రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్‌లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్‌ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు.
అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్‌ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం.
వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్‌ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్‌లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్‌లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment