70ల ఫ్యాషన్...ఆపాత అందాలు... | 70s Fashion & Style Icons Ideas for Women | Sakshi
Sakshi News home page

70ల ఫ్యాషన్...ఆపాత అందాలు...

Published Wed, Oct 29 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

70s Fashion & Style Icons Ideas for Women

ముస్తాబు
 
ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది అనుకున్నప్పుడల్లా ఫ్యాషన్ ఒక్కసారి ‘కమ్ బ్యాక్’ అంటూ రీల్‌ని వెనక్కి తిప్పి చూపిస్తుంది. సంప్రదాయాన్ని, ఆధునికతను వేళవించి కాంటెంపరరీ దుస్తులను క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్‌గా, లవబుల్‌గా 1970ల కాలం నాటి ఫ్యాషన్‌ని ఈ చలికాలానికి సరికొత్తగా కళ్లముందుంచుతోంది ఫ్యాషన్ ప్రపంచం.
 
ఇప్పుడంతా 70ల కాలం నాటి దుస్తులు కనువిందు చేయబోతున్నాయి. నిజం! అతివలు ఆధునికతకు బ్రేక్ ఇచ్చి పాత కాలాన్ని లాక్కొచ్చి మరీ ముందు నిలుపుతున్నారు. ఎందుకంటే కాలం ఇప్పుడు ‘రెట్రో (అనుకరణ) స్టైల్’ వెంబడి పరుగులు తీస్తోంది. వేషధారణల్లో కాస్త ఫన్ ఉండేలా, జియోమెట్రికల్ ప్రింట్స్ అబ్బురపరిచేలా డ్రెస్ డిజైనర్స్ వీటిని మరింత అందంగా కళ్ల ముందు నిలుపుతున్నారు. ‘బాంబర్ జాకెట్స్, ప్లీటెడ్ స్కర్ట్స్, క్రాప్ టాప్స్‌పైన నాడు పువ్వులు, లతల హవా నడిస్తే నేడు జియోమెట్రికల్ ప్రింట్లు సందడి చేస్తున్నాయి’ అంటున్నారు ముంబై ఫ్యాషన్ డిజైనర్ అనితా డొంగ్రే. ఇటీవల ఇండియన్ లాక్మె ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న అనితాడోంగ్రే, పూర్వి దోషి, పరిణీతా సలూజ ఫ్యాషన్ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులను తెలియజేస్తూ జియోమెట్రికల్ లైన్స్ 2014 వింటర్‌ని ఓ కొత్త కళతో చూపనున్నాయ’ని తెలిపారు. ఈ సందర్భంగా డెబ్భైల నాటి కాలపు స్టైల్స్ హైలైట్స్ జాబితాను వీరు విడుదల చేశారు.
 
ఫన్‌గా, అందంగా..!

‘ఫ్యాషన్ ఎప్పుడూ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒక ప్పుడు అకస్మాత్తుగా వెనకటి కాలమే మన ముందు నిలబడకమానదు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది. అలనాటి స్టైల్ ఇప్పుడు కొత్తగా, మరింత ఫన్‌గా, మరింత అందంగా రూపుకడుతుంది. ప్రస్తుతం కనువిందు చేస్తున్న ఈ స్టైల్స్ నాటి ట్రెండ్‌కు కొనసాగింపు’ అంటూ ఫ్యాషన్ డిజైనర్ పరిణీతా సలూజా వివరించారు. అంతేకాదు ఇప్పటి ట్రెండ్ ఇదేనంటున్నారు  పరిణీత!
 
నాడు, నేడు మేళవింపు...

‘ఫ్యాషన్‌లో ఎన్ని పోకడలు వచ్చినా రెట్రో వైపు దృష్టి ఎప్పుడూ వెళుతూనే ఉంటుంది’ అని తెలిపారు హైదరాబాద్ లఖోటియా ఫ్యాషన్ ఇన్‌స్ట్యూట్ డిజైనర్ అయేషా! అయితే 70ల కాలం నాటి డ్రెస్సులు, పూర్తి కాపీ అనడానికి వీల్లేదు అంటారీమె! ‘గుడ్డిగా వాటిని అనురించాలనీ లేదు. పాత కథకు కొత్త ముగింపు ఇచ్చినట్టుగా నాటి వేషధారణలోనే సరికొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చు’ అంటూ కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ‘లూప్ స్లీవ్‌లెస్’ 70ల కాలంలోనూ ఉన్నాయి. కానీ, దీంట్లోనే కొన్ని స్టైలిష్ కట్స్‌తో ఇప్పుడు పూర్తి కొత్తదనాన్ని తీసుకురావచ్చు’అని వివరించారు. బెల్ బాటమ్స్ నాటి గొప్ప ట్రెండ్. ఇప్పుడు ఇవే కొద్ది పాటి మార్పులతో పలాజో ప్యాంట్స్‌గా అలరిస్తున్నాయి. వాటికి ఫిటెడ్ షర్ట్స్, హిప్పీ షర్ట్స్ జత చేస్తే.. మగువలు, మగవారూ హ్యాపీగా ధరింవచ్చు’ అంటూ తెలిపారు ఆమె. పలాజో ప్యాంట్స్ చూస్తే అప్పటి స్టైలిస్ట్ ఐకాన్స్‌గా పేరొందిన ఫరా, జీనత్ అమన్‌లు గుర్తుకువస్తారు. వారు అప్పట్లో వేషధారణలో కొత్త పోకడలు సృష్టించి, స్టైలిస్ట్‌లుగా పేరొందారు. ఇప్పుడూ వారినే అనుసరించడానికి కారణం ఈ లుక్ ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండటమే!
 
పలాజో ప్యాంట్స్...

ఫ్యాషన్ డిజైనర్ పూర్వి దోషి మాట్లాడుతూ- ‘నాటి, నేటి స్టైల్స్‌ను సూచించే పలాజో ప్యాంట్స్ జంప్‌సూట్స్‌కి ఒక దారి చూపాయి. జంప్‌సూట్‌లో బాటమ్ (ప్యాంట్ అడుగు భాగాన) కొద్దిగా విచ్చు కున్నట్టు ఫ్లెయిర్‌గా ఉండటంతో బెల్‌బాటమ్‌ను తలపిస్తుంది. దీని పైన న్యారో కట్ ట్రౌజర్ ధరిస్తే ఆధునికంగా కనిపిస్తారు. ఇది యువతల శరీరసౌష్టవానికి చక్కగా సరిపోయే ఎంపిక’ అని తెలిపారు ఆమె.

రంగులు, ప్రింట్లు...
 
డెబ్భైల కాలమంతా రంగు రంగుల పువ్వుల ప్రింట్లు, మరీ కొట్టొచ్చినట్టు కన బడే ఎరుపు, గులాబీ.. మొదలైన కాంతిమంతమైన రంగులతో ఉండేవి. ‘అందుకే నాటి నేటి సమ్మేళనమైన కట్స్, కాంతిమంతమైన రంగులు, ప్రస్తుత పువ్వుల ప్రింట్లు.. ఇవన్నీ కలుపుతూనే 70ల నాటి కథనాన్ని ఇప్పుడూ సరికొత్తగా చూపించవచ్చు’ అంటారు అయేషా!
 
అయితే రెట్రో లుక్‌తో అలరించాలంటే దుస్తులే కాదు వాటికి తగిన ఆభరణాలను, ఇతర ఆలంకారాలన్నీ సరిపోలాలి అని కూడా సూచిస్తున్నారు ఈ డిజైనర్లు. తలకట్టు, తలకు వాడే క్లిప్పులు, రబ్బర్‌బ్యాండ్లు, బ్యాగులు, బెల్టులు, చెప్పులు... వంటివన్నీ కూడా 70ల కాలం నాటి స్టైల్‌ను పోలినవాటినే ఎంచుకోవాలి’ అని చెబుతున్నారు. డిజైనర్ల సూచనలు తీసుకుంటూ నాటి అలంకరణతో ఈ వింటర్‌ని సరికొత్తగా ఎంజాయ్ చేయడానికి సిద్ధమవండి.    
 
- నిర్మలారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement