కేన్సర్ చికిత్సకు త్వరలో ‘రోబో’
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రోబో మెషీన్‌ను మంజూరు చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ శస్త్రచికిత్సల కోసం త్వరలోనే హైదరాబాద్‌కు రోబో రాబోతోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రితోపాటు తమిళనాడులోని అడయార్ ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రికి, బెంగళూరులోని కిద్వాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి కూడా కేంద్ర ప్రభుత్వం రోబోలను మంజూరు చేసింది. ఈ రోబో విలువ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఎంఎన్‌జేకు మంజూరైన కేన్సర్ రోబో మెషీన్ అత్యంత ఆధునిక వైద్య సేవలకు ఉపయోగించేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం కేన్సర్ చికిత్సలో అత్యాధునిక సేవలంటే ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సలే. చిన్నగాటు వేసి నొప్పిలేకుండా చేస్తున్న వాటినే ల్యాప్రోస్కోపీ చికిత్సలంటారు. దీనికి మించి మెరుగైన సేవలను రోబో అందిస్తుంది. దీనిపై ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి డెరైక్టర్ డా.జయలత స్పందిస్తూ.. రోబో మెషీన్ మంజూరైన విషయం వాస్తవమని, ఇది ఆస్పత్రికి వచ్చేందుకు ఏడాది సమయం పట్టే అవకాశముందన్నారు. దీనివల్ల కేన్సర్ రోగులకు అద్భుతమైన సేవలు అందుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేన్సర్ ఆస్పత్రులే లేకపోవడం వల్ల ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎలాంటి మేలు జరగలేదు. కాగా ఏపీనుంచి కూడా పేద రోగులు ఇప్పటికీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికే వస్తున్నారు.
రోబోతో మెరుగైన సేవలు
► మంజూరైన 3 రోబో మెషీన్లు అత్యాధునికమైనవి.
► ల్యాప్రోస్కోపీ కంటే చిన్నగాటుతో శస్త్రచికిత్సలు చేయడం రోబో వల్ల సాధ్యమవుతుంది
► ఒక్కరోజులో రోగి కోలుకునే అవకాశం ఉంటుంది
► రోబో మెషీన్ ప్రొస్టేట్ కేన్సర్ శస్త్రచికిత్సలకు బాగా ఉపయోగపడుతుంది
► రోబో సర్జరీలో కడుపులోకి చొప్పించే పరికరంలో అత్యంత ఆధునిక కెమెరా ఉంటుంది. దీనికి 3 వైపుల నుంచి టిష్యూస్‌ను గుర్తించే సామర్థ్యం ఉంటుంది.
► దీనివల్ల అతిపెద్ద కణితుల నుంచి, అతి సూక్ష్మమైన వాటిని తొలగించడం సాధ్యమవుతుంది
► రక్తస్రావం తగ్గిపోవడం, ఆస్పత్రిలో ఉండాల్సిన రోజులు తగ్గడం, చిన్నగాటు, త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది
► రోబోటిక్ సర్జరీకి ఒక్కో రోగికి రూ.70 వేల విలువైన డిస్పోజబుల్స్ వాడాల్సి ఉంటుంది