Bed sheets supply
-
రంగు దుప్పటి ఏమాయె?
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు రోజుకో రంగు చొప్పున వారంలో ఏడు రోజులకు ఏడు రంగుల దుప్పట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల క్రితం రెండు రంగుల దుప్పట్లను సరఫరా చేసింది. వీటిలో ఇప్పటికే చాలా వరకు చిరిగిపోగా, మరికొన్ని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. అసలే కేన్సర్, కిడ్నీ, కాలేయం వంటి భయంకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులు.. ఆపై ఎముకలు కొరికే చలిలో కప్పుకునేందుకు దుప్పటి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఏ ఒక్క ఆస్పత్రికో పరిమితమైంది కాదు.. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్టీ, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక వైపు పడకల్లేక రోగులు నేలపైనే చికిత్స పొందుతుండగా, ఉన్న పడకల్లో చాలావరకు పాడైపోయాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. రోగులకు సహాయంగా వచ్చిన బంధువుల కోసం నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో నైట్‌షెల్టర్ ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేవు. దీంతో రోగికి సహాయంగా వచ్చిన వారు ఆరుబయట చెట్టుకిందే గడపాల్సి వస్తోంది. ప్రసూతి ఆస్పత్రుల్లో మరీ దుర్భరం చారిత్రక ఉస్మానియా ఆస్పత్రుల్లోని ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులుకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. గాంధీలో సరిపడు దుప్పట్లు ఉన్నప్పటికీ వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. దీంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోక పోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఇక సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణులతో పాటు వారికి సహాయంగా వచ్చిన బంధువుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కేన్సర్ రోగులు విలవిల ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో చేరి, సర్జరీ తర్వాత రేడియేషన్ కోసం ఎదురు చూస్తున్న రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక.. కేవలం సర్జరీ అవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయిస్తున్నారు. సర్జరీ తర్వాత సుమారు నెలరోజుల పాటు రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి అడ్మిషన్ లేకపోవడంతో వీరంతా బయటే ఉండాల్సి వస్తోంది. ప్రైవేటుగా గదులను అద్దెకు తీసుకునే స్తోమత లేక చాలామంది ఆస్పత్రి కారిడార్లలో మగ్గుతున్నారు. పడుకునేందుకు మంచం లేక కనీసం కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో చలికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం ఇలా.. ఉస్మానియా 1169 గాంధీ 1500 నిలోఫర్ 1000 నిమ్స్ 1500 ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి 450 పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి 450 సుల్తాన్ బజార్ ప్రసూతి 150 ఛాతి ఆస్పత్రి 670 ఈఎన్టీ 300 ఫీవర్ 330 -
దుప్పట్ల పంపిణీలో తోపులాట
పశ్చిమగోదావరి, ఏలూరు (సెంట్రల్): స్థానిక కస్తూరిబా నగరపాలకసంస్థ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిర్వాసితుల శిబిరంలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. శిబిరం వద్ద నిర్వాసితులకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ హాజరయ్యారు. కేంద్రంలో సుమారు 1,000 మందికి పైగా ఆశ్రయం పొందుతుంటే 100 దుప్పట్లను మాత్రమే పంపిణీ చేసేందుకు తీసుకురావడంతో నిర్వాసితుల మ«ధ్య తోపులాట జరిగింది. తోపులాటను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అనంతరం నిర్వాసితులను వారి గదుల్లోకి తరలించడంతో పరిస్థితి సర్దుమణిగింది. నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నా తక్కువ దుప్పట్లు తీసుకువచ్చి హడావుడి చేశారంటూ బాధితులు ప్రజాప్రతినిధుల తీరుపై మం డిపడ్డారు. ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్, ఎంపీ తోట సీతారామలక్ష్మీ, కో–ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు. -
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వణుకు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 73 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 5,544 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత జూలైలో విద్యార్థులకు బెడ్షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా.. దుప్పట్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 70 బీసీ హాస్టళ్లలో 4,560 మంది చదువుకుంటున్నారు. ఇందులో 2,755 మందికి విద్యా సంవత్సరం ప్రారంభంలో బెడ్షీట్ల్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. 1,805 మంది విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో చలికి వణుకుతున్నారు. జిల్లాలోని 123 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. మొదట్లో 34,354 మందికి బెడ్షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 4,800 బెడ్షీట్ల కోసం ప్రతిపాదనలు పంపించగా 2,100 ఇటీవల రావడంతో పంపిణీ చేశామని, మరో 2,700 ఈ వారంలో వస్తాయని చెబుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో గత మార్చిలో హాస్టళ్లలో తలుపులు, కిటికీల మరమ్మతుల కోసం రూ.78 లక్షలు మంజూరు కాగా, 17 హాస్టళ్లలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో రూ.30 లక్షలతో 11 హాస్టళ్లలో మరమ్మతుల పనులు మంజూరు కాగా, అవి టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. బీసీ హాస్టళ్లకు సంబంధించి ఇటీవల రూ.58 లక్షలతో 34 హాస్టళ్లలో మరమ్మతులు నిర్వహించామని, మిగతా హాస్టళ్లలో సమస్యలు లేవని అధికారులు చెబుతుండగా ‘న్యూస్‌లైన్ విజిట్’లో అనేక బీసీ హాస్టళ్లలో కళ్లకు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. హాస్టళ్లలో విద్యార్థుల గజగజ ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలో కిటికీలకు తలుపు లేకపోవడంతో రాత్రి వేళ చల్లని గాలిని విద్యార్థులు తట్టుకోలేక పోతున్నారు. గజగజ వణుకుతూనే నిద్రపోతున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న చిరిగిన బొంతలను కప్పుకుని చలి బారి నుంచి కాపాడుకుంటున్నారు. బేలలోని కస్తూర్భా పాఠశాలలో కిటికీలకు జాలీలు విరిగిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. చెన్నూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో దుప్పట్లు పంపిణీ కాకపోవడంతో చలికి వణుకుతూనే పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. జైనూర్ మండలం మర్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటే చల్లటి నీళ్లతో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గం వసతి గృహాల్లోని విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. అయితే కొన్ని వసతిగృహాలకు అధికారులను దుప్పట్లు అప్పగించినప్పటికీ మరికొన్ని వసతిగృహాల్లో అందించలేదు. నిర్మల్ బీసీ వసతి గృహం, సారంగాపూర్ మండలం జామ్ ఎస్సీ వసతి గృహాల్లో గదులకు సరైన కిటికీలు, తలుపులు లేవు. నిర్మల్ బీసీ వసతి గృహంలో కిటికీలకు, గదులకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జామ్ ఎస్సీ వసతి గృహానికి సరైన కిటికీలు లేక విద్యార్థులు చలికి వేగలేకపోతున్నారు. దిలావర్పూర్ బీసీ వసతి గృహం కొత్తగా నిర్మించారు. అయితే స్నానపు గదుల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. బెల్లంపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 20 మందికి, బెల్లంపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం విద్యార్థులు 24 మందికి దుప్పట్లు పంపిణీ చేయలేదు.