వయసు పైబడడం, ఆరోగ్యం, వంశపారంపర్యం, పని ఒత్తిడి...
ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు ఓ బెడదలా ఇటీవల చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువు అందానికి ‘మైనస్’ అనుకోవడం కన్నా.. దానినే ‘ప్లస్’గా మార్చుకుంటే మేలు అని భావించేవారి కోసమే ఈ కథనం...
సాధారణంగా అన్ని షాపులలో జీరో (0) నుంచి ఫార్టీ (40) సైజ్ లోపు కొలతలలో రకరకాల దుస్తులు లభిస్తున్నాయి. నలభై కన్నా పై కొలతలలో ఉన్నవారిని ‘ప్లస్ సైజ్’ అంటారు. ఈ సైజ్ వారికి డ్రెస్సులు కావాలంటే మాత్రం ‘సారీ, టైలర్‌తో చెప్పి కుట్టించుకోండి..’ అని సలహా ఇస్తుంటారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుని సరైన కొలతలలో లేని దుస్తులు తెచ్చుకొని ఇబ్బంది పడటం, టైలర్ సరైన కొలతలలో డ్రెస్ కుట్టకపోవడం, తమ శరీరాకృతికి సరిపడా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, డిజైన్ చేయించుకోవాలో తెలియకపోవడం.. ఇవన్నీ అధికబరువు (ప్లస్ సైజ్) ఉన్నవారి ప్రధాన సమస్యలు. లావుగా ఉన్నా అందంగా, కాలానుగుణంగా వేషధారణ హుందాగా ఉండాలంటే... దుస్తుల ఎంపిక సరిగ్గా ఉండాలి. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటేమీ జీవనశైలి మరింత సులభంగా, మరింత సుందరంగా మారిపోతుంది.
మీ శరీరాకృతి లావుగా ఉంటే...
బాధాపడాల్సిన అవసరమే లేదు. ఫ్యాషన్ డిజైనర్లు. ప్లస్ సైజ్ ఉమన్ దుస్తుల ఎంపికకు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి...
బిగుతుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. చిన్న సైజు, బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు.
మరీ వదులుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. ‘బాగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సన్నగా కనపడతాం’ అనుకోవడం అపోహ. వేలాడుతున్నట్టుగా ఉండే దుస్తులను ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. అధికబరువున్న వారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్లస్ సైజ్ ఉమన్‌కు డిజైన్ చేసిన బ్రాండెడ్ దుస్తుల్లోనూ అన్నీ ఒకే తరహావి ఉంటాయి. ఒక్కోసారి ఆ డ్రెస్ కొలతలు మీకు నప్పకపోవచ్చు. అందుకని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకసారి కొనుగోలు చేసే దుస్తులను వేసుకొని, అద్దంలో చూసుకొని, నప్పితేనే తీసుకోవాలి.
లావుగా కనిపించే శరీర భాగాలలో ముదురు రంగులతో కవర్ చేసే డిజైన్లు గల దుస్తులను ఎంపిక చేసుకోవాలి. కాంతిమంతమైన/లేత రంగులకన్నా ఫ్యాషన్‌లో ముదురు రంగులు ఎప్పుడూ ముందుంటాయి. లావుగా ఉన్నవారు వీటిని నిరభ్యంత ధరించవచ్చు. అంతేకాదు ఈ రంగులు అధికబరువును తక్కువగా చూపిస్తాయి. వంగపండు, గోధుమ, బూడిద... రంగువి కూడా ముదురు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే టాప్ (నడుము పై భాగంలో) కలర్ ముదురు రంగులో ఎంపిక చేసుకుంటే బాటమ్ (నడుము కింది భాగంలో) లేత రంగులో తీసుకోవాలి.
అధికబరువు ఉన్నవారు దుస్తులతో ఇంకాస్త బరువును పెంచుకోకూడదు. దుస్తులకు వచ్చే పెద్ద పెద్ద బటన్స్, పెద్ద పాకెట్స్, వెడల్పాటి కుచ్చులు.. ఎదుటివారి దృష్టి పడేలా చేస్తాయి. అందుకని దుస్తులపై డిజైన్స్ ఇలా అన్నీ పెద్ద పెద్దగా ఉండేవి ఎంచుకోకూడదు. ప్యాంట్స్ అయితే బ్యాక్ పాకెట్స్‌పై, టాప్స్ అయితే చేతులు లేని జాకెట్‌పై ఎంబ్రాయిడరీ లేకుండా జాగ్రత్తపడాలి.
మీ వార్డ్‌రోబ్ నుంచితొలగించాల్సినవి..!
చాలా పొట్టిగా ఉండే షార్ట్స్ వదులుగా ఉండే ట్రౌజర్స్ పొట్టి లంగాలు (మినీ స్కర్ట్స్)
మామ్ జీన్స్ (నడుము, పిరుదుల భాగం ఎక్కువ వదులు ఉండేవి)
రిప్‌డ్ జీన్స్ (అక్కడక్కడా చిరుగులు ఉన్న జీన్ ప్యాంట్స్), కార్గో ప్యాంట్స్
బ్యాగీ జీన్స్ (పూర్తి వదులుగా ఉండేవి)
ఫిట్‌గా లేని బ్లేజర్స్
బ్యాగీ స్వెట్స్
పొడవు లంగాలు
మెరిసే రాళ్లు, కుందన్స్, చమ్కీతో చేసిన డిజైన్లు గల దుస్తులు
ఎక్కువ కుచ్చులు ఉన్న డ్రెస్సులు
పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు
రంగురంగులుగా ఉండే కౌబాయ్ బూట్లు.
‘ప్లాట్’గా పై నుంచి కిందకు ఒకే విధంగా ఉండేలాంటి దుస్తులు తీసుకోకూడదు. మహిళలు సాధారణం గా తమ వేషధారణ ఒకే రంగు (మ్యాచింగ్)లో ఉండాలనుకుంటారు. మ్యాచింగ్ అధికమైతే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. ‘కాంట్రాస్ట్’ (ఒకదానితో ఒకటి పోలిక లేనివి) కలర్స్ దుస్తులు వేసుకుంటే మేలు. ఉదా: స్కర్ట్/ప్యాంట్స్ వేసుకునేవారు అదే రంగు టీ షర్ట్ వేసుకోకూడదు. టీ షర్ట్‌పైన వేసుకునే ఓవర్‌కోట్ స్కర్ట్/ప్యాంట్ ఒకే రంగులో ఉండేలా ఎంపిక చేసుకోవాలి.
సైజ్ చార్ట్!
ఛాతీ పరిమాణం 41-45,
నడుము పరిమాణం 33-37
హిప్ (పిరుదుల)పరిమాణం 43-47 ఉన్నవారు XXSసైజ్ దుస్తులను ...
ఛాతీ పరిమాణం 77-83, నడుము 71-78 హిప్ (పిరుదుల)పరిమాణం 80-90
ఉన్నవారు XXLసైజ్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి.
ప్లస్ సైజ్ వారు ఆన్‌లైన్ చార్ట్‌ను అనుసరించవచ్చు.
అలంకరణ అనేది వస్తువుల స్థాయిని పెంచాలి. మీరు లావుగా ఉంటే ధరించే ఆభరణా లు సన్నగా ఉంటే ఏ మాత్రం కనిపించవు. అందుకని మధ్యస్థం- పెద్ద సైజున్నవి ఎంచుకోవాలి. మీ కాళ్లకు తగిన మందపాటి హీల్ ఉన్న చెప్పులు ధరించాలి. అలాగే పెద్ద పర్స్/బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. ఈ తరహా ఇతర అలంకరణ వస్తువులు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి.
నోట్: మరీ పెద్ద పెద్దవి కాకుండా... మీరు ఉన్న లావును కొద్దిగా అధిగమించేలా మాత్రమే మీ ఇతర అలంకరణ వస్తువులు ఉండాలనే విషయం మర్చిపోవద్దు. అలంకరణ సమయంలో మీ బరువు, మీ ఎత్తు సైజ్, ఎముక సామర్థ్యం.. ఇవన్నీ దృష్టిలోపెట్టుకోవాలి.
మీ వార్డ్‌రోబ్‌లోఉండాల్సివి..!
వి నెక్ గల తెల్లటి చొక్కా (బటన్ డౌన్ షర్ట్)
శరీరాకృతికి సరిగ్గా సరిపడే నలుపు రంగు డ్రెస్.
ఫిట్‌గా ఉండే లాంగ్ ప్యాంట్స్
ఫిటెడ్ బ్లేజర్స్
ప్రస్తుత కాలానికి తగ్గ దుస్తులు
మీకు మాత్రమే ప్రత్యేకం అనిపించే స్టైల్ దుస్తులు
హాఫ్ స్కర్ట్(మోకాళ్ల వరకు ఉండేది) ఎంపిక సరైనది
పొట్టను కవర్ చేసే డిజైనర్ దుస్తులు. (వీటి ఎంపికలో డిజైనర్/షాప్/ ఆన్‌లైన్ సాయం తీసుకోవచ్చు)
శరీరాకృతికి సరిగ్గా నప్పేవి, సరైన ఫిట్‌తో ఉన్న లో దుస్తులు
బెల్ట్‌లు, ఆభరణాలు, పాదరక్షలు.. వీటితోనూ మీ దుస్తుల్లో కొత్త మార్పులు తీసుకురావచ్చు.
దుస్తులు కుట్టించుకోవాలంటే...
కుర్తా, టాప్స్ టైలర్‌తో కుట్టించుకునేటప్పుడు ‘సైడ్ ఓపెన్స్’ పిరుదుల పై భాగం వరకు పెట్టించుకోవాలి. దీని వల్ల కూర్చునేటప్పుడు డ్రెస్ ముందు భాగం పొట్టమీదకు రాకుండా ఉంటుంది. వెయిస్ట్ భాగంలో బిగుతుగా ఉండే డ్రెస్ వల్ల మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది.
జాకెట్టు చేతులు కుచ్చులున్నవి డిజైన్ చేయించుకుంటే చేతులు మరింత లావుగా కనిపిస్తాయి.
లావుగా ఉన్నవారికి బ్రాడ్, ఓవర్ నెక్స్ సరిగ్గా నప్పుతాయి.
నోట్: లావుగా ఉన్నప్పటికీ పొడవుగా ఉన్నవారు... స్లీవ్స్, ప్యాంట్స్, లెగ్గింగ్స్ సరైన ఫిట్‌తో ఉండేవి తీసుకోవచ్చు. పొట్టిగా ఉంటే నిలువు చారలు ఉన్నవి, విభిన్న రకాల రంగుల్లో ఉన్న డ్రెస్సులను ఎంచుకోవాలి. చీరలు కట్టుకునేవారు కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది.
42 - 62 అంగుళాల పరిమాణంలో ఉన్నవారి కోసం సాధారణ దుస్తుల నుంచి పార్టీవేర్ వరకు ప్లస్ సైజ్ స్టోర్‌లలో అన్ని రకాల బ్రాండ్‌లలో (టాప్స్, కుర్తీస్, లెగ్గింగ్స్, జీన్స్, టీ షర్ట్స్, పార్టీవేర్, వెస్ట్రన్‌వేర్, ట్రెడిషనల్ వేర్..) నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ కాటన్, టెరీకాటన్, సిల్క్, సింథటిక్... మెటీరియల్స్‌లో లభిస్తున్నాయి.
- నిర్మలారెడ్డి
కర్టెసీ
ప్లస్ సైజ్, పంజగుట్ట, హైదరాబాద్
‘ప్లస్’ అయ్యే అలంకరణ
Published Wed, Jul 23 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement