Basava Tarakam Indo American Cancer Hospital
-
‘బసవ తారకం’ ట్రస్టీ తులసీదేవి కన్నుమూత
హైదరాబాద్/తెనాలి రూరల్: బంజారాహిల్స్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి స్థాపనలో కీలకపాత్ర పోషించి.. వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న డాక్టర్ పోలవరపు తులసీదేవి (80) శనివారం గుండెపోటుతో న్యూయార్క్‌లోని తన నివాసంలో మరణించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన తులసీదేవి న్యూయార్క్ నగరంలో గైనకాలజిస్టుగా స్థిరపడ్డారు. ఆమె భర్త డాక్టర్ రాఘవరావు ఆర్థోపెడిక్ సర్జన్. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పేద రోగులకు అందుబాటు ధరల్లో చికిత్స అందించే ప్రపంచ శ్రేణి క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఎన్టీ రామారావు సంకల్పించగా.. అమెరికాలో ఇండో–అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అమెరికాలో ఉన్న సుప్రసిద్ధ వైద్యులు, ఇతర తెలుగు వారిని ఏకం చేసి సంస్థ స్థాపనకు అవసరమైన నిధులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందించడంలో తులసీదేవి ఎంతో కృషి చేశారు. తన స్వగ్రామమైన కంఠంరాజు కొండూరులో తండ్రి కారుమంచి గోవిందయ్య పేరిట ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. అమెరికాలో వైద్యపరమైన లాంఛనాలు పూర్తి కాగానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రానున్నట్టు డాక్టర్ కె.తుకారాం ప్రసాద్ తెలిపారు. కాగా, క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు, నిర్వహణలో కీలక భూమిక పోషించిన తులసీదేవి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆస్పత్రి చైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. -
నాకు వయసు తగ్గుతోంది : బాలయ్య
సాక్షి, హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ నేడు తన జన్మదిన వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రిలో పిల్లల మద్య జరిపారు. ఆయన తన 59వ పుట్టినరోజును క్యాన్సర్ బారిన పడిన పిల్లలు, ఆసుపత్రి బృందం మధ్య కేక్‌ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తనకు అందరూ విష్ చేస్తున్నారని.. ‘అందరికీ వయసు పెరుగుతందని, కానీ తనకు తగ్గుతోందని చెప్పా’ అని అన్నారు. తనను ఆరకంగా విష్ చేయండని కోరారు. ఇక బాలయ్య తనదైన శైలిలో పద్యాలు చెబుతూ, మధ్యమధ్యలో తడబడుతూ అలా ప్రసంగించుకుంటూ వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలయ్య తన 105వ సినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయనున్నారు. -
‘బసవతారకం’లో వినూత్న కార్యక్రమం
బంజారాహిల్స్ : కేన్సర్‌తో స్వరపేటిక తొలగించిన రోగులు జాతీయ గీతాన్ని ఆలపించి కోల్పోయిన గొంతును తిరిగి సాధించవచ్చనే విశ్వాసాన్ని పొందారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వరపేటిక తొలగించడంతో కృత్రిమ వాయిస్ బాక్స్ అమర్చిన రోగులు తాము మాట్లాడుతున్నామన్న విషయాన్ని నలుగురికీ తెలియజేసేందుకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటి దాకా సుమారు 200 మందికి రోగంతో స్వరపేటిక తొలగించి దాని స్థానంలో ‘టీఈపీ’ మిషన్లను అమర్చారు. ఈ సందర్భంగా ఆంకాలజీ సర్జన్స్, ఫిజీషియన్స్, స్పీచ్ థెరపిస్టులు ఆధ్వర్యంలో కొందరు గీతాన్ని ఆలపించారు. ఆంకాలజీ విభాగం హెడ్ అండ్ నెక్ సర్జరీ వైద్యులు చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వరపేటికను తొలగించిన వారు మాట్లాడే శక్తిని కోల్పోయి దివ్యాంగులుగా జీవితం గడపాల్సి వచ్చేదని, ఇటీవల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సా విధానాలతో వారికి ఊరట లభిస్తోందన్నారు. స్వరపేటిక లేనివారు పాడడం కష్టమైనా వారిలో ధైర్యం నింపేందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారిగా ఇక్కడ నిర్వహించామని తెలిపారు. -
హత్యాయత్నానికి పాల్పడ్డారు...!
పోలీసులను ఆశ్రయించిన ‘బసవ తారకం’ క్యాన్సర్ ఆస్పత్రి పరిశోధకులు హైదరాబాద్: గుర్తు తెలియని పదార్థాన్ని పాలల్లో కలిపి ఇచ్చి తమపై హత్యాయత్నాని కి పాల్పడ్డారంటూ హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధకులు శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి ఆర్ అండ్ డీ హెడ్ డాక్టర్ వీవీటీఎస్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. గత ఆరేళ్ల నుంచి తనతోపాటు కపిల్ షా, సతీశ్, సరిత, సౌమ్య, సారిక, శ్రీవాణి తదితర రీసెర్చ్ స్కాలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 3న ఆస్పత్రి ఉద్యోగి తమకు ఇచ్చిన పాలు ఉప్పగా, తేడాగా ఉన్నాయని, తాగిన తర్వాత కొన్ని సందేహాలు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై అదేరోజు ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఆర్ అండ్ డీ నిధులను ఆస్పత్రి నిర్వహణకు మళ్లించడం వల్ల రెండు నెలల నుంచి ఆర్అండ్ డీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల రీసెర్చ్ స్కాలర్లు ఆందోళనకు గురవుతున్నా రని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బసవతారకం ఆస్పత్రిలో కలకలం రేపింది.