ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్యాన్సర్ కేర్ ఆసుపత్రి
తిరుపతి తుడా: రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ చికిత్స కోసం ఇకపై చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. అంతకుమించిన అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు. ఈ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్ కేర్‌కు చిరునామాగా నిలిచే ఈ ఆసుపత్రిని రూ.190 కోట్ల వ్యయంతో 92 పడకలతో నిర్మించారు. దశలవారీగా పడకలను 300కు పెంచనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5వ తేదిన ఈ అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు.
టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం
ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి టాటా సంస్థకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాయి. ఇప్పటికే టీటీడీ సహకారంతో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం ద్వారా క్యాన్సర్ రోగులకు వైద్య సేవలందిస్తోంది. ప్రత్యేకంగా క్యాన్సర్ వైద్యానికి అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చిన టాటా సంస్థకు అలిపిరి వద్ద విలువైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణానికి ఏడాదికిపైగా ఆటంకం ఏర్పడింది. దీని నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడంతో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది.
ఆరోగ్యశ్రీ అమలుకు చర్యలు
నూతన ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సూచనల మేరకు ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీకి అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని అమలు చేస్తారు.
విస్తృతంగా అవగాహన
ఆసుపత్రికి పునాది వేసిన ఆరు నెలల నుంచే ట్రస్టు ద్వారా ఏడుగురు వైద్యుల బృందంతో జిల్లావ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తోంది. మహిళల కోసం పింక్ బస్సు ఏర్పాటు చేసి గ్రామాల్లో పరీక్షలు చేస్తోంది. రోగ లక్షణాలను గుర్తించిన వారికి తక్కువ ఖర్చుతో ఖరీదైన వైద్యాన్ని అందిస్తోంది. అలానే క్యాన్సర్ మహమ్మారిని గుర్తించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మెడికల్ హబ్‌గా తిరుపతి
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. తిరుపతిని మెడికల్ హబ్‌గా చేస్తోంది. నాడు–నేడు ద్వారా రాయలసీమ పెద్దాసుపత్రి రుయాను రూ.450 కోట్లతో ఆధునీకరిస్తోంది. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను మరింత ఆధునీకరించి మెరుగైన వైద్యం అందిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 11న టీటీడీ శ్రీపద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోంది.
అత్యాధునిక వైద్యం
ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, సౌకర్యాలు కల్పించారు. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, పెయిన్ అండ్ పాలియేటివ్, రేడియాలజి, పాథాలజి, మైక్రో బయాలజి, బయో కెమిస్ట్రి, నాణ్యమైన ఫార్మసీ, బ్లడ్‌బ్యాంక్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది ఉంటారు. అత్యాధునిక అల్ట్రాసౌండ్, మమోగ్రామ్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్‌ఐ, లీనాట్, బ్రాకీథెరపీ, కీమోథెరపీ డేకేర్‌తో పాటు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.
‘టాటా’ సామాజిక స్పృహ
దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో టాటా ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టాటా సంస్థ వ్యాపారమేగాక సామాజిక స్పృహలోనూ ముందుంది. స్వాతంత్య్రం రాక ముందే 1941లో ముంబై పట్టణంలో టాటా మెమోరియల్ ఆసుపత్రిని నిర్మించింది. 2011లో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని కోల్‌కతాలో అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత అలమేలు మంగ చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తిరుపతిలో ఆసుపత్రిని నిర్మించింది. టాటా ట్రస్టు చైర్మన్‌గా రతన్‌టాటా, అలమేలు చారిటబుల్ ఫౌండేషన్‌కు సీఈగా సంజయ్‌చోప్రా వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి మెడికల్ డైరెక్టర్‌గా విఆర్ రమణన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది అత్యాధునిక ఆసుపత్రి
అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య సేవలతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాం. దీని నిర్మాణానికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. లాభాపేక్ష లేకుండా ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని సాధారణ ఖర్చుతో అందించడమే టాటా సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు స్విమ్స్‌తో మాత్రమే ఎంవోయూ కుదిరింది. ఆసుపత్రి సేవలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, డిఫెన్స్ సంస్థలతో ఎంవోయూ చేసుకుంటాం.
– డాక్టర్ విఆర్ రమణన్, మెడికల్ డైరెక్టర్, క్యాన్సర్ ఆసుపత్రి
వైద్య సేవలు పొందడం ఇలా
► ఆసుపత్రి టోల్ ఫ్రీ నెం: 18001036123
► ప్రతిరోజు రేడియో ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ వైద్య సేవలు
► నేరుగా ఆసుపత్రి రిసెప్షన్‌లో సంప్రదించి ఓపీ పొందవచ్చు
► ఆసుపత్రి ఓపీ సమయం: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
► ఓపీ టిక్కెట్ రుసుము: రూ.30
► పేషెంట్‌తో పాటు వచ్చే అటెండెంట్స్ విశ్రమించేందుకు ప్రత్యేకంగా ధర్మశాల నిర్మించారు. ఇందుకోసం రోజుకు రూ.100 (ఒక్కరికి) వసూలు చేస్తారు.
► అతి తక్కువ ధరలతో క్యాంటీన్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment