సీఎం జగన్‌ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం | AP CM YS Jagan Inaugurated Narco Cancer Block | Sakshi
Sakshi News home page

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Published Wed, Jul 1 2020 11:58 AM | Last Updated on Wed, Jul 1 2020 4:37 PM

AP CM YS Jagan Inaugurated Narco Cancer Block - Sakshi

సాక్షి, అమరావతి : ఆరోగ్య రంగంలో ఇప్పటికే అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేశారు. గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేన్సర్‌ బ్లాక్‌ ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి విద్యా, ఆరోగ్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. బ్రిటన్‌‌ తరహాలో గ్రామాల్లోనూ వైద్యాన్నిఅందుబాటులోకి తెస్తామని చెప్పారు. డాక్టర్‌ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో ఏడాదిలోనే కర్నూలు కూడా కేన్సర్‌ విభాగానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. (ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం)

ఎలుకలు కొరికి ప్రాణాలు పోయే పరిస్థితి నాడు
ఈ రోజు (బుధవారం) ఉదయం కొత్త 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల రక్షణ కోసం జిల్లాకు రెండు చొప్పున నియోనాటల్‌ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామని సీఎం జగన్ తెలిపారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొస్తున్నామని, రోగుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.104 అంబులెన్స్‌ల ద్వారా గ్రామాల్లో వైద్యసేవలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రతి 5 నుంచి 7 గ్రామాలకు ప్రత్యేకంగా ఓ డాక్టర్‌ను నియమిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించామని సీఎం వెల్లడించారు.104, విలేజ్ క్లినిక్‌, పీహెచ్‌సీలను అనుసంధానిస్తాని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేదని, విద్యుత్‌ సౌకర్యం లేక సెల్‌ఫోన్ లైట్లతో వైద్యం అందించిన పరిస్థితిని చూశామని నాటి గడ్డు పరిస్థితులను గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ప్రజలకు భరోసానిచ్చారు. ప్రజల ఆరోగ్య రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సీఎం పేర్కొన్నారు.

ప్రతి వ్యక్తికీ క్యూఆర్‌ కోడ్‌తో ఆరోగ్య కార్డు
‘ప్రతి పీహెచ్‌సీ సెంటర్‌కూ దాదాపుగా కనీసం ఇద్దరు డాక్టరులు ఉంటారు. అలాగే 104 అంబులెన్స్‌లో మరో డాక్టరు ఉంటారు. ప్రతి మండలానికీ కనీసం రెండు పీహెచ్‌సీలు ఉంటే.. రెండు అంబులెన్స్‌లు వాటి పరిధిలోని గ్రామాలను పంచుకుంటారు:. నెలకు కచ్చితంగా ఒక ఊరికి డాక్టరు పోయే విధంగా వ్యవస్థ ఉంటుంది. ప్రతి పేషెంటు ఆరోగ్య వివరాలు ఎలక్ట్రానిక్‌ డేటాలోకి వెళ్తాయి. పరీక్షలు చేయడమే కాకుండా వారికి మందులు ఇస్తారు. మిగిలిన రోజుల్లో ఆ డాక్టరు పీహెచ్‌సీలో ఉంటారు. యూకేలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ఇక్కడ అమలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇది విప్లవాత్మక మార్పు. ఎలక్ట్రానిక్‌ డేటాలో వివరాల నమోదు దిశగా అడుగులు ముందుకేశాం. ప్రతి వ్యక్తికీ క్యూఆర్‌ కోడ్‌తో ఆరోగ్య కార్డు ఇవ్వడం జరిగింది. డేటా ఆపరేటర్‌ వివరాలను కంప్యూటర్‌లోకి ఎక్కిస్తారు. ప్రతి వ్యక్తికీ సంబంధించి డిజిటిల్‌ ఎక్ట్రానిక్‌ రికార్డు ఉంటుంది.

గతానికి, ఇప్పటికి తేడాను గమనించాలి
104, రాబోయే రోజుల్లో విలేజ్, వార్డు క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో అనుసంధానం చేస్తాం. ఆరోగ్య రంగంలో విప్తవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గతానికి, ఇప్పటికి తేడాను గమనించాలని కోరుతున్నాను. ఆస్పత్రుల్లో పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులను చూడమని కోరుతున్నాం. 108,104 పరిస్థితి గతంలో ఎలా ఉండేదో చూశాం. పేరుకు మాత్రమే 104. కాని వాహనాలు ఉండేవి కావు. 336 సంఖ్యలో 108 అంబులెన్స్‌లు మాత్రమే ఉండేవి. ఆస్పత్రుల్లో పరిస్థితులు కూడా ఎలా ఉండేవో చూడమని కోరుతున్నా. ఇవాళ 1088 వాహనాలకు శ్రీకారం చుట్టాం. అంబులెన్స్‌లు సరైన సమయంలో చేరకపోతే మనుషుల ప్రాణాలు పోతాయి. అంబులెన్స్‌లు వస్తాయో, లేవో అన్న పరిస్థితులు ఉంటే.. మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతుంది. 

2059 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తింపు
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులను జాతీయ ప్రమాణాలు ఉండేట్టుగా వారిని తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకూ 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే... మరో 16 మెడికల్‌ కాలేజీలను తీసుకు వస్తున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక టీచింగ్‌ ఆస్పత్రి, నర్సింగ్‌ ఆస్పత్రిని తీసుకు వస్తున్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ట్రైబల్‌ ఏరియాల్లో 7 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. పలాస, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆస్పత్రులను కడుతున్నాం. ఆరోగ్యశ్రీ రూపు రేఖలను పూర్తిగా మారుస్తున్నాం. జులై 8 నుంచి మరో ఆరు జిల్లాల్లో, నవంబర్‌ 14 నాటికి అన్ని జిల్లాల్లో 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. పక్కరాష్ట్రాల్లోని మంచి ఆస్పత్రుల్లోకూడా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కనిపిస్తున్నా తేడాలు. ప్రజలంతా గమనించాలని కోరుతున్నాం. దేవుడి దయతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement