Cargo aircraft
-
కుప్పకూలిన విమానం..
-
రక్షణ రంగంలో కొత్త అధ్యాయం
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్‌లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్‌లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్‌ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్‌బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు. కొత్త పని సంస్కృతికి నిదర్శనం ‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్‌లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.స్పెయిన్‌లో యోగా, ఇండియాలో ఫుట్‌బాల్ ‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్‌లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్‌తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్‌లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్‌బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు ‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.40 విమానాల తయారీ ఇక్కడే ఎయిర్‌బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన సీఏఎస్ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్‌బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్‌లోని సవీలేలో తయారుచేసి ఎయిర్‌బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్‌కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్లో తయారుచేస్తారు. -
పైలట్ రహిత ప్రయాణం
మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్‌పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్‌తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్తో కలిసి పని చేస్తోంది. మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్‌కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు
న్యూఢిల్లీ: ప్రయాణికుల విమానాలను కార్గో విమానాలుగా మార్చే కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు కట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌లో కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. దేశీ, విదేశీ విమానాలను పూర్తి స్థాయిలో మార్పిడి చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందని బోయింగ్ తెలిపింది. ఈ కన్వర్షన్ లైన్లో .. ఇప్పటికే ఒక మోస్తరుగా వినియోగించిన బోయింగ్ 737–800 ప్యాసింజర్ విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చనున్నారు. వచ్చే 18 నెలల్లో లైన్‌కు సంబంధించి పనులు ప్రారంభం కాగలవని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. బోయింగ్‌తో భాగస్వామ్యం.. అంతర్జాతీయ స్థాయి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) సర్వీసులను అందించడంలో తమ సామర్థ్యాలకు నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా తయారీ, ఈ–కామర్స్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత విమాన కార్గో ఏటా 6.3 శాతం వృద్ధి నమోదు చేయగలదని బోయింగ్ అంచనా వేస్తోంది. -
శంషాబాద్‌కు భారీ ‘తిమింగలం’!
సాక్షి, శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో ఆదివారం రాత్రి ఓ భారీ ‘తిమింగలం’వాలి చూపరులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది! ఒక రోజంతా సేదతీరి తిరిగి సోమవారం రాత్రి రెక్కలు కట్టుకొని రివ్వున ఎగిరిపోయింది!! ఎయిర్‌పోర్టులోకి ‘తిమింగలం’రావడం ఏమిటని అనుకుంటున్నారా? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సరుకు రవాణా విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా విమానం (ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) శంషాబాద్ విమానాశ్రయానికి అతిథిగా విచ్చేసింది. ఈ విమాన ఆకారం ఉబ్బెత్తు తలలతో ఉండే బెలూగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఇది ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్లని అని అర్థం. దుబాయ్‌లోని అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని పట్టాయా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ కార్గోను మోసుకెళ్తూ మార్గమధ్యలో ఇంధనం నింపుకోవడంతోపాటు పైలట్లు విశ్రాంతి తీసుకొనేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దీన్ని ల్యాండ్ చేశారు. విమాన ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం విమానాశ్రయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విమానం తిరిగి సోమవారం రాత్రి 7:20 గంటలకు టేకాఫ్ తీసుకొని పట్టాయా బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మౌలిక వసతుల సామర్థ్యం, సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌బస్ బెలూగా ఇక్కడ ల్యాండ్ అయిందని ఆర్జీఐఏ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్ ఏఎన్–225 మ్రియా సైతం ఇంధనం, విశ్రాంతి కోసం 2016 మే 13న శంషాబాద్‌లో ల్యాండ్ అయిందని గుర్తుచేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ఈ తెల్ల తిమింగలం ప్రత్యేకతలు ఇవీ ► ఇలాంటి ఆకారం ఉన్న విమానాలు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఐదే ఉన్నాయి. ► దీన్ని ప్రత్యేకించి విమానాల విడిభాగాల రవాణాతో పాటు అతిభారీ యంత్రాల రవాణాకు వినియోగిస్తున్నారు. ► ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. ► దీని పొడువు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు. ► బెలూగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. A wonder in the sky, a head-turner on the runway. Marvel at the majestic Airbus Beluga that has recently landed on equally majestic #HYDAirport.#FlyHYD #AirbusBeluga #Aircraft@Airbus @AAI_Official @MoCA_GoI pic.twitter.com/c5NEWKZlsl — RGIA Hyderabad (@RGIAHyd) December 5, 2022 -
రొయ్యల ఎగుమతికి విమానం
సాక్షి, విశాఖపట్నం: పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఎగరనుంది. రోజంతా పడిగాపులు కాచి.. సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల వెతలు తీరనున్నాయి. రొయ్యలు, రొయ్య పిల్లల రవాణా కోసం ప్రత్యేక విమానం కావాలన్న డిమాండ్.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల నేపథ్యంలో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. మెరైన్ కృషి ఉడాన్ పథకంలో భాగంగా నీలి విప్లవానికి ఊతమిచ్చేలా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం స్పైస్ జెట్ కార్గో విమాన సర్వీసు (బోయింగ్ 737–700) ప్రారంభం కానుంది. 18 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం చెన్నై నుంచి విశాఖ మీదుగా వారంలో 3 రోజులు (రోజు విడిచి రోజు) సూరత్‌కు, అదేవిధంగా మరో మూడు రోజులు కోల్‌కతాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చే తొలి విమానం సూరత్ వెళ్లనుంది. 2.15 గంటల్లోనే విశాఖ నుంచి సూరత్‌కు... ఉత్తరాంధ్రలో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 15 టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో 6 నుంచి 7 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి (రైలు, రోడ్డు మార్గాల్లో) అవుతున్నాయి. ఇక్కడి రొయ్యలకు సూరత్, కోల్‌కతాల్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే రొయ్య పిల్లల్ని మన రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుని గుజరాత్, పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తున్నారు. దీంతో మంచి లాభాల కోసం మన రైతులు సూరత్, కోల్‌కతాలకు ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రక్రియలో వారు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి నుంచి సూరత్‌కు తీసుకెళ్లాలంటే తొలుత ముంబయికి వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి రోడ్డు మార్గం ద్వారా గానీ విమానంలో గానీ తరలించేవారు. దీనికి 18 నుంచి 24 గంటలు సమయం పట్టేది. దీని వల్ల రొయ్యల పిల్లలకు సరైన ఆక్సిజన్ అందక మృత్యువాత పడేవి. ఆహారానికి ఉపయోగించే రొయ్యలు పాడై పనికిరాకుండా పోయేవి. ఇప్పుడా ఇబ్బందులు తొలగిపోవడంతో ఆక్వా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా సూరత్, కోల్‌కతాలకు వెళ్లే కార్గో విమాన సర్వీసు రావడం రొయ్యల ఉత్పత్తికి, ఎగుమతికి ఊతం ఇస్తుందని అంటున్నారు. ఈ విమానం విశాఖ నుంచి సూరత్‌కు 2.15 గంటల్లో, కోల్‌కతాకు 1.25 గంటల్లో వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఒక్కో విమానంలో రొయ్యలు, రొయ్య పిల్లలు కలిపి ఒకటిన్నర టన్నుల ఎగుమతికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆక్వా ఎగుమతులకు మంచి రోజులు కార్గో విమాన సర్వీసు ప్రారంభం కావడంతో రొయ్యల ఎగుమతులు పెరగనున్నాయి. ప్రయోగాత్మకంగా ఒక సర్వీసు రోజు విడిచి రోజు 135 రోజుల పాటు, మరో సర్వీసు 246 రోజుల పాటు నడపాలని నిర్ణయించారు. ఇక్కడ సరకు రవాణాకు డిమాండ్ ఉండటం వల్ల సర్వీసులు నిరంతరం కొనసాగే అవకాశాలున్నాయి. – రాజకిషోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ 30 శాతం నష్టపోయేవాళ్లం రొయ్య పిల్లల్ని సూరత్, కోల్‌కతాకు పంపించాలంటే యాతన పడేవాళ్లం. ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు చేసి రోడ్డు, రైలు మార్గాల్లో పంపించేవాళ్లం. అయినప్పటికీ ఆక్సిజన్ సరిపోక 30 శాతం పిల్లలు చనిపోయేవి. ఇప్పుడు కార్గో విమాన సేవలు రావడంతో నష్టపోము. – గరికిన కింగ్, రొయ్యల ఎగుమతిదారు, మంగమారిపేట, విశాఖపట్నం -
ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు శుభవార్త...
పారిస్ : యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగ్గజం ఎయిర్‌బస్ తన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. 2020 నాటికి ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు కూడా పడుకోని ప్రయాణించడానికి వీలుగా క్యాబిన్లలో బెర్తులను ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది. 2016 నవంబర్‌లో ఎయిర్ ఫ్రాన్స్- కేఎల్ఎం ఎకానమీ క్లాసు ప్రయాణికులకు కూడా స్లీపింగ్ బెర్త్స్ కల్పించాలనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. తక్కువ వ్యయంతో రూపొందించే ఈ బెర్తులను కాబిన్ పై భాగంలో గాని, కింది భాగంలో గాని ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్‌బస్, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సఫ్రాన్‌కు అనుబంధ సంస్థ అయిన జోడాయిక్ ఎయిరోస్పేస్ కంపెనీతో కలిసి A330 కార్గో జెట్లలో లోయర్ డెక్ స్లీపింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసే స్లీపర్ కంపార్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్న కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్ కంపార్టుమెంట్లలో సరిగ్గా సరిపోతాయని వెల్లడించింది. 2020 నాటికి A330 విమానాలకు సరిపోయే డిజైన్‌ను రూపొందించనున్నట్లు ఎయిర్‌బస్ తెలిపింది. ఈ ప్రయోగం ఫలిస్తే త్వరలోనే A330XWB ఎయిర్‌లైన్స్‌లో కూడా ఈ ప్రయోగాన్ని అమలు పరిచే అవకాశాలను అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ బస్ కాబిన్ కార్గో ప్రోగ్రామ్‌ల ముఖ్య అధిపతి జెఫ్ పిన్నర్ మాట్లాడుతూ... ఈ మార్పు ప్రయాణికుల సౌకర్యం కోసం ఒక అడుగు ముందుకు వేయడానికి నిదర్శనమని భావించవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని మిగతా ఎయిర్‌లైన్స్ వారు కూడా మెచ్చుకున్నారు. ఈ ప్రయోగానికి మంచి స్పందనే వస్తుందని అన్నారు. లోయర్ డెక్ పరిష్కారాలను చూపడంలో తమ సంస్ధకు మంచి నైపుణ్యం ఉందని జోడాయిక్ ఎయిరోస్పేస్ కాబిన్ డివిజన్ ముఖ్య అధికారి క్రిస్టోఫ్ బెర్నర్డిని కూడా చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే నేడు వేర్వేరు ఎయర్ లైన్స్ మధ్య భిన్నత్వాన్ని గుర్తించడానికి కీలక అంశంగా మారిందన్నారు. -
సముద్ర తీరంలో కూలిన విమానం
అబిద్జాన్ : పశ్చిమ ఆఫ్రికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అబిద్జాన్లోని ఐవరీ కోస్ట్ సముద్ర తీరంలో ఓ కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని రాయిటర్స్ స్పష్టం చేసింది. ఐవరీ కోస్ట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నాయి. కూలిపోయిన విమానంలో నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. మరో రెండు మృతదేహాలు వెలికి తీయాల్సి ఉండగా ఇద్దరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా విమానం కూలినట్లు అధికారులు చెబుతున్నారు. అబిద్జాన్ పెద్దమొత్తం జనాభా గల నగరం. దీంతో తీరంలో ఈ విమానం కూలిపోయిన కారణంగా ఇంకెవరైనా మృత్యువాత పడ్డారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. -
అతి పేద్ద విమానం.. వెళ్లిపోయింది!
టేకాఫ్ తీసుకున్న ‘అంటనోవ్ ఏఎన్ 225’ శంషాబాద్: దేశంలో తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైన అతి పెద్ద కార్గో విమానం ‘అంటనోవ్ ఏఎన్ 225’ శుక్రవారం అర్ధరాత్రి టేకాఫ్ తీసుకుంది. తుర్కమెనిస్థాన్ దేశంలోని తుర్కమెంబాషి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఏఎన్ 225 గురువారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో మధ్య ఆస్ట్రేలియాలోని ఓ అల్యూమినియం కంపెనీకి 117 టన్నుల పవర్ జనరేటర్‌ను తీసుకెళుతున్నారు. మార్గమధ్యంలో విశ్రాంతితోపాటు ఇంధనం నింపుకోడానికి శంషాబాద్ విమానాశ్రయంలో దీన్ని 25 గంటలపాటు నిలిపారు. రాత్రి 1.45 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుంది. ఇది ఇండోనేషియాలోని జకర్తాకు బయలుదేరినట్లు సమాచారం. ఈ అతి పెద్ద విమానానికి విమానాశ్రయ వర్గాలు ఘనంగా వీడ్కోలు పలికాయి.