ప్రతీకాత్మకచిత్రం
కోల్‌కతా : దసరా వేడుకల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా మంటపాలపై ఉగ్రమూకలు దాడులతో విరుచుకుపడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉత్తర బెంగాల్‌లోని జల్పాయిగురి, కూచ్‌బెహర్, అలీపుర్దూర్, సిలిగురి ప్రాంతాల్లో దాడులకు బంగ్లాదేశ్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి.
నలుగురు జేఎంబీ ఉగ్రవాదులు దుర్గా పూజ సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారని, అలీపుర్దూర్, జల్పాయిగురి, సిలిగురిల్లో భీకర దాడులను చేపట్టాలన్నది వీరి లక్ష్యమని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఇద్దరు జేఎంబీ ఉగ్రవాదులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లా దిన్హత ప్రాంతంలో ఉన్నారని, రెండ్రోజుల్లో మరో ఇద్దరు భారత భూభాగంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది.
నేపాల్ నుంచి జేఎంబీ ఉగ్రవాదులు పేలుడు పదార్ధాలను సేకరించారని నివేదిక అంచనా వేసింది. గతంలో 2014లో బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో దుర్గా పూజ వేడుకల్లో జరిగిన పేలుడుతో రాష్ట్రంలో జేఎంబీ స్లీపర్ సెల్స్ చురుకుగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment