పెళ్లి కూతురికి పువ్వుల శోభ | Charm of the bride flowers | Sakshi
Sakshi News home page

పెళ్లి కూతురికి పువ్వుల శోభ

Published Wed, Feb 26 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

Charm of the bride flowers

పుట్టినింటి బంగారుతల్లి, మెట్టినింట సిరులరాణిగా, మారే శుభతరుణాన సిరిమల్లెలదే ప్రధాన అలంకరణ. ముద్దబంతిలాంటి మోము ,ముచ్చటైన వేడుకకు మురిసేవేళ గులాబీలదే అసలైన అలంకరణ. ఇంతుల నాజూకు చేతుల్లో వరసలుగా రూపుకట్టిన చామంతులదే చూడచక్కని అలంకరణ. మల్లెలు, గులాబీలు, చామంతులు.. పూలతేరులా వధువు మేనికి సింగారంలా మారితే...‘ఎంతందంగా ఉన్నావే..’ అంటూ ఆమె నవ్వులతో పోటీపడటమే సిసలైన అలంకరణ.
 
వివాహ వేడుకలలో పువ్వుల సుగంధాలదే పెద్దపీట. పెళ్లికి ముందు జరిపే సంగీత్, మెహిందీ సంబరాల్లో బంగార ం కన్నా వధువుకు పువ్వులనే ఆభరణాలుగా అలంకరించడం ట్రెండ్‌గా మారుతోంది. వధువుతో పాటూ వేడుకలో పాల్గొనే ప్రతి పడతీ పువ్వుల అలంకరణ పట్ల మక్కువ చూపుతోంది. ఉత్తరభారతదేశంలో మొదలైన ఈ కళ ఇప్పుడు దక్షిణభారతదేశపు తెలుగింటి లోగిళ్లలోనూ సందడి చేస్తోంది.
 
పువ్వుల ఎంపిక:
బంతి, చామంతి, లిల్లీ, మల్లెమొగ్గలు, గులాబీలు.. ఏ పువ్వులనైనా ఆభరణాల అలంకరణకు ఎంచుకోవచ్చు. మెడలో హారాలు, చెవి లోలాకులు, వేళ్లకు ఉంగరాలు, కాళ్లపట్టీలు, గాజులు..  అన్నీ పువ్వులే! అయితే ధరించిన దుస్తుల రంగుకు సూటయ్యేలా పువ్వుల ఎంపిక ఉండాలి.
 
ఆభరణాల తయారీకి ఎంపిక...
 ఎంపికచేసుకున్న పువ్వులు, కుందన్స్ పొదిగిన లాకెట్స్, చమ్కీ, పూసలు, ముత్యాలు, బంగారు వర్ణపు లేసు, ఇతర ఆభరణాలు... ఇవన్నీ జతచేర్చడానికి సూది-దారం.
 
మనిషి రూపురేఖలను బట్టి ఎంత పరిమాణంలో ఆభరణాలను తయారు చేయాలో ముందుగా కొలతలు తీసుకోవాలి.
 
రకరకాల రూపాల్లో పువ్వుల ఆభరణాలను నచ్చిన విధంగా తయారు చేసుకున్నాక, వాటిని లేసుకు గుచ్చాలి. ఆ పైన నచ్చిన లాకెట్స్ జత చేయాలి. చిన్న చిన్న లాకెట్స్‌లా రూపొందించిన పువ్వులను ఇతర ఆభరణాలకూ అమర్చుకోవచ్చు.
 
పువ్వుల ఆభరణాలకు విడిగా హుక్స్ అమర్చుకోవచ్చు. లేదా ఎలాంటి ఆభరణాలు అవసరం లేకుండా జరీ దారాలతోనూ కట్టేసుకోవచ్చు.
 
నోట్: పువ్వుల ఆభరణాలు త్వరగా వాడిపోకుండా తయారీలో మొగ్గలు ఎక్కువ ఉపయోగించాలి. చల్లదనం ఉంటే పువ్వులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
 
మాఘమాసం పెళ్లి పందిళ్లు పువ్వుల అలంకరణతో మెరిసిపోతే... అతివల నగుమోము ఇలా పువ్వుల ఆభరణాల మధ్య మురిసిపోతుంది.
 
 - నిర్మలారెడ్డి
 మోడల్: గ్రీష్మ, ఫొటోలు: శివమల్లాల

 
 - కల్పన
 పువ్వుల ఆభరణాల నిపుణురాలు
 www.pellipoolajada.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement