాన విషయం. ‘మనం ఏడాది పొడవునా చేసుకున్న స్వాతంత్య్ర దినోత్సవాల ఆర్భాటాన్ని ఒక ప్రదర్శనతో బ్రెట్ తుస్సుమనిపించారు’ అని యూరోపియన్ దేశాల విమర్శ కులు కొనియాడిన ప్రభావశీలి. ‘మహాభారత్’ ఫేం పీటర్ బ్రూక్ ఆయన అభిమాని. ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ‘యునెస్కో’ ద్వారా ప్రపంచ కళాకారులకు బ్రెట్ బైలీ అందిస్తోన్న సందేశ సారాంశం:
మానవ సమాజం ఉన్నన్నాళ్లూ అభినయించడం ఆపుకోలేని ఉద్వేగంగా ఆవిష్కృతమవుతూనే ఉంటుంది. పల్లెల్లో చెట్ల క్రింద, హైటెక్ స్టేజ్‌పై మహానగరాలలో, బళ్లల్లో, పొలాల్లో, ప్రార్థనాస్థలాల్లో, మురికివాడల్లో, కమ్యూ నిటీ సెంటర్లలో, సెల్లార్లలో ప్రజలు గుమిగూడుతూనే ఉంటారు. మానవ జీవితంలోని సంక్లిష్టతలు, వైవిధ్యాలు, కలవరపరచే, సాంత్వన పరచే అనేక అంశాలు కళారూపా లుగా వ్యక్తమవుతూనే ఉంటాయి. రక్తమాంసాలతో తొణికిస లాడే, శ్వాసించే, సంభాషించే మనిషి ఉన్నన్నాళ్లూ మనిషితో మనిషి సంభాషించే ‘అభినయం’ సజీవంగా ఉంటుంది.
మనుషులు స్టేజ్‌కి ఎందుకు ఆకర్షితులవుతారు? ఏడ్చేం దుకు. జ్ఞాపకాలను కలబోసుకునేందుకు. నవ్వేందుకు. శోధించుకునేందుకు. నేర్చుకునేందుకు. బతుకుబాటపై నిబ్బరంగా నడిచేందుకు. కొత్త ఊహలు అల్లుకునేందుకు. అబ్బురపడే ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో అనాదికాలపు దైవాన్ని అవతరింపజేసేందుకు. మన శ్వాసలన్నీ ఏకం చేసి ఒకే నిశ్వాసంతో భయద-సౌందర్యాలను, కారుణ్యాలను, కర్కశాలను అనుభవంలోకి తెచ్చుకుని నిట్టూర్చేందుకు. అంతేనా? రంగస్థలం ఇంకా ఎందుకు మనుషులను ఆకర్షిస్తుంది? అది, మనుషులు చేతనత్వాన్ని పొందే వేదిక. శక్తిని సంతరించుకునే ఆవరణ. వివిధ దేశాల, సమూహాల సాంస్కృతిక సంపదను గుణగానం చేసే వేదిక. మనుషులను విభజించే సరిహద్దులన్నిటినీ లుప్తం చేసే అద్భుతస్థలి!
కేవలం ఒక వ్యక్తి ద్వారా లేదా కొందరి ద్వారా ప్రదర్శన సాధ్యపడదు. ప్రతి ప్రదర్శన సామూహిక జీవితంలోంచే జన్మిస్తుంది. మన వేర్వేరు సంప్రదాయాల వేష - భాషల్లోంచి వస్తుంది. మన శరీర నిర్మాణాలు, కదలికలు, మన హావభావాలు, భాషలు, పాటలు, రాగాల నుంచి ప్రదర్శన ‘ధ్వనిస్తుంది’! మనలోని శూన్యాన్ని ఆ సౌందర్యం పూరిస్తుంది. ఈ నేపథ్యంలో, ఆధునికులంగా, కళాకారులుగా మన పాత్ర ఏమిటి? మానవ సమాజపు సంవేదనలను భవిష్యత్ సమాజాలకు మిరుమిట్లుగొలిపే ఆసక్తులతో మనం ప్రదర్శించాలి! ఈ క్రమంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం?
మన చుట్టూ కోట్లాది ప్రజ మనుగడ కోసం సతమత మవుతోంది. నియంత్రణ పదఘట్టనలో ప్రజలు నలిగిపోతు న్నారు. పెట్టుబడిదారీతనానికి రాపాడుతున్నారు. జీవితా ల్లోకి రహస్య సంస్థలు ప్రవేశిస్తున్నాయి. మన మాటలను నిషేధిస్తున్నాయి. అడవులు దగ్ధమవుతున్నాయి. జీవ జాతులు అంతరిస్తున్నాయి. సముద్రాలు విషతుల్యమవుతు న్నాయి. మనం ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి!
అంతులేని అధికారాలను కలిగి ఉన్న ప్రభుత్వాలు, సంస్థలు మనలను ఒకే తరహా అభిప్రాయాన్ని కలిగి ఉండమంటున్నాయి. ఒకే జాతి, ఒకే రంగు, ఒకే మతం, ఒకే లింగాధిక్యత, ఒకే సిద్ధాంతం, ఒకే ఫ్రేమ్‌లో సాంస్కృతిక చిత్తరువు ఉండాలని నిర్దేశిస్తున్నాయి. ఈ వాతావరణంలో కళ స్వేచ్ఛగా వ్యక్తం కాగలదా? మార్కెట్ శక్తుల ‘సంబద్ధ’ ఆకాంక్షలకు లోనై మన శక్తి యుక్తులను క్షీణింపజేసు కుంటూ, వివిధ వేదికల నుంచి వచ్చిన కళాకారులం మనం ఏమి చేయాలి? మన చుట్టూ సమూహాలు చేరుతున్నాయి. ‘ఉందిలే మంచి కాలం ముందుముందునా’ అని వారిలో విశ్వాసం నింపేందుకు ఏమి చేయాలి? ఒక కొత్త ఆశ చివురించేందుకు మనం ఏమి చేయాలి?
పున్నా కృష్ణమూర్తి