శంషాబాద్ విమానాశ్రయంలో అతిపెద్ద కార్గో బెలూగా విమానం
సాక్షి, శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో ఆదివారం రాత్రి ఓ భారీ ‘తిమింగలం’వాలి చూపరులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది! ఒక రోజంతా సేదతీరి తిరిగి సోమవారం రాత్రి రెక్కలు కట్టుకొని రివ్వున ఎగిరిపోయింది!! ఎయిర్‌పోర్టులోకి ‘తిమింగలం’రావడం ఏమిటని అనుకుంటున్నారా? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సరుకు రవాణా విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా విమానం (ఏ300–600 సూపర్ ట్రాన్స్‌పోర్టర్) శంషాబాద్ విమానాశ్రయానికి అతిథిగా విచ్చేసింది.
ఈ విమాన ఆకారం ఉబ్బెత్తు తలలతో ఉండే బెలూగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఇది ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్లని అని అర్థం. దుబాయ్‌లోని అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని పట్టాయా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ కార్గోను మోసుకెళ్తూ మార్గమధ్యలో ఇంధనం నింపుకోవడంతోపాటు పైలట్లు విశ్రాంతి తీసుకొనేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దీన్ని ల్యాండ్ చేశారు. విమాన ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం విమానాశ్రయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ విమానం తిరిగి సోమవారం రాత్రి 7:20 గంటలకు టేకాఫ్ తీసుకొని పట్టాయా బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మౌలిక వసతుల సామర్థ్యం, సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌బస్ బెలూగా ఇక్కడ ల్యాండ్ అయిందని ఆర్‌జీఐఏ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్ ఏఎన్–225 మ్రియా సైతం ఇంధనం, విశ్రాంతి కోసం 2016 మే 13న శంషాబాద్‌లో ల్యాండ్ అయిందని గుర్తుచేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం.
ఈ తెల్ల తిమింగలం ప్రత్యేకతలు ఇవీ
► ఇలాంటి ఆకారం ఉన్న విమానాలు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఐదే ఉన్నాయి.
► దీన్ని ప్రత్యేకించి విమానాల విడిభాగాల రవాణాతో పాటు అతిభారీ యంత్రాల రవాణాకు వినియోగిస్తున్నారు.
► ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది.
► దీని పొడువు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు.
► బెలూగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి.
A wonder in the sky, a head-turner on the runway. Marvel at the majestic Airbus Beluga that has recently landed on equally majestic #HYDAirport.#FlyHYD #AirbusBeluga #Aircraft@Airbus @AAI_Official @MoCA_GoI pic.twitter.com/c5NEWKZlsl
— RGIA Hyderabad (@RGIAHyd) December 5, 2022
Comments
Please login to add a commentAdd a comment