ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఆవరణలో చలిలో నిద్రిస్తున్న రోగుల సహాయకులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు రోజుకో రంగు చొప్పున వారంలో ఏడు రోజులకు ఏడు రంగుల దుప్పట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల క్రితం రెండు రంగుల దుప్పట్లను సరఫరా చేసింది. వీటిలో ఇప్పటికే చాలా వరకు చిరిగిపోగా, మరికొన్ని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. అసలే కేన్సర్, కిడ్నీ, కాలేయం వంటి భయంకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులు.. ఆపై ఎముకలు కొరికే చలిలో కప్పుకునేందుకు దుప్పటి లేక అల్లాడుతున్నారు.
ఈ పరిస్థితి ఏ ఒక్క ఆస్పత్రికో పరిమితమైంది కాదు.. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్‌టీ, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక వైపు పడకల్లేక రోగులు నేలపైనే చికిత్స పొందుతుండగా, ఉన్న పడకల్లో చాలావరకు పాడైపోయాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. రోగులకు సహాయంగా వచ్చిన బంధువుల కోసం నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో నైట్‌షెల్టర్ ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేవు. దీంతో రోగికి సహాయంగా వచ్చిన వారు ఆరుబయట చెట్టుకిందే గడపాల్సి వస్తోంది.
ప్రసూతి ఆస్పత్రుల్లో మరీ దుర్భరం
చారిత్రక ఉస్మానియా ఆస్పత్రుల్లోని ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులుకు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. గాంధీలో సరిపడు దుప్పట్లు ఉన్నప్పటికీ వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. దీంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోక పోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఇక సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణులతో పాటు వారికి సహాయంగా వచ్చిన బంధువుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది.
కేన్సర్ రోగులు విలవిల
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో చేరి, సర్జరీ తర్వాత రేడియేషన్ కోసం ఎదురు చూస్తున్న రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక.. కేవలం సర్జరీ అవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయిస్తున్నారు. సర్జరీ తర్వాత సుమారు నెలరోజుల పాటు రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి అడ్మిషన్ లేకపోవడంతో వీరంతా బయటే ఉండాల్సి వస్తోంది. ప్రైవేటుగా గదులను అద్దెకు తీసుకునే స్తోమత లేక చాలామంది ఆస్పత్రి కారిడార్లలో మగ్గుతున్నారు. పడుకునేందుకు మంచం లేక కనీసం కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో చలికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.
నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం ఇలా..
ఉస్మానియా 1169
గాంధీ 1500
నిలోఫర్ 1000 నిమ్స్ 1500
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి 450
పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి 450
సుల్తాన్ బజార్ ప్రసూతి 150
ఛాతి ఆస్పత్రి 670
ఈఎన్‌టీ 300
ఫీవర్ 330
Comments
Please login to add a commentAdd a comment