దసరా నాటికి వరంగల్‌ హెల్త్‌సిటీ పూర్తి! | Harish Rao: Super Speciality Hospital Likely To Ready By Dasara | Sakshi
Sakshi News home page

దసరా నాటికి వరంగల్‌ హెల్త్‌సిటీ పూర్తి!

Published Sun, Jan 29 2023 4:06 AM | Last Updated on Sun, Jan 29 2023 2:58 PM

Harish Rao: Super Speciality Hospital Likely To Ready By Dasara - Sakshi

ప్లాస్టింగ్‌ యంత్రం పనితీరును పరిశీలిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సాక్షి, వరంగల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని శరవేగంగా నిర్మిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. ఇది వరంగల్‌ నగరానికే కాకుండా.. ఉత్తర తెలంగాణలో రోగుల అవసరాలు తీర్చేలా, దేశానికే ఒక మోడల్‌లా నిలిచేలా ఉంటుందని తెలిపారు. పేదలకు కార్పొరేట్‌ వసతులు అందుబాటులోకి వస్తాయ న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. వరంగల్‌లో రూ.1,100 కోట్ల అంచనాతో చేపట్టిన 24 అంతస్తుల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ పనులను మంత్రి హరీశ్‌రావు శనివారం పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినంత వేగంగా వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణం పూర్తి చేస్తాం. దీనిపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఈ ఏడాది దసరా నాటికి అందుబాటులోకి తీసుకొ చ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాల మాదిరిగానే గ్రామాల్లోనూ పల్లె దవాఖానాల సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. మేం తీసుకున్న చర్యలతో ప్రజలు సర్కారీ దవాఖానాలవైపు చూస్తున్నారు. ఆస్పత్రుల్లో వసతుల కల్పన, కేసీఆర్‌ కిట్, న్యూట్రిషన్‌ కిట్‌ వంటివే దీనికి కారణం’’ అని హరీశ్‌రావు చెప్పారు. 

అవయవ మార్పిడి చికిత్సలు కూడా..
వరంగల్‌ ఆస్పత్రిలో 35 స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకొచ్చేలా నిర్మాణం జరుగుతోందని.. కిడ్నీ, లివర్‌ అవయవ మార్పిడి కూడా వరంగల్‌లో జరగనుందని హరీశ్‌రావు ప్రకటించారు. కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్‌ మార్పిడి కోసం అదునాతన పరికరాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు చాలావరకు జరిగాయని.. సీఎంతో మాట్లాడిన తర్వాత చిన్నపాటి మార్పుల వల్ల ఏరియా పెరిగిందని వివరించారు.

2 వేల పడకలను 2,250 పడకలకు పెంచామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ కలెక్టర్‌ గోపి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజమైన హిందూత్వవాది సీఎం కేసీఆర్‌: హరీశ్‌రావు
పర్వతగిరి: సీఎం కేసీఆర్‌ నిజమైన హిందూత్వవాది అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని శివాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియా తో మాట్లాడారు. అణువణువునా హిందూత్వం నాటుకుపోయిన వ్యక్తి తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి క్షేత్రాన్ని వేలకోట్లతో అధునాతన హంగులతో నిర్మించారని చెప్పా రు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement