మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్‌పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది.
పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్‌తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్‌తో కలిసి పని చేస్తోంది.
మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్‌కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment