
సాక్షి, హైదరాబాద్: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హనుమకొండలో జరిగిన బహిరంగ సభలో నడ్డా చేసిన వ్యాఖ్యలను హరీశ్ ఖండించారు. ‘చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 24 అంతస్తుల్లో 2,000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,100 కోట్లు మంజూరు చేసింది. వెనువెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, శరవేగంగా పనులు ప్రారంభించింది.
మూడు నెలల్లోనే 15 శాతం పనులు పూర్తయ్యాయి. కళ్లుండీ చూడలేని వారికి ఈ అభివృద్ధి కనిపించదు. నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసే వారికి ఈ హాస్పిటల్ వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం కావు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరంగల్‌లో నిర్మాణంలో ఉన్నది ఆస్పత్రి మాత్రమే కాదు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే నిర్మితమవుతున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ. ఇది పూర్తయితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందటంతో పాటు వైద్య విద్య, పరిశోధనలకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుంది’ అని హరీశ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment