విశాఖలోని జిమ్స్ ఆస్పత్రి
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని గొలగాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో అక్రమాల బాగోతం బట్టబయలైంది. కరోనా రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హెల్త్‌సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ముగ్గురు సభ్యులతో కూడిన ‘డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లైయింగ్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశారు. జిమ్స్‌లో ‘కుమార్స్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. నేరుగా పలువురు కోవిడ్ పేషెంట్ల కుటుంబసభ్యులను సంప్రదించి వివరాలు సేకరించింది.
వారిలో ఓ రోగి నుంచి సుమారు రూ.7 లక్షలు వసూలు చేసి, రూ.1.20 లక్షలకు మాత్రమే బిల్లు ఇచ్చినట్లుగా గుర్తించారు. డబ్బులు లేకపోవడంతో రూ.3 లక్షలకు షూరిటీగా చెక్కు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారని మరో కుటుంబం ఆధారాలతో సహా వివరించింది. ఆ ఆధారాలతో ఈ నెల 6, 7 తేదీలలో జిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రికార్డులు, బిల్లులు పరిశీలించారు. ఈ పరిశీలనలో బాధితులు చెప్పినవన్నీ నిజమేనని తేలింది. అంతేకాకుండా రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలన్నింటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్’ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఇమాన్యుయేల్‌రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా, హెల్త్‌సిటీలో చాలా ఆస్పత్రుల్లో ఇదే విధంగా దోపిడీ సాగుతోందని, వాటిపై కూడా కలెక్టర్ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment