Cancer surgery
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించేది మరో రెండేళ్లే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్(69) ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్ నిఘా విభాగం అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ వెల్లడించారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన మిలటరీ అధికారులతో తరచుగా సమావేశమవుతున్నారు. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. రష్యా విడుదల చేస్తున్న చిత్రాల్లో పుతిన్ అస్వస్థతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరో కార్యక్రమంలో నీరసంగా వెనుకా ముందు ఊగుతూ దర్శనమిచ్చారు. బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడు. గతంలో క్యాన్సర్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
ఆరోగ్యశ్రీ ద్వారా అరుదైన క్యాన్సర్ నుంచి విముక్తి
గుంటూరు (మెడికల్): రెండోసారి క్యాన్సర్ బారినపడిన యువకుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యాధి నుంచి విముక్తి కల్పించారు గుంటూరు వైద్యులు. రూ.3 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో అందించారు. మంగళవారం గుంటూరు ఒమెగా హాస్పిటల్లో సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంజీ నాగకిషోర్ ఈ వివరాలు వెల్లడించారు. స్థానిక మంగళదాస్ నగర్‌కు చెందిన మొహమ్మద్ నజీర్ అనే 18 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల క్రితం ఛాతి పక్కటెముకలకు ‘ఈవింగ్స్ సర్కోమా’ అనే క్యాన్సర్ సోకింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో సుమారు రూ.6 లక్షలు వెచ్చించి సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవల ఆ యువకుడికి ట్యూమర్ ఏర్పడి క్యాన్సర్ తిరగబెట్టింది. యువకుడి తండ్రి మొహమ్మద్ బాజీ గుంటూరు ఒమెగా ఆస్పత్రికి అతడిని తీసుకెళ్లగా.. పరీక్షలు చేసి ఛాతి నుంచి గుండెకు వెళ్లే మార్గంలో భారీ గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మూడు నెలలపాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ స్నేహ కీమోథెరఫీ చేసినప్పటికీ గడ్డ కొద్దిగా మాత్రమే తగ్గింది. ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూమర్‌ను (గడ్డను) వెంటనే తొలగించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని నిర్ధారించి ఈ నెల 17న నాలుగున్నర గంటల సేపు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. డాక్టర్ నాగకిషోర్ నేతృత్వంలో కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మారుతి ప్రసాద్, డాక్టర్ సుమన్, మత్తు డాక్టర్ శౌరయ్య, డాక్టర్ విద్యాసాగర్ ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నిరకాల క్యాన్సర్లకు ఉచితంగా చికిత్స అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారన్నారు. దీంతో ఆ యువకుడికి చికిత్సను పూర్తి ఉచితంగా చేశామని డాక్టర్ నాగకిషోర్ తెలిపారు. -
పొట్ట తీసేసేముందు ఒక్కసారి బిర్యానీ తింటా!!
గులామ్ అబ్బాస్.. దుబాయ్ ఓ ఇంజనీర్. ఈ వ్యక్తికి అకస్మాత్తుగా వాంతులు, భారీగా బరువు తగ్గిపోవడం జరిగింది. అసలేమైందో తెలియదు. కానీ అకస్మాత్తుగా తన శరీరంలో సంభవించిన ఈ మార్పులతో అబ్బాస్ ఒక్కసారిగా షాకైపోయాడు. వెంటనే డాక్టర్లను ఆశ్రయించాడు. డాక్టర్లు చెప్పిన విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. మూడు స్టేజ్ క్యాన్సర్ తన కడుపునంతా పాకేసిందని, ఇక బతకడం కష్టమని చెప్పారు. బతకాలంటే, తప్పనిసరి పరిస్థితుల్లో పొట్టను తీసేయాల్సిందేనని డాక్టర్లు సూచించారు. పొట్ట లేకుండా మనుగడ సాధించడం లేదా చనిపోవడం ఈ రెండే మార్గాలని డాక్టర్లు చెప్పారు. అయితే తన పిల్లలు తాను లేకుండా బతకాలని కోరుకోవడం లేదని, వారి లక్ష్యాలను తాను కళ్లారా చూడాలని కోరిక ఉందని, ఎలాగైనా తను బతకాలని అబ్బాస్ డాక్టర్లకు చెప్పాడు. అబ్బాస్ కోరిక మేరకు క్యాన్సర్ ప్రభావితమైన పొట్టను తొలగించడానికే డాక్టర్లు మొగ్గుచూపారు. అయితే సర్జరీ చేసే ముందు తన చిన్న కోరిక తీర్చాలని డాక్టర్లను వేడుకున్నాడు. అదేమిటంటే.. ఇక జన్మలో తనకు ఇష్టమైన తన భార్య చేసిన బిర్యానీ తినడం కుదరదు కాబట్టి, సర్జరీ చేసి పొట్టను తొలగించే ముందే ఒక్కసారి బిర్యానీ తినాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అబ్బాస్ కోరికను డాక్టర్లు కూడా నెరవేర్చారు. కడుపు క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ సంబంధిత మరణాల్లో ఒకటిగా ఉంది. ఇలాంటి కేసులు ఈమధ్యన నమోదవుతూనే ఉన్నాయి. యువతకు ఈ క్యాన్సర్ ఎక్కువగా విస్తరిస్తుందని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున ఒకే ఒక్క ప్రశ్న.... పొట్ట లేకుండా అబ్బాస్ ఎలా బతకగలడు అని. అయితే పొట్ట లేకుండా బతకడమంటే.. అసలు తినకపోవడం కాదని, స్పైసీగా లేని, తక్కువ మొత్తంలో ఆహారం అబ్బాస్ తీసుకోగలగడని డాక్టర్లు చెబుతున్నారు. పొట్ట లేకుండా ఉన్న వారు తీసుకునే ఆహారాన్ని అన్నవాహిక నుంచి నేరుగా చిన్న ప్రేగులకు తరలించవచ్చని కన్సల్టెంట్ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అల్ మర్జూకీ తెలిపారు. తాము పెద్ద ప్రేగు క్యాన్సర్ సర్జరీలు చాలా చేశామని, కానీ పొట్టమొత్తం తీసేసే సర్జరీని చేయడం ఇదే తొలిసారని డాక్టర్ తెలిపారు. -
కేన్సర్ చికిత్సకు త్వరలో ‘రోబో’
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రోబో మెషీన్‌ను మంజూరు చేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: కేన్సర్ శస్త్రచికిత్సల కోసం త్వరలోనే హైదరాబాద్‌కు రోబో రాబోతోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రితోపాటు తమిళనాడులోని అడయార్ ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రికి, బెంగళూరులోని కిద్వాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి కూడా కేంద్ర ప్రభుత్వం రోబోలను మంజూరు చేసింది. ఈ రోబో విలువ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఎంఎన్‌జేకు మంజూరైన కేన్సర్ రోబో మెషీన్ అత్యంత ఆధునిక వైద్య సేవలకు ఉపయోగించేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సలో అత్యాధునిక సేవలంటే ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సలే. చిన్నగాటు వేసి నొప్పిలేకుండా చేస్తున్న వాటినే ల్యాప్రోస్కోపీ చికిత్సలంటారు. దీనికి మించి మెరుగైన సేవలను రోబో అందిస్తుంది. దీనిపై ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి డెరైక్టర్ డా.జయలత స్పందిస్తూ.. రోబో మెషీన్ మంజూరైన విషయం వాస్తవమని, ఇది ఆస్పత్రికి వచ్చేందుకు ఏడాది సమయం పట్టే అవకాశముందన్నారు. దీనివల్ల కేన్సర్ రోగులకు అద్భుతమైన సేవలు అందుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేన్సర్ ఆస్పత్రులే లేకపోవడం వల్ల ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎలాంటి మేలు జరగలేదు. కాగా ఏపీనుంచి కూడా పేద రోగులు ఇప్పటికీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికే వస్తున్నారు. రోబోతో మెరుగైన సేవలు ► మంజూరైన 3 రోబో మెషీన్లు అత్యాధునికమైనవి. ► ల్యాప్రోస్కోపీ కంటే చిన్నగాటుతో శస్త్రచికిత్సలు చేయడం రోబో వల్ల సాధ్యమవుతుంది ► ఒక్కరోజులో రోగి కోలుకునే అవకాశం ఉంటుంది ► రోబో మెషీన్ ప్రొస్టేట్ కేన్సర్ శస్త్రచికిత్సలకు బాగా ఉపయోగపడుతుంది ► రోబో సర్జరీలో కడుపులోకి చొప్పించే పరికరంలో అత్యంత ఆధునిక కెమెరా ఉంటుంది. దీనికి 3 వైపుల నుంచి టిష్యూస్ను గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ► దీనివల్ల అతిపెద్ద కణితుల నుంచి, అతి సూక్ష్మమైన వాటిని తొలగించడం సాధ్యమవుతుంది ► రక్తస్రావం తగ్గిపోవడం, ఆస్పత్రిలో ఉండాల్సిన రోజులు తగ్గడం, చిన్నగాటు, త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది ► రోబోటిక్ సర్జరీకి ఒక్కో రోగికి రూ.70 వేల విలువైన డిస్పోజబుల్స్ వాడాల్సి ఉంటుంది