నిధులున్నా వినియోగించరా? | State fails to timely implement projects | Sakshi
Sakshi News home page

నిధులున్నా వినియోగించరా?

Published Tue, Jan 29 2019 4:01 AM | Last Updated on Tue, Jan 29 2019 4:01 AM

State fails to timely implement projects - Sakshi

సాక్షి, అమరావతి : కేంద్రం నుంచి వచ్చిన నిధులను సకాలంలో వినియోగించి పనులు పూర్తిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఖజానాలో రూ.వందల కోట్ల నిధులున్నా వాటి వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు వినియోగించుకోవడం, ఖర్చు చేసిన నిధులకు వినియోగ పత్రాలు (యూసీలు) సమర్పించడంతో అదనపు నిధులను తెచ్చుకోగలిగాయి. కానీ, మన రాష్ట్రంలో అలా జరగకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఎంబీబీఎస్‌ సీట్ల పెంపు నుంచి పీజీ వైద్య సీట్ల పెంపు వరకూ, క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం నుంచి సూపర్‌ స్పెషాలిటీ బ్లాకుల వరకూ అంతటా సగం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర వ్యవహార శైలిపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇచ్చిన నిధులను వినియోగించుకోలేకపోయారని, వాటికి లెక్కలు కూడా చెప్పడంలేదని కేంద్రం ఆరోపిస్తోంది. యూసీలు ఇవ్వాలని పలుమార్లు కోరినా రాష్ట్రం స్పందించలేదని కేంద్ర అధికారులు చెప్పారు.

నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి రూ.551 కోట్లు
గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు రూ.867 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.551.80 కోట్లు ఇచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిలో కేవలం రూ.41.05 కోట్లకు మాత్రమే యూసీలు ఇచ్చింది. అంతేకాక, ఇంకా రూ.239కోట్లకు పైగా నిధులు వ్యయం చేయాల్సింది ఉంది. అలాగే,  ఇచ్చిన నిధులను వినియోగించుకోలేకపోవడం, వినియోగించిన నిధులకు లెక్కలు చెప్పకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోలేకపోయారు. ఉదాహరణకు.. అనంతపురం, విజయవాడలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఒక్కో ఆస్పత్రికి రూ.150 కోట్లు ఇస్తే వాటికి అస్సలు లెక్కలు చెప్పనేలేదు. పైగా రాష్ట్ర సర్కారు ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వలేదు. దీంతో నిర్మాణాలు పూర్తికావచ్చినా అవి ప్రారంభానికి నోచుకోలేదు. ఇలా ఎన్నో పథకాలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. పీజీ వైద్య సీట్లు, యూజీ వైద్య సీట్ల పెంపునకు సైతం సరైన మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో సీట్లు పెరగలేదు.

నాలుగున్నరేళ్లలో పునాది కూడా వెయ్యలేదు
రాష్ట్రం విడిపోయాక ఉన్న ఒక్క క్యాన్సర్‌ ఆస్పత్రి తెలంగాణకు పోయింది. దీంతో రాష్ట్రంలో స్టేట్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం కర్నూలులో స్టేట్‌ క్యాన్సర్‌ సెంటర్‌ను ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ఆస్పత్రి ప్రాజెక్టు వ్యయం రూ.120 కోట్లు. ఇందులో 60% కేంద్రం వాటా కాగా, 40% రాష్ట్ర వాటా. కానీ, నాలుగున్నరేళ్లుగా దీనికి పునాది రాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యలేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవల వేశారు. అసలే రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ కేంద్రాన్ని సకాలంలో నిర్మించలేకపోయారని విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement