సాక్షి, వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ హయాంలో తలపెట్టిన ఆసుపత్రుల నిర్మాణాలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అన్నీ డిపార్ట్‌మెంట్సలో పేదలకు అందుబాటులో ఉండాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాం. గతంలో నేను వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. భవన నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. ఒక కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా 2000 పడకల ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు.
ఈ ఆసుపత్రి నిర్మాణం.. 2024 జూన్ వరకు రెడీ కావాలని ప్రతిపాదనలు చేశాం. ఇప్పుడూ ఎలా ఉందో చూస్తున్నాం. పేదలకు సరైన వైద్యం అందడం లేదు. వరంగల్ జిల్లాలో హైటెక్ టవర్‌లో వైద్య సేవలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం. 14వ ఫ్లోర్‌లో హాస్పిటల్, 10 ఫ్లోర్‌లో అడ్మినిస్ట్రేషన్ ఉండేలా ప్లాన్ చేశాం. మన ఆసుపత్రి ఎత్తు 91 మీటర్లు. ఇక్కడ గుండె, కిడ్నీ, లివర్, క్యాన్సర్‌కు అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించాలనుకున్నాం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం ఓపిక పట్టాం. ఎలాంటి అభివృద్ధి లేదు. వెంటనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి.
తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న పథకాలను నిలిపేశారు. కొత్త పథకాలు ఇవ్వడం లేదు. ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అంటూ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment