సిట్‌.. బాబు స్కిట్‌ | SIT report will be prepared according to Chandrababu script | Sakshi
Sakshi News home page

సిట్‌.. బాబు స్కిట్‌

Published Wed, Sep 25 2024 4:09 AM | Last Updated on Wed, Sep 25 2024 7:03 AM

SIT report will be prepared according to Chandrababu script

చంద్రబాబు స్క్రిప్ట్‌కు అనుగుణంగా నివేదిక రెడీ 

అందుకే సిట్‌ ఇన్‌చార్జ్‌గా జీ హుజూర్‌.. అనే అధికారికి బాధ్యతలు

టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తరువాయి.. తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర

ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సదరు ఐజీ వత్తాసు

నాడు పల్నాడులో పచ్చమూకల అరాచకానికి అండ.. ఊళ్లు రావణకాష్టంగా మారినా స్పందించని వైనం

ఇలాంటి అధికారి నిష్పక్షపాతంగా పని చేస్తారన్నది నీటిపై రాతలే

శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దాన్నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీమ్‌కు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చ నీయాంశమైంది. చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ ఆరోపిస్తున్నట్లు తిరుమల లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ నెయ్యి వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. 

ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచ వ్యాప్తంగా యావత్‌ హిందూ భక్తులందరూ ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల తీరు పట్ల, టీటీడీ ఈవో రెండు నాల్కల ధోరణిపై సర్వత్రా అనుమానాలు పెల్లుబుకుతుండటంతో చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ.. సర్వం భ్రష్టు పట్టించే అధికారిగా ఇప్పటికే పేరుగాంచారు.

ఇప్పుడు ఈ అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే నివేదికపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాక్షి, అమరావతి:  అనుకున్నంతా అయ్యింది.. తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. లడ్డూ ప్రసాదం వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ పేరిట తిమ్మిని బమ్మిని చేసే కుతంత్రానికి తెరతీశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్‌ను బేఖాతరు చేస్తూ.. తాము చెప్పినట్టుగా దర్యాప్తును ప్రభావితం చేయాలన్న లక్ష్యంతోనే సిట్‌ను నియమించారు. 

తానే కర్త, కర్మ, క్రియగా మారి తిరుమల లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు.. ఆ కుట్రను కప్పిపుచ్చడమే లక్ష్యంగా ఈ సిట్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే అవాస్తవ ఆరోపణలతో తిరుమల పవిత్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం దెబ్బ తీసిందన్నది బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చేసిన ఏ ఆరోపణకు కూడా ఆధారం చూపించలేకపోయారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు ఎన్‌డీడీబీ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదన్నది స్పష్టమైంది. 

ఇక కర్ణాటక సహకార పాడి రైతుల సమాఖ్య డెయిరీ (నందిని నెయ్యి)కి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని నిలదీసేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఎందుకంటే 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే తొలిసారిగా నందిని డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వకుండా మహారాష్ట్రలోని ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టిందన్నది వెల్లడైంది. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి విపరీతమైన దుర్వాసన వస్తుందని ఆహార శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఫిర్యాదులు రాని విషయాన్ని గుర్తు చేశారు. 

అన్నింటికంటే ప్రధానంగా.. నెయ్యి కల్తీ జరిగినట్టు నివేదిక వస్తే టీడీపీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేయలేదని నిపుణుల ప్రశ్నకు చంద్రబాబు ప్రభుత్వం ఖంగుతింది. దాంతో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించే కుట్ర పన్నారని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. లడ్డూ ప్రసాదం అంశంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్‌ వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. 

లడ్డూ ప్రసాదం అంశంపై హైకోర్టుగానీ సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల వ్యవహారాలపై సాధికారికత ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలపై విచారించాలని కోరారు. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లు కూడా ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో చంద్రబాబు బెంబేలెత్తారు. 

సిట్టింగ్‌ న్యాయమూర్తి ద్వారానో మరో దర్యాప్తు సంస్థ ద్వారానో విచారణ నిర్వహిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సిట్టింగ్‌ న్యాయమూర్తిగానీ ఇతర దర్యాప్తు సంస్థకు గానీ సమర్పించాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు ఎటువంటి ఆధారాలు చూపించ లేరు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేట్టుగా.. తాను చెప్పింది చేసేలా సిట్‌ ఏర్పాటు చేశారు.   

సిట్‌ ఇన్‌చార్జ్‌గా బాబు జేబులో మనిషి 
అత్యంత వివాదాస్పద అధికారి, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ బృందంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజులను సభ్యులుగా నియమించారు. కాగా, ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి పక్కా పన్నాగంతో వ్యవహరించి రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులపై దు్రష్పచారం చేశారు. 

ఎవరెవర్ని బదిలీ చేయాలి.. ఆ స్థానాల్లో ఎవర్ని నియమించాలనే జాబితాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించడం గమనార్హం. టీడీపీ కూటమి ఒత్తిడికి లొంగి ఎన్నికల కమిషన్‌ అప్పటి గుంటూరు రేంజ్‌ ఐజీగా ఉన్న పాలరాజును హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో చంద్ర­బాబు ఆదేశాలతో దగ్గుబాటి పురందేశ్వరి సూచించిన జాబితాలోని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఐజీగా నియమించింది. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ రౌడీమూకలు చెలరేగిపోయి విధ్వంసకాండ సృష్టించడం తెలిసిందే. 



ప్రధానంగా పల్నాడులో టీడీపీ కూటమి గూండాలు దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించారు. మాచర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ రౌడీలు దాడులు చేశారు. అప్పటి గురజాల ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాసు మహేశ్‌ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గురజాలలో బాంబు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు వేయకుండా పచ్చ రౌడీలు దాడులతో విధ్వంసం సృష్టించారు. 

టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఎంతగా ఫిర్యాదులు చేసినా సరే.. సర్వశ్రేష్ఠ త్రిపాఠి పట్టించుకోలేదు. పోలింగ్‌ రోజున కనీసం ఫోన్లకు కూడా స్పందించ లేదు. అదీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ట్రాక్‌ రికార్డ్‌. అంతటి వివాదాస్పద అధికారిని చంద్రబాబు ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై ఏర్పాటు చేసిన సిట్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. అంటే ఇక సిట్‌ దర్యాప్తు ఎలా సాగుతుందో.. నివేదిక ఎలా ఉండనుందో ఊహించుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

నిబద్ధులైన అధికారులను కాదని..  
సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించేందుకు ఐజీలు వినీత్‌బ్రిజ్‌లాల్, పీహెచ్‌డీ రామకృష్ణ, ఆకే రవి కృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది. కానీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నిజాయితీపరుడు, ముక్కుసూటి అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన తాము చెప్పినట్టుగా తప్పుడు నివేదిక ఇవ్వరని చంద్రబాబు భావించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అడ్డగోలు వ్యవహార శైలితో విసిగిపోయిన ఆయన డెప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. 

ఇక పీహెచ్‌డీ రామకృష్ణ కూడా తాము చెప్పినట్టుగా నివేదిక ఇస్తారని చంద్రబాబుకు నమ్మకం లేదు. ఆకే రవికృష్ణ పేరు పరిశీలించారు గానీ పూర్తి నమ్మకం లేకపోవడంతో పక్కన పెట్టేశారు. అందుకే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలికిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠినే సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించారు. లడ్డూ ప్రసాదంపై తాము వ్యాప్తిలోకి తెచ్చిన దు్రష్పచారానికి అధికారిక ముద్ర వేసేలా.. తిరుమల పవిత్రతకు భంగకరంగా నివేదిక ఇచ్చి సర్వభ్రష్ఠత్వం పట్టించాలన్న చంద్రబాబు పన్నాగంలో భాగంగానే సర్వ శ్రేష్ఠ త్రిపాఠిని సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించారన్నది స్పష్టమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement