పుట్టింట్లో చిన్న కూతురు, మెట్టినింట్లో పెద్ద కోడలు!
ఎలా ఉంది టైటిల్?
సౌమ్యంగా, సంప్రదాయంగా ఉంది.
మరి కథో?
దశరథే రాయాలి.
మాటలు?
అవి కూడా ఆయనే.
స్క్రీన్‌ప్లే, డెరైక్షన్?
ఇక అడక్కండి. దశరథ్ మాత్రమే చేయగలరు ఇవన్నీ.
బహుశా ఆయనకు ఐడియా వచ్చి వుండదు కానీ...
దాంపత్యబంధంపై ఒక చక్కటి సినిమా తీయడానికి కావలసిన కథ, మాటలు, మలుపులు...
సర్వం... వాళ్ల పెళ్లిపుస్తకంలోనే ఉన్నాయి!
సౌమ్య, దశరథ్ భార్యాభర్తలు.
కుటుంబ అనుబంధాలకు వారధులు.
వారి వైవాహిక జీవితంలోని బాధ్యతల సంతోషాలు, సర్దుబాట్ల సంబరాలే...
ఈవారం ‘మనసే జతగా...’
కొండపల్లి దశరథ్‌కుమార్‌గా కంటే డెరైక్టర్ దశరథ్‌గా ఆయన సుపరిచితులు. కుటుంబంలో ప్రేమతో ‘సంతోషం’ నింపడం ఎలాగో తెలిసిన వ్యక్తి. ప్రశాంతంగా ఉండడమే తనకు ‘సంబరం’ అని చెప్పే ఈ డెరైక్టర్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’గా బయటివారికంటే ఇంట్లో వారి చేత కితాబులు అందుకుంటే చాలు అని హాయిగా నవ్వేస్తారు. ఆయన నవ్వులతో భార్య శేషసౌమ్య జతకలుపుతారు. తమ అనుబంధం గురించి వీరేమంటున్నారంటే...!
రెండు కుటుంబాల బంధం
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది అంటారు దశరథ్. అందుకేనేమో అత్తమామల చేత ‘మా పెద్ద కొడుకు’ అనిపించుకునేంత ఆత్మీయతను దశరథ్ పెంచుకుంటే, ‘వదిన మా అమ్మ’ అనిపించేటంత ఆప్యాయతను శేషసౌమ్య పొందారనిపించింది వీరి మాటల్లో! ‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! డిగ్రీ చదివాను. పుట్టింట్లో చిన్నకూతురుని. అత్తింట్లో పెద్దకోడలిని. అల్లుడి హోదా కోసం, అత్తింటి మర్యాదల కోసం ఆశించరు ఈయన. అమ్మవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా వారికి సపోర్ట్‌గా ఉంటారు. అందుకే ఈయన అంటే మా అమ్మానాన్నలకు అమితమైన ఇష్టం... అని ఆమె చెబుతుంటే అంతే సౌమ్యంగా నవ్వుతూ తన అభిప్రాయాలను తెలిపారు దశరథ్- ‘మేం ముగ్గురన్నదమ్ములం. మా బాల్యంలోనే అమ్మనాన్నలు చనిపోయారు. ఎలాగో‘లా’ చదివాను. తర్వాత సినిమా రంగంలోకి వచ్చాను.
బంధువుల ద్వారా సౌమ్య సంబంధం వచ్చినప్పుడు, మొదటి చూపులోనే నచ్చింది. అప్పుడే సౌమ్యకు, తన తల్లిదండ్రులకు ఒకే మాట చెప్పాను ‘నాకు ఇద్దరు తమ్ముళ్లు. వారు జీవితంలో స్థిరపడేంతవరకు నా దగ్గరే ఉంటారు. వదినగానే కాదు తల్లిగానూ వారి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని, సౌమ్య ‘సరే’ అనడంతో మా పెళ్లి నవంబర్ 13, 2005లో అయ్యింది. ఆ తర్వాత ఈ ఏడేళ్లలో ఇద్దరు తమ్ముళ్ల పెళ్లిళ్ళు అయ్యాయి. వారూ స్థిరపడ్డారు. మా ఇంట అడుగుపెట్టిన నాటి నుంచి మరుదుల పెళ్లిళ్ళ బాధ్యతలు దగ్గరుండి చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడంలో ఎక్కడా ఏ లోపమూ రానివ్వలేదు సౌమ్య. అందుకే నేను నా పని మీద దృష్టిపెట్టగలుగుతున్నాను’ అన్నారు ఈ నంది అవార్డు గ్రహీత. హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటున్న వీరికి కార్తీక, షణ్ముఖప్రియ ఇద్దరు కూతుళ్లు.
మొదటి అడుగు ‘శుభవేళ’
భార్యగానే కాదు ఇద్దరు మరుదులకు తల్లి స్థానంలో ఉండి బాధ్యతలు నిర్వర్తించాలి. అత్తమామలు లేని ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టినప్పుడు తనలో వచ్చిన ఆందోళన ఎలా సద్దుమణిగిందో సౌమ్య చెబుతూ - ‘ముందు ఆశ్చర్యపోయాను. ఆడవారు లేరు అంటే నమ్మలేనంత నీటుగా, పద్ధతిగా ఉంది ఇల్లు. వీరికి వంట దగ్గర నుంచి అన్ని పనులు వచ్చు అని తర్వాత అర్థమైంది. ఎవరినీ నొప్పించని స్వభావాలు. పరిస్థితులు త్వరగానే అర్థమయ్యాయి. వాటికి తగ్గట్టుగా నేనే మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ మధ్యే చిన్న మరిదికి కూడా పెళ్లైంది. తను వేరు కాపురం పెట్టాడు’ అని ఆమె అంటుండగా దశరథ్ మాట్లాడుతూ - ‘మేం ముగ్గురం మాకు మేమే ఒక రూల్ పెట్టుకున్నాం. పెళ్లిళ్ళు అయ్యాక అందరం ఒకే చోట ఉంటే ఏవో మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. వాటి కారణంగా విడిపోకుండా... వేరుగా ఉంటూనే ఒకరిగా ఉండాలి... అని. అలా విడిగా ఉంటూనే కలుస్తున్నాం’ అన్నారు.
ఒకే స్వభావాలు....
సినీదర్శకుని ఇల్లు అంటే కథలపై కసరత్తులు ఉంటాయి. కొన్ని ‘స్వగతాలు’ ఉంటాయి. ఇంకొన్ని సంభాషణలు ఉంటాయి. కాని, ‘మా ఇంట్లో సినిమాల గురించి అసలు ప్రస్తావనే ఉండదు’ అంటారు సౌమ్య. ‘షూటింగ్ స్పాట్‌కి ఈవిడ ఇంతవరకు రాలేదు. ఆ ఆసక్తీ చూపలేదు. కొత్తవాళ్లు, హడావుడి ఉన్న చోటికి వెళ్లడానికి అసలు ఇష్టపడదు. రెస్టారెంట్‌కైనా సరే ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలి. నాదీ అలాంటి స్వభావమే! ప్రశాంతతను ఎక్కువ కోరుకుంటాం. పెళ్లిరోజులు, పుట్టిన రోజులు ఆడంబరంగా జరుపుకోవడానికి ఇష్టపడం. మా అమ్మాయి మొదటి పుట్టినరోజు కూడా ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనా వేసుకొని, అంత మొత్తాన్ని ఒక హోమ్‌కి విరాళంగా ఇచ్చేశాం’ అంటూ తమ స్వభావాలను వెలిబుచ్చారు దశరథ్!
‘నువ్వు నేను’ అనే మాటకు దూరం...
‘కాపురంలో చిన్న చిన్న గొడవలు, మాటపట్టింపులు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. మళ్లీ ఇద్దరి మధ్య సఖ్యతను తెచ్చుకోవాలి. మా ఇద్దరిలో నేను టైమ్ సరిగ్గా కేటాయించను అని తను, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు అని నేను అనుకుంటూనే ఉంటాం. పిల్లల విషయంలోనూ కొన్ని చికాకులు చోటుచేసుకుంటూనే ఉంటాయి’ అని దశరథ్ చెబుతుంటే ‘దంపతుల మధ్య అనురాగం ఉండాలి, అహం ఉండకూడదు. మా ఇద్దరి మధ్యా అహానికి తావు ఉండదు. కాబట్టి ‘నువ్వు -నేను’ అనుకున్న సందర్భమే రాలేదు’ అన్నారు సౌమ్య.
పెళ్లంటే భార్య, భర్త మాత్రమే కాదు రెండు కుటుంబాలు ఒక కుటుంబంగా మారడం. అన్నదమ్ములు, తోడికోడళ్లు, బావమరుదులు, అత్తమామలు... ఒకరికొకరు అభిమానంగా ఉంటూ, ఆత్మీయంగా ఉండడం. ఆ సంతోషాల మధ్య తమ సంతోషాన్ని వెదుక్కోవడం. సంబరంగా జీవితాన్ని గడపడం. ఈ పదాలకు సరైన అర్థంలా అనిపించారు వీరు.
- నిర్మలారెడ్డి
పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉంటుంది. బంధువులతో కలివిడిగా ఉండటం, మరుదుల పెళ్లిళ్ళ బాధ్యతలు దగ్గరుండి చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడం...లో ఎక్కడా ఏ లోపమూ రానివ్వలేదు. అందుకే నేను నా పని మీద పూర్తి దృష్టిపెట్ట
గలుగుతున్నాను.
- దశరథ్
అమ్మవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద కొడుకుగా ఈయన వారికి సపోర్ట్‌గా ఉంటారు. అల్లుడి హోదా కోసం, అత్తింటి మర్యాదల కోసం ఆశించరు. స్నేహంగా కలిసిపోతారు.
- శేషసౌమ్య్చ
బాధ్యతలే సంతోషాలు సర్దుబాట్లే సంబరాలు!
Published Tue, Dec 17 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement