సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ పరిధితోపాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయా పనుల పురోగతి, ఇతర అంశాలపై మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక వైపు వైద్యం, మరోవైపు వైద్యవిద్యను విస్తృతం చేస్తున్నట్లు చెప్పా రు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే మెడికల్ హబ్ గా మారుతుందన్నారు. ఇందులో అత్యా ధునిక వైద్య పరికరాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు. అత్యాధునిక మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు.
ఒక్కొక్కటి వెయ్యి పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని, 8 బోధనాస్పత్రుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం కానున్న 9 వైద్య కాలేజీల డిజైన్లు రూపొందించాలని చెప్పారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఆర్‌అండ్‌బీ అధికారులు పనులు వేగవంతం చేయా లని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, అరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సీఈ రాజేందర్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొత్త ఈహెచ్‌ఎస్ విధానం వేగవంతం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు రహిత ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)పై ఉద్యోగులు, టీచర్ల సంఘాల ప్రతినిధులతో చర్చించి, పది రోజుల్లో నివేదిక రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆరోగ్యశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో జరిగిన సమీక్షలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని హరీశ్ రావు ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షిని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా కృషి చేయాలని, అందుతున్న సేవల గురించి స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. వారానికి మూడు ఆసుపత్రులు సందర్శించాలని ఆదేశించారు. కాగా ఆరు వైద్య కళాశాలలకు అనుమతులు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment