సాక్షి, వరంగల్: తెలంగాణలోని మెడికల్ కాలేజీల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన ఎయిమ్స్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని మండిపడ్డారు. వైద్యరంగంలో ప్రొఫెసర్‌ల వయస్సు, వీసీల బిల్లులు గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. గవర్నర్ నిర్ణయంతో జూనియర్ వద్ద సీనియర్ లు పనిచేసే దుస్థితి ఏర్పడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. 60 ఏళ్లలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవని.. 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వ ప్రైవేటులో కలిసి 20 మెడికల్ కాలేజీలు ఉండేవన్నారు. 9 ఏళ్లలో మెడికల్ కాలేజీల సంఖ్య 50కి చేరిందన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి మెడికల్ కాలేజీలలో 2950 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని. ఇప్పుడు తెలంగాణలో 8340 సీట్లు పెరిగాయని తెలిపారు.
వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీతో పాటు హన్మకొండ ప్రసూతి ఆసుపత్రిలో రెడియాలజీ ల్యాబ్, కేఎంసీలో అకాడమిక్ బ్లాక్‌ను ప్రారంభించారు. జనగామ భూపాలపల్లి, మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామన్నారు. రూ.1100 కోట్లతో 24 అంతస్థులతో 2,100 పడకలతో నిర్మించే హెల్త్ సిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి పనుల ప్రగతిని పర్యవేక్షించారు. 68 శాతం పనులు పూరైనా హెల్త్ సిటీ పనులు వెయ్యి మంది కార్మికులతో ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.
చదవండి: పోచారంకు సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారా? అందుకే నిర్ణయం మార్చుకున్నారా?
ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి చేసి జనవరిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారని, దసరా వరకు 10 ఫ్లోర్‌లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని చూస్తున్నామని చెప్పారు. ఆసుపత్రిలో 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. వచ్చే సంవత్సరం ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో ఉన్న ములుగులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం దేశంలో ఎక్కడ లేదన్నారు. 70 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులకు బుర్ర పని చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్‌లు జరిగేవని, కేసీఆర్ పాలనలో సీన్ రివర్స్ అయిందని తెలిపారు. పని చేయకపోగా చేసే వారిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వడి. కానీ విమర్శించడం సమంజసం కాదని హరీష్ రావు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment