పోలీసులను ఆశ్రయించిన ‘బసవ తారకం’ క్యాన్సర్ ఆస్పత్రి పరిశోధకులు
హైదరాబాద్: గుర్తు తెలియని పదార్థాన్ని పాలల్లో కలిపి ఇచ్చి తమపై హత్యాయత్నాని కి పాల్పడ్డారంటూ హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పరిశోధకులు శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి ఆర్ అండ్ డీ హెడ్ డాక్టర్ వీవీటీఎస్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. గత ఆరేళ్ల నుంచి తనతోపాటు కపిల్ షా, సతీశ్, సరిత, సౌమ్య, సారిక, శ్రీవాణి తదితర రీసెర్చ్ స్కాలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు.
ఈ నెల 3న ఆస్పత్రి ఉద్యోగి తమకు ఇచ్చిన పాలు ఉప్పగా, తేడాగా ఉన్నాయని, తాగిన తర్వాత కొన్ని సందేహాలు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై అదేరోజు ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఆర్ అండ్ డీ నిధులను ఆస్పత్రి నిర్వహణకు మళ్లించడం వల్ల రెండు నెలల నుంచి ఆర్‌అండ్ డీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల రీసెర్చ్ స్కాలర్లు ఆందోళనకు గురవుతున్నా రని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బసవతారకం ఆస్పత్రిలో కలకలం రేపింది.
హత్యాయత్నానికి పాల్పడ్డారు...!
Published Sun, Jan 29 2017 2:53 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
Advertisement