రాజధానిలో తొమ్మిది ప్రత్యేక నగరాలు
‘మాస్టర్‌ప్లాన్’లో ఇవే అమరావతికి ఆకర్షణలు
సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో వివిధ రంగాలకు సంబంధించి తొమ్మిది ప్రత్యేక (థీమ్ సిటీలు) నగరాలను ప్రతిపాదించారు. దేనికదే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న వీటిని అమరావతికే ఆకర్షణ అని చెబుతున్నారు.
గవర్నమెంట్ సిటీ
564 హెక్టార్లలో నిర్మించే ప్రభుత్వ నగరంలో రెండు టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్, విభాగాధిపతుల కార్యాలయాలను ఈ నగరంలో నిర్మిస్తారు. అసెంబ్లీ భవనాన్ని అత్యద్భుత రీతిలో నిర్మించి పర్యాటకులను ఆకర్షించాలని ప్రతిపాదించారు.
జస్టిస్ సిటీ
ప్రభుత్వ నగరానికి దక్షిణం వైపున జస్టిస్ సిటీని నిర్మించనున్నారు. కోర్టులు, వాటి అనుబంధ సౌకర్యాలతో 566 హెక్టార్లలో ఈ నగరాన్ని ఏర్పాటు చేస్తారు.
ఫైనాన్స్ సిటీ
వాటర్‌ఫ్రంట్‌కు ఎదురుగా ఆర్థిక కార్యకలాల కేంద్రమైన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను ఫైనాన్స్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తారు. 566 హెక్టార్లలో నిర్మితమయ్యే ఈ నగరంలో వాణిజ్య భవనాలు, బహుళ ప్రయోజన అభివృద్ధి కార్యకలాపాల కేంద్రాలుంటాయి. రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి చేరుకునేందుకు అనువుగా రెండు ఎంఆర్‌టీ (మెట్రో) లైన్లు ప్రతిపాదించారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజా, రిక్రియేషనల్ ఐల్యాండ్ నగరంలో ప్రత్యేక ఆకర్షణలుగా తీర్చిదిద్దనున్నారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజాలో రెండు ఐకానిక్ టవర్లుంటాయి.
నాలెడ్జ్ సిటీ
జస్టిస్, ఆర్థిక నగరాలకు దక్షిణం వైపు విద్య, విజ్ఞాన నగరాన్ని ప్రతిపాదించారు. నాలెడ్జ్ పార్కు, హౌసింగ్ యూనివర్సిటీ క్యాంపస్, పలు కళాశాలలతో 1,445 హెక్టార్లలో ఈ నగరం ఏర్పాటవుతుంది. 2050 నాటికి ఈ నగరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనతోపాటు 5,73,575 మంది నివాసం ఉండేలా తీర్చిదిద్దాలనేది లక్ష్యం.
ఎలక్ట్రానిక్స్ సిటీ
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఈ నగరంలో నెలకొల్పాలని లక్ష్యం. 731 హెక్టార్లలో నిర్మించే ఈ నగరంలో 2,73,500 నైపుణ్య ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు.
హెల్త్ సిటీ
1,349 హెక్టార్లలో నిర్మించే హెల్త్ సిటీలో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యం.
స్పోర్ట్స్ సిటీ
క్రీడా నగరంలో భారీ స్టేడియాలు, ఈవెంట్ కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రాలను నెలకొల్పుతారు. 650 హెక్టార్లలో ఈ నగరాన్ని నిర్మిస్తారు.
మీడియా సిటీ
అనంతవరం సమీపంలో మీడియా, కల్చరల్ నగరాన్ని 677 హెక్టార్లలో నిర్మించనున్నారు. సాంస్కృతిక, కళా కేంద్రాలు ఏర్పాటు చేసి 1.5 లక్షల మందికి వాటిల్లో ఉద్యోగాలు కల్పించాలని పేర్కొన్నారు.
టూరిజం సిటీ
ఉండవల్లి గుహల మీదుగా కృష్ణానదికి అభిముఖంగా 531 హెక్టార్లలో పర్యాటక నగరాన్ని నిర్మిస్తారు. వాటర్ టూరిజం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు.