సాక్షి, అమరావతి: రొయ్య రైతుకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్య ధరలు తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆక్వా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల వద్ద ఉన్న రొయ్యలు పూర్తి స్థాయిలో అమ్ముడయ్యే వరకు వారికి అండగా నిలవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో సీనియర్ మంత్రుల సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ రంగంలోకి దిగింది.
కమిటీ సభ్యులైన మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు ప్రతి రోజు మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. రొయ్య ధరలను సమీక్షించి, ఆక్వా రైతులకు నష్టం కలగకుండా కమిటీ చర్యలు చేపడుతోంది. సమీపంలోని ప్రాసెస్ కంపెనీల ద్వారా రొయ్యలు కొనుగోలు చేయిస్తోంది.
రవాణాకు అవసరమైన వాహనాలను సమకూరుస్తూ క్రయవిక్రయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపి ధరలు తగ్గించే ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలకు సైతం కమిటీ సిద్ధమవుతోంది. అవసరమైతే కంపెనీల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని యోచిస్తోంది. త్వరలో మరోసారి రాష్ట్రస్థాయిలో ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
నిలకడగా కౌంట్ ధరలు
రాష్ట్రంలో ప్రస్తుతం వంద కౌంట్ రొయ్యలు రూ.190కు, 30 కౌంట్ రొయ్యలను రూ. 370కి తక్కువ కాకుండా కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన కౌంట్ ధరలూ నిలకడగానే ఉన్నాయి. 100 కౌంట్ రొయ్యలను కనీసం రూ.240కు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో 100 కౌంట్ రూ.220కు తక్కువ కాకుండా కొనాలని కంపెనీలను ఆదేశించింది.
అమెరికా, చైనా, ఈక్విడార్ దేశాల నుంచి ఆర్డర్లు ఊపందుకోగానే ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే కొంటామని కంపెనీలు చెబుతున్నాయి. వచ్చేవారంలో చైనా మార్కెట్ ఓపెన్ కానుండడంతో 100 కౌంట్ ధరలు రూ.240కు పైగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
విపక్షాలది దుష్ప్రచారం
రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ విపక్షాలు చేస్తున్నది దుష్ప్రచారం. రాష్ట్రంలో ఎక్కడా వంద కౌంట్ రూ.190కు తగ్గలేదు. ప్రతిరోజూ మార్కెట్‌ను సమీక్షిస్తూ కౌంట్ ధర రూ.240కి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలను ఆదేశించాం. అవసరమైతే కంపెనీలపై చర్యలకు సైతం ప్రభుత్వం వెనుకాడదు. ఆ అధికారాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాధికారత కమిటీకి ఇచ్చారు.
–వడ్డి రఘురాం, వైస్ చైర్మన్,అప్సడా
ఆందోళన వద్దు
రొయ్య రైతులు ఆందోళన చెందాల్సిన ప నిలేదు. వారం పదిరోజుల్లో చైనా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎగుమతులు పుంజుకుంటాయి. వందకౌంట్‌కు రూ. 240 కుపైగా ధర వస్తుంది.
– ఐపీఆర్ మోహనరాజు, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment