రొయ్యల ఎగుమతికి విమానం | Aircraft for shrimp export from Visakhapatnam | Sakshi
Sakshi News home page

రొయ్యల ఎగుమతికి విమానం

Published Tue, Feb 25 2020 5:04 AM | Last Updated on Tue, Feb 25 2020 8:18 AM

Aircraft for shrimp export from Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఎగరనుంది. రోజంతా పడిగాపులు కాచి.. సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల వెతలు తీరనున్నాయి. రొయ్యలు, రొయ్య పిల్లల రవాణా కోసం ప్రత్యేక విమానం కావాలన్న డిమాండ్‌.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల నేపథ్యంలో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. మెరైన్‌ కృషి ఉడాన్‌ పథకంలో భాగంగా నీలి విప్లవానికి ఊతమిచ్చేలా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం స్పైస్‌ జెట్‌ కార్గో విమాన సర్వీసు (బోయింగ్‌ 737–700) ప్రారంభం కానుంది. 18 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం చెన్నై నుంచి విశాఖ మీదుగా వారంలో 3 రోజులు (రోజు విడిచి రోజు) సూరత్‌కు, అదేవిధంగా మరో మూడు రోజులు కోల్‌కతాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చే తొలి విమానం సూరత్‌ వెళ్లనుంది.  

2.15 గంటల్లోనే విశాఖ నుంచి సూరత్‌కు...
ఉత్తరాంధ్రలో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 15 టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో 6 నుంచి 7 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి (రైలు, రోడ్డు మార్గాల్లో) అవుతున్నాయి. ఇక్కడి రొయ్యలకు సూరత్, కోల్‌కతాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అలాగే రొయ్య పిల్లల్ని మన రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుని గుజరాత్, పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తున్నారు. దీంతో మంచి లాభాల కోసం మన రైతులు సూరత్, కోల్‌కతాలకు ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు.

ఈ ప్రక్రియలో వారు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి నుంచి సూరత్‌కు తీసుకెళ్లాలంటే తొలుత ముంబయికి వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి రోడ్డు మార్గం ద్వారా గానీ విమానంలో గానీ తరలించేవారు. దీనికి 18 నుంచి 24 గంటలు సమయం పట్టేది. దీని వల్ల రొయ్యల పిల్లలకు సరైన ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడేవి. ఆహారానికి ఉపయోగించే రొయ్యలు పాడై పనికిరాకుండా పోయేవి. ఇప్పుడా ఇబ్బందులు తొలగిపోవడంతో ఆక్వా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా సూరత్, కోల్‌కతాలకు వెళ్లే కార్గో విమాన సర్వీసు రావడం రొయ్యల ఉత్పత్తికి, ఎగుమతికి ఊతం ఇస్తుందని అంటున్నారు. ఈ విమానం విశాఖ నుంచి సూరత్‌కు 2.15 గంటల్లో, కోల్‌కతాకు 1.25 గంటల్లో వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఒక్కో విమానంలో రొయ్యలు, రొయ్య పిల్లలు కలిపి ఒకటిన్నర టన్నుల ఎగుమతికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆక్వా ఎగుమతులకు మంచి రోజులు
కార్గో విమాన సర్వీసు ప్రారంభం కావడంతో రొయ్యల ఎగుమతులు పెరగనున్నాయి.  ప్రయోగాత్మకంగా ఒక సర్వీసు రోజు విడిచి రోజు 135 రోజుల పాటు, మరో సర్వీసు 246 రోజుల పాటు నడపాలని నిర్ణయించారు. ఇక్కడ సరకు రవాణాకు డిమాండ్‌ ఉండటం వల్ల సర్వీసులు నిరంతరం కొనసాగే అవకాశాలున్నాయి.
– రాజకిషోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌
30 శాతం నష్టపోయేవాళ్లం 
రొయ్య పిల్లల్ని సూరత్, కోల్‌కతాకు పంపించాలంటే యాతన పడేవాళ్లం. ఆక్సిజన్‌ సిలెండర్లు ఏర్పాటు చేసి రోడ్డు, రైలు మార్గాల్లో పంపించేవాళ్లం. అయినప్పటికీ ఆక్సిజన్‌ సరిపోక 30 శాతం పిల్లలు చనిపోయేవి. ఇప్పుడు కార్గో విమాన సేవలు రావడంతో నష్టపోము. 
– గరికిన కింగ్, రొయ్యల ఎగుమతిదారు, మంగమారిపేట, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement