భారీ వర్షానికి ముగ్గురి దుర్మరణం | heavy rains in kurnool | Sakshi
Sakshi News home page

భారీ వర్షానికి ముగ్గురి దుర్మరణం

Published Wed, Jun 4 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

heavy rains in kurnool

గోకులపాడు(కల్లూరు), న్యూస్‌లైన్: సమయానికి పరీక్షకు హాజరుకావాలన్న ఆతృత ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు విద్యార్థిని తండ్రిని బలిగొంది. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన వక్కెర వాగు వీరిని కబళించింది. ఈ ఘటన కల్లూరు మండలంలోని గోకులపాడు గ్రామంలో విషాదం నింపింది.

వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన కురువ సుశీల(17), హరిజన కళావతి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫెయిలయ్యారు. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు కర్నూలుకు ప్రయాణమయ్యారు. గ్రామ శివారులోని వక్కెర వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సుశీల తండ్రి  నారాయణ(55) వీరి వెంట వెళ్లారు. వీరు వాగు వద్దకు చేరుకునే సరికి అదే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు అదుపుతప్పి వాగులో పడిపోయారు. తల్లీకూతుళ్లు రాములమ్మ, సునీత సమీపంలోని పెంచికలపాడులో ఉన్న కేన్సర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు.. లక్ష్మీదేవి అనే మహిళ కర్నూలులోని రైస్ మిల్లులో పనిచేసేందుకు వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.

 అదే సమయంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఇస్మాయిల్, ఎర్రన్న వీరిని ఒడ్డుకు చేర్చడంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే పరీక్షకు ఆలస్యమవుతుందన్న తొందరలో విద్యార్థులతో పాటు వాగు దాటించేందుకు వచ్చిన తండ్రి నీటిలో కొట్టుకుపోయారు. వీరి వెనకాలే వస్తున్న నారాయణ అల్లుడు రామాంజనేయులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత గ్రామానికి చెందిన యువకులు మూడు బృందాలుగా గాలింపు చేపట్టారు. సల్కాపురం రహదారి వద్ద ముళ్లపొదల్లో నారాయణ మృతదేహం.. మరికొంత దూరంలో కళావతి, సుశీల మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకొచ్చారు.

అక్కడి నుంచి ముగ్గురి మృతదేహాలను గోకులపాడు శ్మశాన వాటికకు తరలించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గ్రామస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు చేపట్టారు. ఇదిలా ఉండగా మృతుడు కురువ నారాయణ, కాశమ్మ దంపతులకు ఐదుగురు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం. నలుగురు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయగా.. కుమార్తె సుశీలతో పాటు ఇరువురు కుమారులను కూలి పనులు చేస్తూ చదివిస్తున్నారు. హరిజన బజారి, నాగశేషమ్మ దంపతుల సంతానమైన కళావతి, సుశీల ఇద్దరూ ప్రాణ స్నేహితులు. గ్రామంలో ఇరువురూ కలసి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత కర్నూలులోని కేవీఆర్ కళాశాలలో సుశీల హెచ్‌ఈసీ గ్రూపు, కళావతి బైపీసీ గ్రూపులో చేరారు. ఇటీవల విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలవడంతో ఇద్దరూ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో వాగు దాటుతూ మృత్యువాత పడటం గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement